కలలు: - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


కల కందాం — 
కొత్త లోకాన్ని సృష్టిద్దాం!
కల సాధిద్దాం — 
విజయశిఖరాలను అధిరోహిద్దాం!

కల తలుచుకుందాం — 
నిదురించే ప్రతిభను మేల్కొలుపుదాం!
కల నిలబెడదాం — 
నవతరాలకు నూతన బాటలు వేద్దాం!

కలలకు రెక్కలు తొడిగితే —
ఆకాశమే మనకు హద్దు!
కలలకు పట్టుదల జతచేస్తే —
అసాధ్యమే సుసాధ్యం!

కలల సాగరంలో
ఆశల నావను నడుపుదాం!
అడ్డంకుల అలలను
ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొందాం!

కలలు చిన్నవైనా —
వాటి ప్రభావం మహోన్నతం!
ఆశయాలు వ్యక్తిగతమైనా —
వాటి వెలుగులు విశ్వవ్యాప్తం!

కలలు 
మనిషి ఎదుగుదలకు తొలి మెట్టు!
కలల సాకారమే 
మానవ జీవితానికి మధురబాట!

కలలు కందాం — 
కదలి సాగుదాం!
కృషిని కొనసాగిద్దాం—
కలల్ని నిజం చేద్దాం!

మంచి కలలు కనుదాం — 
కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం!
కల సాధిద్దాం — 
చరిత్రలో నిలిచిపోదాం!

కలలే మన గమ్యానికి దిక్సూచులు —
కృషియే మన విజయానికి సోపానాలు!
ఆశయాలే మన జీవనానికి ఆభరణాలు —
సాధనలే మన అస్తిత్వానికి చిరునామాలు!

కలలు కనడం ఆరంభం —
వాటిని సాకారం చేయడం పరమార్థం!
కలలతో జీవితానికి అందం —
కలల సాఫల్యంతో జన్మ ధన్యం!

కామెంట్‌లు