పెద్దమ్మ పెరుగన్నం: - కొత్త విరిత


 నా పేరు విశాల్. నాకు ఒక చెల్లి ఉంది.
అమ్మానాన్నలతో హైదరాబాద్‌లో మా సింపుల్ ప్రపంచంలో నేను హాయిగా పెరుగుతున్నాను. నా జీవితం కూడా పెద్దగా ట్విస్టులు లేని కథే పొద్దున్నే లేవడం, స్కూల్‌కి వెళ్లడం, సాయంత్రం ఇంటికి వచ్చి చదువుకోవడం.కానీ నా రోజులో అసలైన సందడి మాత్రం మా అక్కల దగ్గర!
“అక్కలు” అంటే మీకు వెంటనే డౌట్ వస్తుంది కదా? నాకు అంతమంది అక్కలు ఎక్కడి నుంచి వచ్చారబ్బా అని!వాళ్లు మా అమ్మవాళ్ల అక్క పిల్లలు. అంటే కజిన్స్. కానీ మా ఇంట్లో “కజిన్” అనే పదానికి పెద్దగా విలువ లేదు. మా అమ్మ, పెద్దమ్మ మమ్మల్ని ఎప్పుడూ వేరుగా చూడలేదు. “మా పిల్లలు” అనే ఒక్క మాటలోనే మమ్మల్ని మొత్తం కలిపేశారు. మేము నలుగురం మా అమ్మకు, పెద్దమ్మకు పిల్లలమే!
సాయంత్రం చదువుకోవడానికి అక్కల ఇంటికి వెళ్లడం నా రోజువారీ కార్యక్రమం. చదువు ఎంత జరిగేదో దేవుడికే తెలియాలి కానీ, తినడం మాత్రం కచ్చితంగా జరిగేది!చదువుకున్నాక అక్కలతో కలిసి ఏదో ఒకటి తినేసి ఇంటికి వచ్చేవాడిని. అప్పుడప్పుడు మా అమ్మ నన్ను తీసుకెళ్లే సాకుతో పెద్దమ్మ ఇంటికి వచ్చేది. అసలు పని నన్ను తీసుకెళ్లడం కాదు… పెద్దమ్మతో కాఫీ తాగడం!
అది ఆదివారం అయితే మాత్రం మా కథ ఇంకో లెవెల్‌కి వెళ్లేది. సెలవు రోజు కాబట్టి రాత్రంతా పెద్దమ్మ ఇంట్లోనే మకాం.పెద్దమ్మ వంటలో పెద్దగా స్పెషల్ ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. ఆమె వండితే చాలు… మామూలు కూర కూడా మనకి “స్పెషల్ ఐటమ్” అయిపోయేది.
అయితే పెద్దమ్మ దగ్గర నాకు ఒక సమస్య ఉండేది.
నేను సాధారణంగా ఎక్కువ తినను. కానీ ఆ రోజు ఏదైనా బాగా నచ్చిన వంట ఉంటే మాత్రం ఇంకో ముద్ద ఎక్కువ తినాల్సిందే. ఎందుకంటే పెద్దమ్మ వడ్డించడం కాదు… ప్రేమతో తినిపిస్తుంది!
“సరిగ్గా అన్నం కలుపుకోలేవురా!” అంటూ అన్నం తనే కలిపి తినిపించేది.భోజనాలు అయిపోయాక మా అమ్మ, పెద్దమ్మ తినేవాళ్లు. వాళ్లు తిన్నాక గిన్నెలో కొంచెం అన్నం మిగిలేది.
అంతే…పెద్దమ్మ కళ్లకు అది అన్నం కాదు. మాకు మిగిలిపోయిన మరో “డేంజర్ ముద్ద”!“అరే… ఈ కాస్త అన్నం బాక్స్‌లో ఎందుకు? ఆ పెరుగు డబ్బా ఇటు ఇవ్వు!”మేమంతా అప్పటికే కడుపు పట్టుకుని కూర్చుంటాం.
“పెద్దమ్మా… వద్దు!”
“కడుపు నిండిపోయింది!”
“ఇంక తినలేం!”
పెద్దమ్మ మాత్రం వినదు.
“రేయ్… ఎదిగే వయసు మీది. ఈ ఒక్క ముద్ద ఎక్కువైపోతుందా?”అని చెప్పి, మా సమాధానం కోసం కూడా ఆగకుండా పెరుగన్నం కలిపి నోట్లో కుక్కేస్తుంది!అది ఒక్క ముద్దతో ఆగుతుందని అనుకుంటే మనదే తప్పు.
ఒక ముద్ద… రెండు ముద్దలు…తర్వాత మేము పారిపోవడం, పెద్దమ్మ పట్టుకోవడం!ఇల్లంతా మా పరుగులు. మేము తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాం. పెద్దమ్మ మాత్రం నవ్వుకుంటూ మా వెంట పడుతుంది. చివరికి ఆ పెరుగన్నం మొత్తం మమ్మల్ని వెతుక్కుంటూ మా కడుపులోకి వెళ్లిపోతుంది!వింత ఏమిటంటే…“వద్దు వద్దు” అని తింటున్నా, పెద్దమ్మ చేతితో కలిపిన ఆ పెరుగన్నం మాత్రం యమ రుచిగా ఉంటుంది.మేమే కలుపుకుంటే అదే అన్నం. పెద్దమ్మ కలిపితే మాత్రం అందులో ఏదో మ్యాజిక్!
బహుశా ఆ మ్యాజిక్ పెరుగులో ఉండదు.ఆ చేతుల్లో ఉంటుంది.
మమ్మల్ని సొంత పిల్లల్లా చూసిన ఆ చేతుల్లో…
ముద్ద పెట్టి తినిపించిన ఆ చేతుల్లో…“ఇంకో ముద్ద తిను” అంటూ ప్రేమను బలవంతంగా కడుపులోకి పంపిన ఆ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది.
పెద్దమ్మ మాకు పెరుగన్నం మాత్రమే తినిపించలేదు.ఒక ఇంటి ప్రేమను, అనుబంధాన్ని, కజిన్స్‌కి కూడా సొంత తోబుట్టువుల్లాంటి బంధం ఉంటుందని… నేర్పింది.
అందుకే పెద్దమ్మ పెరుగన్నం అంటే మజాకా కాదు…
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
So sweet excellent 👌👌