దేవుడికి ఎక్కడుంది కులభేదం: - - యామిజాల జగదీశ్
 

 

లోకసారంగర్ అనే భక్తుడు కావేరి నదిలో పవిత్రమైన నీటిని  శ్రీరంగనాథుడికి అభిషేకం చేయడానికి రోజూ ఆలయానికి తీసుకెళ్లేవాడు.
తిరుప్పాణాళ్వార్ అనే భక్తుడు కులం పేరుతో సమాజంలో చిన్నచూపుకు గురయ్యేవాడు. ఆయన రోజూ కావేరి నది ఒడ్డున నిలబడి, తన మనసులోనే శ్రీరంగనాథుడిని దర్శించుకుంటూ ఉండేవాడు. లోకసారంగర్ నీళ్లు తీసుకుని వస్తున్నప్పుడు ఆయనకు దారి ఇచ్చి పక్కకు తప్పుకునేవాడు.
ఒకరోజు తిరుప్పాణాళ్వార్ శ్రీరంగనాథుడి ధ్యానంలో పూర్తిగా మునిగిపోయి, తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా మర్చిపోయాడు.
అటుగా వస్తున్న లోకసారంగర్ దూరం నుంచే పక్కకు తప్పుకోమని గట్టిగా అరిచాడు. కానీ భగవంతుడి ధ్యానంలో ఉన్న ఆళ్వార్‌కు ఆ మాటలు వినిపించలేదు.
దీంతో తనను కావాలనే అవమానిస్తున్నాడని భావించిన లోకసారంగర్ కోపంతో ఒక రాయిని తీసి విసిరాడు. ఆ రాయి తిరుప్పాణాళ్వార్ నుదుటికి తగిలింది. నుదుటి నుంచి రక్తం కారసాగింది.
అయినా ఆళ్వార్ ధ్యానం నుంచి బయటకు రాలేదు. కొంతసేపటికి ధ్యానం నుంచి తేరుకున్నాకే తన నుదుటి నుంచి రక్తం కారుతున్న విషయాన్ని గమనించాడు.
ఇదిలా ఉండగా, లోకసారంగర్ ఆలయంలోకి వెళ్లి శ్రీరంగనాథుడిని దర్శించుకున్నాడు. అక్కడ స్వామివారి నుదుటి నుంచి కూడా రక్తం కారడం చూసి కంగుతిన్నాడు. 
అప్పుడు స్వామివారు, "సారంగా! నా భక్తుడి నుదుటికి గాయం చేశావు కదా!" అని ప్రశ్నించినట్లు కథ చెబుతుంది.
అది చూసిన లోకసారంగర్ తన తప్పు తెలుసుకుని ఎంతో బాధపడ్డాడు. వెంటనే బయటకు వచ్చి తిరుప్పాణాళ్వార్ కాళ్లపై పడి క్షమాపణ కోరాడు.
"నిజమైన భక్తుడైన మిమ్మల్ని నా భుజాలపై ఎక్కించుకుని ఆలయంలోకి తీసుకెళ్లి స్వామివారి దర్శనం చేయిస్తాను" అని వేడుకున్నాడు.
తిరుప్పాణాళ్వార్ ఎంతగా వారించినా లోకసారంగర్ వినలేదు. ఆయన్ని తన భుజాలపై ఎక్కించుకుని ఆలయంలోకి తీసుకెళ్లాడు.
శ్రీరంగనాథుడిని ప్రత్యక్షంగా దర్శించుకున్న తిరుప్పాణాళ్వార్ ఆనందానికి అవధులే లేవు!
భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే. ఆయనకు కావాల్సింది కులం కాదు, భక్తి.
మనుషులు కులం, మతం పేరుతో భేదాలు చూపించినా, భగవంతుడు మాత్రం స్వచ్ఛమైన భక్తినే చూస్తాడు.
ఇదే ఈ కథ మనకు ఇచ్చే గొప్ప సందేశం! 

కామెంట్‌లు