ప్రేమ, మనుషులు, జీవితం — కొన్ని ఆలోచనలు
ఒక పువ్వుకు పరిమళం ఉంటుంది.
మరో పువ్వును తాకితే మెత్తగా, మృదువుగా అనిపిస్తుంది.
ఇంకో పువ్వుకు కళ్లను ఆకట్టుకునే అందమైన రంగు ఉంటుంది.
మరో పువ్వు ఆకారం ఎంతో అందంగా ఉంటుంది.
ఇన్ని అందాలు ఉన్నా, కవికి పువ్వు మౌనంగానే కనిపిస్తుంది.
పువ్వు మౌనంగా ఉంటుందా? మౌనమే వేదమా? పువ్వులు మాట్లాడతాయా?
పువ్వు మౌనంగా ఉంటుందా? మౌనమే వేదమా?
ఈ ఎనిమిది వందల కోట్ల మంది మనుషుల్లో ఒక్కొక్కరికీ ఒక్కో ప్రత్యేకత ఉంది.
కానీ మన స్నేహితుల్లోనూ, బంధువుల్లోనూ, మనకు ఎదురయ్యే మనుషుల్లోనూ మనకు నచ్చిన లక్షణాల కోసం వెతుకుతుంటాం. అలా ఆశపడటంలో తప్పులేదు.
కానీ మనకు నచ్చినది ఒకరిలో లేదని, మరొకరిలో లేదని బాధపడటంలో అర్థం లేదు.
ఎవరికి లోపాలు లేవు? ఎవరు తప్పులు చేయరు?
జీవితం ఒక్కసారే. మన తర్వాతి తరాలు మనల్ని తలచుకుని మంచిగా మాట్లాడేలా జీవిద్దాం. ప్రతి ఒక్కరిలోనూ తప్పులు వెతుకుతుంటే బంధాలు మిగలవు.
ప్రతి మనిషి ముఖం ప్రత్యేకంగా ఉంటుంది. కోట్ల మందిలో ఒకరి ముఖం ఇంకొకరికి అచ్చంగా సరిపోదు. అయినా మనం ఆ తేడాలను చూసి ద్వేషించం. ఒకేలా లేని ముఖాల్లోని అందాన్ని ఆస్వాదిస్తాం.
అదే మనుషుల మనస్తత్వాల విషయానికి వస్తే మాత్రం అలా ఉండలేకపోతున్నాం.
కళ్లూ, చెవులూ, ముక్కూ, నోరూ, బుగ్గలూ, నుదురూ — వీటి ఆకారం, పొడవు, వెడల్పు, రంగుల్లో ఎన్నో తేడాలు ఉంటాయి. అందుకే కోట్లాది రకాల అందమైన ముఖాలు కనిపిస్తాయి.
అలాగే మనుషుల స్వభావాల్లోనూ ఎన్నో తేడాలు ఉంటాయి. ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన లక్షణాల కలయిక కనిపిస్తుంది. అందుకే ఒక్కొక్కరి ఆలోచన, మాట, ప్రవర్తన వేరుగా ఉంటాయి.
మనుషుల స్వభావాల్ని వర్గాలుగా విడదీసి చెప్పడానికి ఆధ్యాత్మికతా, విజ్ఞానశాస్త్రాలూ ప్రయత్నిస్తాయి. కానీ ప్రతి మనిషికీ తనదైన స్వభావం ఉంటుంది. ఇది సహజం.
అయితే, మన ముఖంలా ఇంకొకరి ముఖం ఉండాలని మనం కోరుకోం. మన స్వభావంలాగే ఇంకొకరి స్వభావం ఉండాలని మాత్రం కోరుకుంటాం.
మనకు సరిపోయే మనస్తత్వం ఉన్నవారి కోసం వెతుకుతాం. మనతో కలిసిపోయే మనిషి దొరకాలని తపిస్తాం. పైకి కాసేపు కలివిడిగా మాట్లాడితే చాలు, మనకు బాగా సరిపోయాడని అనుకుంటాం. ఆ తర్వాతే అసలు సంగతి తెలుస్తుంది.
ముఖం బయటకు కనిపిస్తుంది. మనసు మాత్రం వెంటనే అర్థం కాదు. కొంతకాలం కలిసి మెలిసి ఉంటేనే ఎవరు ఎలాంటివారో తెలుస్తుంది.
అప్పటికి మన ఆశలు నిరాశలవుతాయి. స్వభావాల్లోని తేడాలు గొడవలకు దారితీస్తాయి.
మనకు నచ్చని తేడాలు లోపాలుగా కనిపిస్తాయి. ఆ లోపాలే తప్పులుగా అనిపిస్తాయి.
కానీ ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.
ఎవరికి లోపాలు లేవు? మనలో లోపాలు లేవా? ఎవరు తప్పులు చేయరు? మనం ఎప్పుడూ తప్పులే చేయలేదా?
ఓపిక తగ్గినప్పుడు, ఎదుటివారిని భరించే మనసు లేనప్పుడు ద్వేషం మంటలా రగులుతుంది. తొందరపాటూ, కోపం హద్దులు దాటితే ప్రేమా, మంచితనమూ కనుమరుగవుతాయి.
ఇతరులు చేసిన తప్పుల్ని క్షమించలేకపోతే పగ పెరుగుతుంది. పగ పెరిగితే గొడవలు మొదలవుతాయి. గొడవలు యుద్ధాలుగా మారతాయి. ప్రేమ తగ్గిపోతుంది. జీవితాలు చెదిరిపోతాయి.
కొంతమంది పుట్టినరోజులు వస్తే సంతోషంగా జరుపుకుంటాం. మరికొందరు చనిపోయిన రోజును నరకాసురుడి మరణంలా సంబరంగా జరుపుకుంటాం.
మన తర్వాతి తరాలు మనల్ని ప్రేమతో తలచుకునేలా జీవించడం నేర్చుకుందాం. ప్రేమతో, మంచితనంతో బతుకుదాం.
మేఘాల్లాగే మనుషులూ...
కళ్లకు మిరుమిట్లు గొలిపే మెరుపులు మెరిపించేవి మేఘాలే.
చెవులు దద్దరిల్లేలా ఉరుములు ఉరిమేవీ మేఘాలే.
వరదలు తెచ్చి ఇళ్లను ముంచేసి, మనుషుల ప్రాణాలు తీసేవీ వర్షపు మేఘాలే.
కానీ మరోవైపు...
పూలు పూయించేవీ ఆ మేఘాలే.
మొక్కలు పుష్పించేలా చేసేవీ ఆ మేఘాలే.
భూమిని నీటితో తడిపి చల్లబరిచేవీ ఆ మేఘాలే.
వర్షం లేకపోతే నీరు లేదు. నీరు లేకపోతే నువ్వూ లేవు, నేనూ లేను.
మనుషులూ అంతే కదా!
ప్రతి ఒక్కరిలోనూ కొన్ని లోపాలు ఉంటాయి. వాటిని మాత్రమే చూస్తే బంధాలు నిలవవు. అందరిలోనూ మంచీ చెడూ ఉంటాయి. చెడు లేని మంచి ఎక్కడుంది?
మన స్నేహితుల్లోనూ, బంధువుల్లోనూ లోపాలున్నాయని, తప్పులు చేస్తున్నారని ఓపిక లేకుండా వారిని దూరం చేసుకుంటూ పోతే చివరకు మనకు ఎవరూ మిగలరు.
ఒంటరిగా, ఎవరూ లేని దీవిలో ఉన్నట్టుగా బతకాల్సి వస్తుంది. అప్పుడు మనమే ఒంటరితనంతో బాధపడతాం.
జీవితం ఎక్కడ మొదలైంది?
ఒక మెరుపు మెరిసింది.
రాయి, మట్టి, నీరు, గాలి — ప్రకృతిలోని పదార్థాల మధ్య జరిగిన రసాయన మార్పుల నుంచి జీవానికి అవసరమైన అణువులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత జీవం పుట్టడానికి దారితీసిన ఎన్నో మార్పులు జరిగాయి. ఒకప్పుడు ఒక్క కణంతో ఉన్న జీవం, కాలక్రమంలో ఎన్నో కణాలతో కూడిన జీవులుగా మారింది.
నీటిలో ఈదింది. నేల మీదకు వచ్చింది. చెట్లెక్కింది. ఆకాశంలోకి ఎగిరింది.
గడ్డిగా, పొదగా, పురుగుగా, చెట్టుగా, ఎన్నో జంతువులుగా, పక్షిగా, పాముగా, రాయిగా, మనిషిగా — జీవం ఎన్నో రూపాల్లో సాగింది.
జీవం ఎన్నో రూపాలు దాటి ఈ దశకు చేరుకుంది.
ఈ పరిణామ ప్రయాణానికి ఒక అర్థం లేకపోతే డార్విన్ బాధపడతాడేమో!
మరి, ఇంతటి పరిణామం తర్వాత వచ్చిన మనిషి చేసే పనులకూ, మాట్లాడే మాటలకూ, ఆలోచనలకూ ఏ అర్థమూ లేదని తేలిపోతే?
అంతా అర్థంలేని వ్యవహారమే (Absolute absurdity) అయితే?
రాత్రి పొద్దుపోయే వరకు రాస్తూ, రాస్తూ అలసిపోయినప్పుడు వచ్చిన ఆలోచనలివి.
ఉదయం కాఫీ తాగగానే ఈ ఆలోచనలన్నీ మారిపోతాయా ఏమిటి!
ఈ భూమి కథ ఎంత విచిత్రమైనది!
మన భూమి చరిత్ర ఎంతో ఆసక్తికరమైనది.
జీవం పుట్టడానికి అవసరమైన పదార్థాలు ప్రకృతిలో ఏర్పడ్డాయి. ఆ తర్వాత స్వయంగా తమ ప్రతులను తయారు చేసుకోగల అణువులు పుట్టుకొచ్చాయి. కాలక్రమంలో వాటి చుట్టూ రక్షణ పొర ఏర్పడి, తొలి జీవకణాలు ఉద్భవించాయి.
జీవం పుట్టింది.
ఇక బతకాలంటే ఆహారం కావాలి.
ఆ ఆహారం కోసం జీవులు రెండు దారుల్లో పయనించాయి.
మొదటి దారి మొక్కలది.
మొక్కలకు నేల నుంచి నీరు, పోషకాలు అందుతాయి. గాలి నుంచి కార్బన్ డై ఆక్సైడ్ తీసుకుంటాయి. సూర్యరశ్మిని ఉపయోగించి తమకు కావాల్సిన ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి.
వాటికి ఆహారం కోసం ఇంకో జీవిని చంపాల్సిన అవసరం లేదు. అందుకే వాటి జీవన విధానం మనకు ఎంతో అందంగా కనిపిస్తుంది.
అయితే వాటి మధ్య కూడా వెలుగు, నీరు, నేల కోసం పోటీ ఉంటుంది. అయినా ప్రకృతిలోని సమతుల్యతలో భాగంగా అవి పెరుగుతాయి, పూస్తాయి, ఫలిస్తాయి.
రెండో దారి జంతువులది.
వాటికి నీరు, గాలి, నేల మాత్రమే సరిపోవు. ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడతాయి. మొక్కల్ని తినడం మొదలుపెట్టాయి. కొన్ని జంతువులు ఇతర జంతువుల్ని వేటాడి తినడం మొదలుపెట్టాయి.
అలా ఒక జీవి మరో జీవికి ఆహారమైంది.
జీవుల మధ్య ఆహారం కోసం పోటీ పెరిగింది. వేట మొదలైంది. ఒక జీవి మరో జీవిని చంపి బతికే పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ పోటీ క్రమంగా ఆహారానికే పరిమితం కాలేదు. జత కోసం పోటీ, నివాసం కోసం పోటీ, తమ పరిధిని కాపాడుకోవడానికి పోటీ, నేల కోసం పోటీ — ఇలా ఎన్నో రూపాలు తీసుకుంది.
మనిషి ఎదిగేకొద్దీ ఈ పోటీలు మరింత పెరిగాయి. నేల కోసం, నీటి కోసం, సముద్రాల కోసం, ఆకాశం కోసం పోటీపడ్డాడు. ఇప్పుడు ఇతర గ్రహాల మీద కూడా కన్నేశాడు. అంతరిక్ష యుద్ధాల గురించి కథలూ సినిమాలూ తీస్తున్నాడు.
మనిషి కట్టుకున్న గోడలు
ఒకప్పుడు మనిషి ఒంటరిగా బతికే జీవి. తర్వాత గుంపులుగా జీవించడం నేర్చుకున్నాడు. కుటుంబాలు ఏర్పడ్డాయి. కుటుంబాలు పెద్దవయ్యాయి. వీధులయ్యాయి. వీధులు ఊళ్లయ్యాయి.
తర్వాత కులాలు ఏర్పడ్డాయి. కులాల తర్వాత మతాలు. మతాల తర్వాత దేశాల పేరుతో కొత్త గీతలు గీసుకున్నాడు.
మనుషుల్ని కలపాల్సిన ఈ గుర్తింపులే కొన్నిసార్లు వారిని విడదీసే గోడలుగా మారాయి.
ప్రపంచమంతా ఒక్కటిగా మారే అవకాశం ఉన్నా, మనిషి తన గుంపే గొప్పదని, తన మతమే గొప్పదని, తన దేశమే గొప్పదని పోటీ పడుతూనే ఉన్నాడు.
అందుకే యుద్ధాలు ఆగడం లేదు.
ఒక మనిషి ఆశకు ఈ భూమి సరిపోవడం లేదు. నేల కావాలి. నీరు కావాలి. సముద్రాలు కావాలి. ఇతర గ్రహాల మీద కూడా తన హక్కు చాటుకోవాలనుకుంటున్నాడు.
పక్కవాడి దగ్గర ఉన్నది తనకు కావాలి. తన దగ్గర ఉన్నది ఇంకొకడికి దక్కకూడదు.
ఇలా తన ఆశలతో, భయాలతో, పోటీలతో మనిషి తన చుట్టూ తానే ఒక సాలెగూడు అల్లుకున్నాడు.
ఆ గూడులో చిక్కుకుని ప్రశాంతంగా బతకలేకపోతున్నాడు.
దాని నుంచి బయటపడాలని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. మోక్షం కోసం భక్తి చేస్తున్నాడు. మరో జన్మ వద్దని వేడుకుంటున్నాడు.
కానీ తాను చిక్కుకున్న గూడును అల్లుతున్నది తనే అన్న సంగతి మాత్రం మరిచిపోతున్నాడు.
మనిషి నిజంగా విముక్తి పొందాలంటే ముందుగా తనలోని అత్యాశను, అహంకారాన్ని, ద్వేషాన్ని గుర్తించాలి. ఎదుటివారిలోని లోపాల్ని చూసే ముందు తనలోని లోపాల్ని చూసుకోవాలి.
ప్రతి మనిషీ మనలాగే ఆలోచించాలనీ, మనకు నచ్చినట్టే ప్రవర్తించాలనీ ఆశించడం మానుకోవాలి.
పువ్వు తన పరిమళాన్ని మనకు నచ్చేలా మార్చుకోదు. మేఘం తన స్వభావాన్ని మన కోసం మార్చుకోదు. అయినా వాటి వల్ల మనకు మేలు జరుగుతుంది.
మనుషులూ అంతే. అందరూ మనకు నచ్చినట్టే ఉండాలని ఆశించకుండా, వారి తేడాల్ని అర్థం చేసుకోవడం నేర్చుకుంటే ఎన్నో బంధాలు నిలుస్తాయి.
ప్రతి మనిషిలోనూ ఏదో ఒక అందం ఉంటుంది. దాన్ని చూడగలిగే మనసు మనకు ఉండాలి.
పువ్వు మౌనంగా ఉన్నా దాని పరిమళం మాట్లాడుతుంది.
మనిషి మాటలు మాట్లాడకపోయినా అతని మంచితనం మాట్లాడుతుంది.
ప్రేమగా జీవించడం నేర్చుకుంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం మారకపోయినా, ఆ ప్రపంచాన్ని చూసే మన చూపు మారుతుంది.
అదే మనిషికి నిజమైన స్వేచ్ఛ కావచ్చు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి