శల్య పర్వము ద్వితీయాశ్వాసము: 425 వ రోజు
బదరి పాచనము
కుబేరతీర్థం నుండి బదరిపాచనం వెళ్ళాడు. పూర్వం భరధ్వాజుని కుమార్తె అయిన ప్రభావతి ఇంద్రుడిని భర్తగా కోరి తపస్సు చేసింది. ఇంద్రుడు వశిష్టుడి వేషంలో ఆమె వద్దకు వచ్చాడు. ప్రభావతి తన కోరికను చెప్పింది. ఇంద్రుడు కొన్ని రేగుపండ్లను ఆమెకు ఇచ్చి పచనం చెయ్యమని చెప్పాడు. ఆమె శుచిగా స్నానం ఆచరించి వాటిని పొయ్యి వెలిగించి వండనారంభించింది. అవి ఎంతకూ ఉడక లేదు. ఆమె ఎంతో ప్రయత్నించి విఫలమై పాకం చెడుతుందని తన కాళ్ళను పొయ్యిలో పెట్టి ఉడకపెట్ట సాగింది. ఆమె నిష్ఠకు మెచ్చి ఇంద్రుడు " శుభాంగి నీ నిష్ఠకు మెచ్చితిని. నీవు ఈ శరీరం విడిచి దివ్యదేహం ధరించి దేవలోకం వచ్చిన ఎడల నీ కోరిక తీర్చగలను. ప్రభావతి అలాగే చేసిన పుణ్య ప్రదేశం ఇది కనుక ఈ ప్రదేశం సర్వపాపహరమైంది. రేగుపండ్లకు బదరీఫలం అనే మరొక పేరు ఉన్నది కనుక బదరిపాచనం అయింది. ఆ తరువాత బలరాముడు ఇంద్రతీర్థం వెళ్ళాడు. అక్కడ ఇంద్రుడు నూరు అశ్వమేధ యాగములు చేసాడు.
రామ తీర్థం
ఆ తరువాత బలరాముడు రామతీర్థం వెళ్ళాడు. పరశురాముడు 21 మార్లు భూప్రదక్షిణ చేసి క్షత్రియ సంహారం చేసి అంతటితో తృప్తి చెందక అశ్వమేధ యాగములు, రాజసూయ యాగములు, వాజపేయములు చేసిన ప్రదేశం అది. పరశురాముడు కశ్యపుని ఆధ్వర్యంలో ఆ యాగములు నిర్వహించి తాను జయించిన భూమినంతా కశ్యపునికి దక్షిణ నిమిత్తం ఇచ్చేసిన ప్రదేశం అది. అక్కడ నుండి బలరాముడు యామున క్షేత్రంకు వెళ్ళాడు. అక్కడ వరుణుడు ఎన్నో రాజసూయ యాగములు చేసాడు. అవి పూర్తి కాగానే దేవాసుర యుద్ధం సంభవించింది. అక్కడి నుండిబలరాముడు అదిత్యతీర్థం వెళ్ళాడు. ఆ తీర్థంలో సూర్యుడు యాగము చేసి జ్యోతిషాధిపత్యం పొందాడు. అక్కడ నుండి బలరాముడు సారస్వతం అనే పేరుగల వశిష్టతీర్థం వెళ్ళాడు. పూర్వం అక్కడ దధీచి అనే ముని ఘోరమైన తపస్సు చేసాడు. ఆ తపస్సుకు ఇంద్రుడు భయపడి తపోభంగం చేయాలని అనుకుంటాడు. దధీచి తపో భంగం చేయడానికి అలంబుస ' అనే అప్సరసను పంపాడు. దధీచికి అలంబసని చూసి రేతః పతనం అయింది. ఆ రేతస్సును సరస్వతీనది తనలో దాచుకుంది. ఆ కారణంగా సరస్వతీనది ఒక కుమారుని కని అతడిని తీసుకుని వెళ్ళి " మహామునీ ! ఇతడు నీ కుమారుడు. నీ నుండి పతనమైన రేతస్సును భద్రపరచి కుమారుడిని కన్నాను " అని చెప్పింది. దధీచి ఆ కుమారుని ఆలింగనం చేసుకుని సరస్వతీవదితో " అమ్మా ! నీవు బ్రహ్మసరస్సున పుట్టావు, పుణ్యనదులలో మేటివి, నీ జలములలో పితృదేవతలకు తర్పణం విడిచి విశ్వదేవతలు, పితృదేవతలు, గంధర్వులు తృప్తి చెందుతారు. ఈ కుమారుడు నీ పేరుతో సారస్వతుడు అని పిలువబడతాడు. ఇప్పటి నుండి రాబోయే 12 సంవత్సరాలకు తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. సారస్వతుడు మహా మునులను ఆ కరువు నుండి రక్షించి వేదాధ్యయనం చేయిస్తాడు " అని చెప్పి ఆ కుమారుడిని సరస్వతీనదికి ఇచ్చివేసాడు. ఆ సమయంలో దేవాసురయుద్ధం వచ్చింది. ఇంద్రుడికి అసురసంహారానికి ప్రశస్థమైన ఆయుధం కావలసి వచ్చింది. దేవతలు ధధీచిని ప్రార్ధించి అతడి వెన్నెముకను ఆయుధము నిమిత్తం అడిగాడు. ధధీచి తన దేహత్యాగం చేసి వెన్నెముకను ఇచ్చాడు. ఇంద్రుడు ఆ ఆయుధముతో యుద్ధం చేసి రాక్షసులను జయించాడు . తరువాత 12 సంవత్సరాలకు తీవ్ర క్షామం వచ్చింది. సారస్వతుడు మహా మునులందరినీ చేరదీసి సరస్వతీనదీ తీరమున వేదాధ్యనం చేయించాడు.
వృద్ధ కన్యాశ్రమం
సారస్వతం నుండి బలరాముడు వృద్ధకన్యాశ్రమం వెళ్ళాడు. వృద్ధకన్యాశ్రంలో ఖని అనే కన్య స్వర్గం మీద ఉన్న ఆపేక్షతో తీవ్ర తపమాచరించి వృద్ధురాలైంది. అప్పుడు నారదుడు ఆమె వద్దకు వచ్చి ఆమె కోరిక తెలుసుకొని " కన్యకా ! నీవు అవివాహితవు. అవివాహితలకు స్వర్గం నిషిద్ధం " అన్నాడు. అప్పుడు ఆమె " తన తపస్సులో సగం ధారపోసి యవ్వనవతియై గాలవుడు అనే ముని యొక్క కుమారుడిని వివాహము చేసుకొని ఒక్క రోజు మాత్రమే సంసారం సాగించి స్వర్గానికి బయలుదేరింది. అందుకు ఆ మునికుమారుడు బాధపడ్డాడు. ఆ వృద్ధకన్య మునికుమారుడి బాధను నివారించే విధంగా ఆ క్షేత్రంలో ఎవరైనా ఒక్క రోజు ఉపవాసం ఉండి దేవతలను, పితృ దేవతలను తృప్తి పరచిన ఎడల 50 సవత్సరాలు బ్రహ్మచర్య వ్రతం ఆచరించిన ఫలితం దక్కుతుంది " అని చెప్పి స్వర్గానికి వెళ్ళింది
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి