మళ్లీ వెనక్కి తిరిగి రావద్దు యవ్వనమా! : - - యామిజాల జగదీశ్


 యవ్వనమా! నువ్వు మళ్లీ వెనక్కి తిరిగి రావద్దు.
మరచిపోయి, అలా వదిలేసి వెళ్లిపోయిన పాత ప్రేయసుల ప్రేమలేఖల్ని ఇప్పుడు ఏం చేయాలి? కాల్చేయాలా? నేలలో పాతిపెట్టాలా?
అలనాటి మిత్రుల జాడ లేదు. ఎన్నెన్ని మాటలూ ఎన్నెన్ని సంచారాలూ... ఇప్పుడలాంటి ఆసక్తులు లేవు.
నువ్వు వెంట తెచ్చిన బాధ్యతల్ని, అప్పుల్ని మోయడానికి ఇప్పుడు ఈ ఒంట్లో ఓపిక లేదు.
ఇప్పుడు నా జీవితంలోకి వచ్చిన ముసలితనం నా భుజంపై చేయి వేసి నాతో పాటు నడుస్తోంది.
“ఇక నువ్వు ఎవరికీ ఏదీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు” అని ఒక మంచి స్నేహితుడిలా చెబుతోంది.
ప్రపంచంలోని వింతల్ని, విచిత్రాల్ని చూసి నవ్వుకుంటూ, కాసేపు కనిపించి మాయమయ్యే ఇంద్రధనుస్సును ఆస్వాదిస్తూ కూర్చున్నాం.
నేనూ, నా ముసలితనమూ...
యవ్వనమా! నువ్వు మళ్లీ వెనక్కి తిరిగి రావద్దు.
కామెంట్‌లు