ఈ రోజు ఉదయం త్వరగానే నిద్ర లేచాను. ఆరున్నర ప్రాంతంలో షూస్ వేసుకుని కిందికి దిగాను, వాకింగ్ కోసమని.
కిందికి దిగి లిఫ్ట్ లోంచి బయటకు రాగానే, పక్కన సర్వీస్ లిఫ్ట్ లోంచి ఒక పెద్ద కుక్క, ఒక చిన్న కుక్క బయటకి వచ్చాయి, వాటి కేర్ టేకర్స్ తో పాటు. సడన్గా అవి వచ్చేసరికి, ఉలిక్కిపడి ఆగిపోయాను. వాటిని వెళ్ళనిచ్చి మెల్లిగా నడిచాను.
ఆ పెద్ద నల్ల కుక్క. షెపర్డో, బుల్ డాగో మరి! ఈ కుక్కల బ్రీడ్స్ మనకేం తెలుసు! కానీ, అదయితే హిప్పో లా భయంకరంగా ఉంది. ఇక చిన్న తెల్ల కుక్క పిల్ల, ముద్దుగా ఉంది. ఏంటో ఈ జనాలు! ముద్దుగా ఉన్న చిన్న కుక్క పిల్లలు సరే, మరీ అలా భయంకరంగా ఉన్న వాటిని ఎలా పెంచుకుంటారో? భలేదానివి అనూ! “చిన్నగా ఉన్నప్పుడు పెంచుకుని పెద్దవయ్యాక వదిలేస్తారా ఏమిటి?” అని చెప్పింది మనసు. ‘నిజమే కదా!’ అయినా, ఒక్కో జాతి కుక్క ఒక్కోలా ఉంటుంది. ఒక్కో దానికి ఒక్కో రకమైన టాలెంట్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కుక్క ఇష్టమవుతుంది. అందరూ అందం మాత్రమే చూసి పెంచుకుంటారా ఏంటి! అనుకున్నాను.
అయినా కుక్కలు పెంచుకోవాలంటే ఎంతో ఓపిక ఉండాలి! ఖర్చు కూడా ఎక్కువే. చాలా రోజుల క్రితం, మా అక్కా వాళ్ళకు ఓ కుక్క ఉండేది. ఇంట్లో వాళ్ళ ఖర్చు కంటే దానికే ఎక్కువయిపోతుంది, అని అక్క విసుక్కుంటూ ఉండేది.
ఈ కమ్యునిటీలో చాలా మందికి ఉన్నాయి కుక్కలు. వాటిని ఎంతో జాగ్రత్తగా, పిల్లల కంటే ఎక్కువ ప్రేమించేసుకుంటారు వాటిని. కుక్కలు, కుక్కల ఓనర్లూ, లాటి మాటలు అంటే వాళ్ళకి కోపాలు వచ్చేస్తాయి. అందుకే మా గ్రూప్ మెసేజెస్ లో కంప్లేయింట్స్ అయినా, నోటీసులు అయినా …, ‘డియర్ పెట్ పేరెంట్స్,’ అని అడ్రస్ చేస్తారు.
వాటిని వాక్ కి తీసుకొచ్చే కేర్ టేకర్స్, కానీ పెట్ పేరెంట్స్ కానీ, ఒక వాటర్ స్ప్రేయర్, ఒక స్కూప్ తీసుకుని వస్తారు. పీ చేస్తే వాటర్ స్ప్రే చేస్తారు. పూ చేస్తే స్కూప్ చేస్తారు. కానీ, చాలా చోట్ల, వాటి మరకలతో గ్రౌండ్ చాలా చిరాకుగా ఉంటది. అవి తొక్కకుండా ఉండటానికి, హైజంపులూ, లాంగ్ జంపులూ చేసేస్తూ ఉంటారు జనాలు. మా లాంటి పెద్దవాళ్ళు ఆ జంపులు చెయ్యలేక ఆచి తూచి అడుగులు వేస్తూ నడుస్తాం.
మెయింటెనెన్స్ టీం ఎప్పటికప్పుడు శుభ్రం చేసినా, కొన్ని చోట్ల మరకలు మిగిలిపోతూ ఉంటాయి. ఏంటో, కొంతమందికి ఉండే ఈ పెట్ సరదాల వల్ల ఇతరులకు ఇబ్బందులు, అనిపించింది. మళ్ళీ వెంటనే, అయ్యో అలా అంటే ఎలా? అవి కూడా జీవాలే! చాలామందికి అవి మంచి కంపేనియన్స్ కూడా! నిజానికి వాటికి కాస్త ట్రెయినింగ్ ఇవ్వాలి కానీ, అవే మనిషికి మంచి కాలక్షేపం.
ఈ పెట్స్ మెయింటెనెన్స్ గురించి ఎప్పటికప్పుడు నోటీసులు వచ్చినా, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా, కొన్ని ఇబ్బందులు తప్పవు. పెట్ పేరెంట్స్ కొంత శ్రద్ధగా ఉన్నా, కేర్ టేకర్స్ అంత సివిక్ సెన్స్ తో ఉండరు. అయితే పూర్తిగా కేర్ టేకర్స్ దే తప్పు అనడానికి లేదు. వాళ్లలో జాగ్రత్తగా ఉండేవాళ్లూ ఉన్నారు.
పెట్స్ నుంచి ఎదురవుతున్న ఈ చిన్న చిన్న ఇబ్బందులను తగ్గించటానికి, ఆ మధ్య కమ్యునిటీలో ఎక్కడైనా, ఒక స్పేస్ ఐడెంటిఫయ్ చేసి, దాన్ని పెట్ జోన్ గా కేటాయించాలనే ప్రపోజల్ వచ్చింది. అయితే అది ఎక్కడ కేటాయించాలి అన్న ప్రశ్న వచ్చింది వెంటనే? ఒకవేళ అది Q బ్లాక్ దగ్గర కేటాయిస్తే E బ్లాక్ దగ్గర కుక్కలు అక్కడికి వెళ్ళేదాకా ఏం చెయ్యకుండా ఉంటాయా మరి? అనుకున్నారు. దాంతో ఆ ప్రస్తావన అక్కడే ఆగిపోయింది. ఏమిటో పాపం, ఈ కుక్కల కష్టాలు!
అవునూ… కుక్కల కష్టాలు అనేస్తున్నావు! ఇది ఏ తత్పురుషం? షష్ఠీనా? పంచమీనా? అంటే, ఇవి కుక్కల యొక్క కష్టాలా? కుక్కల వలన కష్టాలా? ఏమో, ఏదయినా కావచ్చు కదా!
అలా కుక్కల గురించే అనుకుంటూ నడుస్తూ ఉండగా, నా దృష్టి అక్కడక్కడా ఉన్న బోర్డ్స్ మీద పడింది. Keep our Environment Clean! అని పెద్ద అక్షరాలు. దాని కింద ఒక కుక్క బొమ్మ! No Pee or Poop on the Grass అని పెద్ద అక్షరాలు. దాని కింద ఒక కుక్క బొమ్మ!
అవి చూడగానే ఒక పెద్ద అనుమానం వచ్చింది. ఈ బోర్డ్స్ ఎవరికోసం….? ఎవరికోసమేంటి? దాని మీద కుక్క బొమ్మలు ఉన్నాయి కదా! అవి కుక్కల కోసమే!
ఆ వెంటనే ఒక చిలిపి ఆలోచన వచ్చి పెదవులపైకి నవ్వు వచ్చింది.
కుక్కలకి ఇంగ్లీషు రాదు కదా…!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి