రోజూ ఉదయమే లేచి వాకింగ్ కి వెళ్ళాలంటే ఎంత బద్ధకంగా ఉంటుందో. పక్కమీది నుంచి కదలబుద్ది కాదు. ఈరోజూ లేవగానే, అదే ఫీలింగ్! Don’t be lazy, డియర్! అంటూ నన్ను నేను పుష్ చేసుకుని లేచాను. తీరా లేచి బయల్దేరుదాము అనుకునే లోగా, ఏదో బడ బడా శబ్దం. ఏంటా అని బాల్కనీ లోకి వెళ్ళగానే, బయట మంచి వర్షం. హుఫ్, ఇంకేం వెళ్తాను, అనుకుని, ఆహ్లాదంగా ఉన్న వెదర్ చూస్తూ, బాల్కనీ లోనే అటూ ఇటూ తిరుగుతూ, నా వాకింగ్ మొదలు పెట్టాను.
బాల్కనీలో అటూ ఇటూ నడుస్తూ, అలా కిందికి చూస్తూ ఉంటే, కింద పాత కవర్లనే రెయిన్ కోట్లుగా కప్పుకుని, లేదా ఒక గొడుగు పట్టుకుని, ఒక్కరొక్కరుగా ఇళ్ళల్లో పనిచేసే పనివాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళ చేతుల్లో భోజనం సంచీలు. చాలా మంది పొద్దు పొద్దునే, వాళ్ళ ఇళ్ళల్లో పనులు చేసుకుని, బాక్స్‌లలో టిఫిన్, లంచ్ పెట్టుకుని, ఎక్కడెక్కడినుంచో వస్తూ ఉంటారు. కొంతమంది మధ్యాహ్నం వెళ్ళిపోతే. మరి కొంతమంది సాయంత్రం దాకా ఉంటారు. వానొచ్చినా, వరదొచ్చినా వీళ్ళకు పనులకు రావటం తప్పదు కదా! ఎంత కష్టం.
సర్లే! వాళ్ళు మాత్రం లీవులు తీసుకోరా ఏంటి? చెప్పా పెట్టకుండా డుమ్మాలు కూడా కొడుతూనే ఉంటారు. ఏ జాబైనా వాళ్ళ, వాళ్ళ టైం ని బట్టి వెళ్ళాల్సి ఉంటుంది. తప్పదు కదా! నిజమే, ఇదీ ఒక జాబే! కానీ, మరీ ఇంత ఉదయం ఇలా వానలో, ఇంతింత దూరాలు నడిచి, షేర్ ఆటోలు పట్టుకుని రావాలి. ఎంత కష్ట జీవులో!
అయినా పని చేయించుకునేవాళ్ళు కూడా ఆలోచించాలి. అందరికీ ఈ మెయిడ్స్ మీద ఆధారపడటం అలవాటయింది. వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకుని, కొంచెం వెసులుబాటు ఇవ్వాలి. కాస్త పెద్దమనసు చేసుకుని, ఇవాళ ఊర్కోలే తల్లీ, మేము చేసుకుంటాం పని, అని చెప్పొచ్చు కదా వాళ్ళు. ఇలా అనుకుంటూ నా బాల్కనీ వాక్ ముగించుకుని ఇంట్లోకి వచ్చాను.
నేను కాస్త కాఫీ తాగి, రిలాక్స్ అయ్యేంతలో ట్రింగ్, ట్రింగ్ అంటూ నా ఫోన్ మోగింది. ఎవరా అని చూస్తే, మా మెయిడ్. అమ్మో ఇదేంటి, ఇప్పుడు చేస్తుంది? అనుకుంటూ ఫోన్ తీసాను. ‘అమ్మా, ఫుల్ వర్షం కదమ్మా, ఇంట్లోంచి బయటకు వచ్చేలా లేదు. ఇవాళ రాలేను నేను. అంది. నాకు వెంటనే సర్రున కోపం వచ్చింది. ఏంటి తల్లీ, ఇలా సడన్ గా రానంటే ఎలా? అందరూ వస్తూనే ఉన్నారు. నీకొక్కదానికి ఏమయింది? రేపు పండుగ. బోలెడు పనులున్నాయి. వాన వెలిసాక రా. మానేస్తా అంటే కుదరదు, అని అరుస్తూ, తనేదో చెప్పటానికి ప్రయత్నిస్తుంటే కూడా వినకుండా కోపంగా పెట్టేశాను ఫోన్.
ఏం పని వాళ్ళో ఏమో, వాన అని ఒకరోజు, ఎండ అని ఒకరోజు, కడుపునొప్పో, కాలు నొప్పో అని మరొక రోజు… ఎప్పుడూ డుమ్మాలే, అని విసుక్కుంటూ, ఇంట్లో ఆ పనీ ఈ పనీ చేసుకుంటూ ఉంటే, టక్కున మనసుకి ఏదో తోచింది. ఏం చేస్తున్నావు అనూ? కాసేపు క్రితం వరకు ఏం ఆలోచించావు? ఇప్పుడేం చేస్తున్నావు? గిల్టీగా అనిపించింది. ఆ సర్లే, తను ఎప్పుడో మధ్యాహ్నానికి వస్తది. అప్పటిదాకా ఈ వాన ఉంటుందా ఏంటి? పోయిన వారమే నాలుగు లీవులు పెట్టింది. అయినా, వాళ్లు నిర్ణయించుకున్నాక మనం యెస్ అన్నా నో అన్నా, వాళ్లేం రారు, అనుకుంటూ నా పని చేసుకుంటూ పోయాను.
అబ్బే, మనసు ఊరుకుంటదా! ఎన్ని నీతులు చెప్పుకున్నావు తల్లీ నీ వాకింగులో! అంటూ లోపలి నుంచి నవ్వుతూ ఉండింది. తను వచ్చినా, రాకపోయినా నీ మర్యాద ఏది? నీ సానుభూతి ఏది? అని అడిగింది మనసు.
సర్లే ఇక రోజంతా, ఇది ఇలా నలుస్తూనే ఉంటది. దీన్ని తట్టుకోవటం కష్టం. ఎందుకులే, తన ఇబ్బంది ఏంటో రావొద్దని చెపుతానులే అనుకుని, మా పనమ్మాయికి ఫోన్ చేసి చెప్పేసాను. నా తప్పు సరి చేసుకున్నానులే అని మనసుని శాంత పరిచాను.
ఇంతలో, పాత పాటలోని లైను ఒకటి మనసులో మెదిలి నవ్వొచ్చింది. “ఎదుటివారికీ చెప్పేటందుకె నీతులు ఉన్నాయి…!”
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి