శల్య పర్వము ద్వితీయాశ్వాసము: - 423 వ రోజు
మంకణ మహర్షి
తరువాత బలరాముడు సప్తసారస్వతముకు వెళ్ళాడు. అక్కడ మంకణుడు అను మహా ముని నివసిస్తున్నాడు. పూర్వం అక్కడ గంగ బ్రహ్మదేవుడు చేసిన యాగముకు, నైశారణ్యంలోని మునులు చేసిన యాగముకు, వశిష్ఠుడు చేసిన యాగముకు, గురువు చేసిన యాగముకు, గయుడు చేసిన యాగముకు, ఉద్దాలకుడు చేసిన యాగముకు సరస్వతీనది స్త్రీ రూపమున వచ్చి వారి చేత అత్యంత గౌరవ మర్యాదలు పొందింది. అందువలన అది సప్తసారస్వతం అయింది. ఒక రోజు మంకణుడు సరస్వతీనదిలో స్నానం చేసే సమయంలో అక్కడికి సమీపంలో స్నానం చేస్తున్న స్త్రీని చూడటంతో అతనికి రేతఃపతనం అయింది. మంకణుడు దానిని ఒక కుండలో భద్రపరిచాడు. అది ఏడుగురు మహా మునులకు జన్మ ఇచ్చింది. ఒక రోజు తాపసి చేతి వేలికి చిన్న దర్భ గుచ్చుకుంది. ఆ గాయం నుండి రక్తం బదులుగా ఆకుపసరు కారసాగింది. అది చూసి మంకణుడు అది చూసిన మంకణ మహర్షి తన తపస్సు ఫలించిందని ఆనందంతో నృత్యం చేయసాగాడు. ఆ నృత్యముకు లోకములన్నీ క్షోభించాయి. అప్పుడు దేవతలు అందరూ పరమశివుని వద్దకు వెళ్ళి జరిగినది అంతా చెప్పారు. అప్పుడు ఈశ్వరుడు మంకణమహర్షి వద్దకు వెళ్ళి " ఇదేనా నీ తపస్సుకు ఫలితం. ఇదేనా ఇక నీ నాట్యం ఆపు " అన్నాడు. అని తన వేలిని మరో వేలితో గీరాడు భస్మం రాలింది. " చూసావా ఈ మాత్రం దానికేనా ఈ నాట్యం " అన్నాడు. అది చూసిన మంకణుడు సిగ్గుపడి నాట్యం ఆపివేసి ఈశ్వరుడిని శరణు వేడాడు. ఈశ్వరుడు మంకణుడి తప్పస్సు క్షీణించ కుండా వరం ఇచ్చాడు.
వశిష్టాశ్రమం
తరువాత బలరాముడు వశిష్టాశ్రమమునకు వెళ్ళాడు. అది పూర్వం విశ్వామిత్రుడి ఆశ్రమం. విశ్వామిత్రునకు వశిష్టుడి మీద మత్సరం ఉంది. విశ్వామిత్రుడు ఒకసారి సరస్వతీనదిని తలచి ఆమె ప్రత్యక్షంకాగానే వశిష్టుని తీసుకురమ్మని చెప్పాడు. వశిష్ట, విశ్వామిత్రుల తపస్సు తెలిసిన సరస్వతీనది మారు పలుక లేక వశిష్టుని వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పింది. వశిష్ఠుడు సరస్వతీనదిని చూసి " విశ్వామిత్రుని మాట వినని ఎడల మహర్షి నిన్ను శపించగలడు కనుక నేను నీతో వస్తాను "అన్నాడు. వశిష్ఠుడు తపస్సు చేసుకుంటున్న సమయంలో వశిష్టుని తన అలలతో కోసుకుని తీసుకొని విశ్వామిత్రుని వద్దకు వచ్చింది. విశ్వామిత్రుడు వశిష్టుని చంపబూనగా సరస్వతీనది వశిష్టుని తప్పించింది. విశ్వామిత్రుడు సరస్వతినది మీద కోపించి ఆమెను రక్తపుటేరుగా మారి పొమ్మని శపించాడు. రక్తము రాక్షసులకు ప్రీతి కనుక ఒక సంవత్సర కాలం సరస్వతీనది రాక్షసులకు ప్రీతిపాత్రం అయింది. ఒక సారి సరస్వతీనది వద్దకు వచ్చిన మహామునులు ఆమె అవస్థ చూసి ఆమెను అడిగి జరిగిన విషయం తెలుసుకొని తమతమ తపోబలంతో సరస్వతీ నదీ జలాలను పరిశుద్ధం చేసి పుణ్య స్నానాలు చేసారు. అప్పుడు అక్కడకు వచ్చిన రాక్షసులు కొందరు మునులతో " మహామునులారా ! మేము ఇంత వరకు బ్రాహ్మణులను ద్వేషించాము, నరమాంసం భక్షించాము, గురుజనులను పీడించాము, మహా పాతకములను చేసాము. మాకు నిష్కృతిని ప్రసాదించండి " అని వేడుకున్నారు. మహామునులు సరస్వతీ నదిని వేడుకుని రాక్షసులకు నిష్కృతి కలించమని అడిగారు. సరస్వతీనది అరుణానదిని తనలో అంతర్వాహినిని చేసి అందులో రాక్షసులను మునగమని చెప్పింది. రాక్షసులు సరస్వతీ నదిలో మునిగి రాక్షస దేహాలు విడిచి దైవత్వం పొందాడు. ఈ విషయం అంతా తెలుసుకున్న ఇంద్రుడు తాను నముచి అను రాక్షసుడిని నమ్మించి మోసగించి చంపి మూట కట్టుకున్న పాపాన్ని సరస్వతీనదీ జలాలలో మునిగి పోగొట్టుకున్నాడు " అని వైశంపాయనుడు జనమేజయునకు చెప్పాడు.
సోమతీర్థం
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి