సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 

 సామెత -395: ఈనిన పులి మీద పడ్డట్టు
****
 " ఏందవ్వా! గీ లోకంల దినదినానికి పాపం గుట్టలు గుట్టల్గా పెర్గుతుంది. ఇంగ మంచి దినాల్ని కండ్ల సూడమా ఏంది ?
"ఏంది శెల్లె? ఏం జర్గింది? గంత రందివడ్తున్నవ్? ఎవలికన్న ఏమన్నైందా ఏంది? గంత పరేషానుగున్నవ్?"
"అవునవ్వా! తల్లి కోడి లెక్క రెక్కల కింద ఆడివిల్లల్ని ఎన్నేండ్లు దాస్కొని కాపాడ్తం శెప్పు. బయిటికెళ్ళిన ఆడివిల్లలకి రచ్చనే లేదాయె."
 "అవును శెల్లే! గీ లోకంల ఆడివిల్లలు  కడ్పుల బడ్డ కానించి కట్టాలే.ఆడివిల్లల్ని ఆది శక్తి,అమ్మ అని ఓ పక్క పూజిత్తనే ఉంటరు.ఇంకో పక్క వొంకర సూపులు సూశి షిడాయిచ్చుడు,పేమ దోమని ఎంటవడుడు,ఇనకపోతే పానం తీసుడు .. గియ్యన్ని యింటుంటే టీవీలల్ల సూత్తుంటే కడ్పుల బయం జొచ్చి కాల్జేతులు ఆడుల్లేదు,కంటి మీద రెప్ప వడుడు లేదు శెల్లే."
 "అవునవ్వా! మన ఎన్క ఈదిలున్న శిట్టెమ్మక్క బిడ్డ ముచ్చెటి తెల్సుగద?"
 ఏంది శెల్లే! ఏమో అన్కున్నరు గని యిష్యం పురాగ తెల్వదు.పండక్కి పెద్నాయినోళ్ళు ఒక్క తీర్గ రమ్మని పిలిత్తే ఎల్లినం గద."
 "అగ్గో గా సయిమంలనే శిట్టెమ్మక్కోల్లింటికి సుట్టాల పేర్న అత్తింటైపోల్లు  వొచ్చిర్రు. గిన్నాళ్ళు ఎసుమంటి సోల్తి లేనోళ్ళు గిట్లెట్ల వొచ్చిర్రని మన్సుల అన్కుంటనే,ఇంటికి సొచ్చి వొచ్చినోళ్ళకి మరియాద శెయ్యకుంటే మంచిగుండదని ఉన్న నాల్గు దినాలు కోన్ని గోశి,గుడ్ల పుల్సు బెట్టి, ఊల్లె యాటని గోత్తె గద్దెచ్చి సుత వొండి పెట్టిందంట."
"అటెంక ఏమైంది శెల్లే? గాల్లేమన్న  అత్తింటి ఆత్తిల బాగమిప్పియ్యడాన్కి వొచ్చిర్రా.అస్లే పదేండ్ల కింది ముచ్చెటి.కడ్పుతో ఉందని సుత సూడకుండ కొడుకే సచ్చినంక నువ్వెందుకని కట్టుబట్టల్తో ఎల్లగొట్టిర్రు గద.గిన్నాళ్ళకి మన్వరాలి మీద మన్సు మల్లిందేంది?"
"గట్లైతే మంచిగనే వుండవ్వా. గా వొచ్చి నోళ్ళలో  ఒకడు గా పశిదాన్ని దగ్గర్కి పిల్సుడు, ముద్దుగున్నవని బుగ్గలు పునుకుడు శేత్తుంటే శిన్నది గదాని ముద్దు శేత్తుండు అన్కుందంటవ్వా!"
"పసివిల్లలంటే కొందర్కి శాన ముద్దు అన్పిత్తది.దెగ్గర కూసవెట్టుకొని గాల్లతో ముచ్చెట్లు వెడుతుంటే మా సంబురంగ అన్పిత్తది శెల్లే!
 గట్లైతే మంచిగనే వుండవ్వా! గా వొచ్చిన  ముగ్గుట్లె యిద్దరు వూరు సూత్తమని బొయ్యిర్రట.శిట్టెమ్మక్కేమో దుకాణంల సౌదలు దెత్తనని బొయ్యిందంట. సంచి బట్క బొయ్యింది గని పైసలు బట్క బోవుడు మర్శినన్నని ఎనక్కి మల్లి ఇంట్లెకి వొచ్చే తల్కి తల్పులు ఏశున్నయంట.సన్నగ బిడ్డేడ్పు యిన్పిచ్చే తల్కి ఏదో గోరం జర్గబోతుందన్పిచ్చి ఇంటెన్క నుంచి లోపల్కి బొయ్యే తల్కి గా వొచ్చిన సుట్టం బిడ్డను ఆగం జెయ్యబోవుడు సూశిందంట అవ్వా!"
"అయ్యో శెల్లే! ఎంత పాపం పాడువడ్డది.గా మొదనష్టపోడు గంత పాపాన్కి వొడిగట్టిండా?"
"అవునవ్వా! ఎంటనే శిట్టెమ్మక్క ఎన్క ముందు యిశారిచ్చకుండ గల్లవట్టి శెంపలే శెంపలే ఆయిచ్చిందంట.గంతట్తో ఆగకుండ  మీద వడి రక్కిందంట. ఇంట్లె మూలకున్న కర్ర దీస్కొని యియ్యర మయ్యర బాదిందంట.గంతట్లనే మిలిగినిద్దరు సుట్టపోళ్ళు వొచ్చిర్రట.గదంత సూశి సత్తడు ఆపుమని కాల్బట్టుకొని బతిలాడి గాన్ని ఆటోల ఏస్కోని బొయ్యిర్రటవ్వా!"
"అవునా శెల్లె!ఆడివిల్లల్ని బయిటికి బంపుడే గాదు,ఇంట్లె ఉన్నా రచ్చన లేకుండవొయ్యింది.శిట్టెమ్మ మంచిపని జేసింది.గాడు జెల్మల పాడు పని శెయ్యకుండ "ఈనిన పులి మీద పడ్డట్టు" గాని మీద వడి బాగనే కొట్టింది. అస్లు శెల్లే పసి విల్లలప్పన్నించే గదేదో కరాటె అంటరు సూడు గస్మంటి యిద్దెలు నేర్వియ్యాలె.  శిట్టెమ్మ పైసలు మర్సుడు మంచిదైంది సైమానికొచ్చి బిడ్డని రచ్చించుకో గల్గింది. "
 "అవునవ్వా! గా అక్కకి సుత గాయాలైనయి.నువ్వు అన్న తీర్గనే ఈనిన పులి లెక్క  శెయ్యబట్టె బిడ్డకి ఏం గాకుండ రచ్చించుకున్నది.అన్ని ఏళలు మనై గావు అవ్వా! గిస్మంటి పాపిట్టోళ్ళు ఉన్న పెపంచకంల ఆడోళ్ళు బత్కుడు కట్టంగనే వుంది."
"అవును శెల్లే! గీ ఆడోళ్ళు ఈనిన పులి లెక్కనే గాదు,సత్తెబామల్లెక్క,కన్కదుర్గ,కాళికాంబ లెక్క బత్కాలె."
 "గదండీ సంగతి! "ఈనిన పులి మీద పడ్డట్టు" అంటే గిదే మరి.తేడావొత్తే, తేడా అగవడ్తే గిట్ల దైర్నంగ తిర్గవడాల్సిందే."
కామెంట్‌లు