క్షేత్ర పర్యటనలో విద్యార్థులు: - --ఈర్ల సమ్మయ్య-ప్రధానోపాధ్యాయుడు
 --పంటల్ని పరిశీలించిన ఊషన్నపల్లి  ప్రభుత్వ పాఠశాల పిల్లలు


పెద్దపల్లి జిల్లా, కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పిల్లలు ఆదివారం ఉదయం ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఆధ్వర్యంలో క్షేత్ర పర్యటనకు వెళ్ళి, గ్రామంలోని వివిధ రకాల పంటల్ని పరిశీలించారు. పసుపు, పత్తి, మిర్చి, కంది, వరి మొదలైన పంటల్ని ప్రత్యక్షంగా పరిశీలించి, వాటికి సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని పొందారు. పంట మొక్కల పెరుగుదలకు అనుకూల, ప్రతికూల పరిస్థితులు, కావాల్సిన పదార్థాలు, మొక్కల బాగాలు, ఆహార, వ్యాపార పంటలు, అంతర పంటల గురించి ఈర్ల సమ్మయ్య పిల్లలకు అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాలలో పిల్లలతో రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి, వారితో మాట్లాడించారు.కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఎడ్ల స్రవంతి, బండారి సరిత, పిల్లలు, పలువురు పాల్గొన్నారు.
క్షేత్ర పర్యటనలతోనే ప్రత్యక్ష జ్ఞానం
క్షేత్ర పర్యటనల వల్ల పిల్లలకు ప్రత్యక్ష జ్ఞానం కలుగుతుంది. చెప్పిన దాని వల్ల వచ్చే జ్ఞానం కంటే పిల్లలు పరిశీలన చేయడం ద్వారా పొందే జ్ఞానం ఎక్కువ కాలం ఉంటుంది. అందుకని తరగతి గదిలో చెప్పిన పాఠాలను క్షేత్ర స్థాయిలో పిల్లల చేత పరిశీలింపజేస్తున్నాం. పాఠశాల పనివేళల్లో బోధనకు, పిల్లల విద్యాభ్యాసానికి ఆటంకం కలుగకుండా క్షేత్ర పర్యటనను సెలవు రోజుల్లో ఏర్పాటు చేస్తున్నాం. క్షేత్ర పర్యటన వల్ల పిల్లలు చాలా సంతోషంగా, స్వేచ్చా వాతావరణంలో  ప్రత్యక్ష అనుభవం ద్వారా చక్కగా అనేక విషయాలు నేర్చుకోగలుగుతున్నారు.
కామెంట్‌లు