కాఫీ పురాణం: - తమిళ మూలం — "సుజాతా"-అనుసృజన - యామిజాల జగదీశ్


 “ఏమండీ… పాల ప్యాకెట్ వేశాడో లేదో చూసొచ్చారా?”
“ఇంకా రాలేదే! అందరి ఇళ్లలో వేసి, చివరికి మన ఇంటికే వస్తాడు!”
అరవై ఏళ్లు దాటిన తమిళ బ్రాహ్మణుల పొట్టకు కాఫీయే ఇంధనం. పొద్దున్న ఒకసారి, మధ్యాహ్నం మూడు గంటలకు మరోసారి. ఓ గుక్క కాఫీ గొంతులో దిగితేనే ఆ రోజు పనులు మొదలవుతాయి. ముఖ్యంగా మగవాళ్లకు!
కాఫీ అంటే ఏదో కాఫీ కాదు. మొదటి డికాక్షన్‌తో చేసిన కాఫీ కావాలి.
రెండు రకాల పీబరీ గింజల్ని సమపాళ్లలో కలపాలి. కొందరికి చికరీతో, కొందరికి చికరీ లేకుండా, అప్పటికప్పుడు వేడివేడిగా పొడి పట్టించుకుని రావాలి. స్టీల్ ఫిల్టర్‌లో కనీసం మూడు చెంచాల కాఫీ పొడి వేసి గట్టిగా అదమాలి. పైన చిన్న జల్లెడలాంటి పలక పెట్టి మరికాస్త నొక్కాలి.
నీళ్లు సలసల మరిగాక, ఒక్కసారిగా పోయకూడదు. వలయాల్లా తిప్పుతూ నెమ్మదిగా పోయాలి. ఆ తర్వాత ఫిల్టర్ మూతతో ‘ణంగ్’ అని ఓ చిన్న దెబ్బ వేయాలి. మరీ గట్టిగా కొట్టకూడదు. అలా చేస్తేనే డికాక్షన్ చుక్కచుక్కగా, చిక్కగా దిగుతుంది. కాస్త ఎక్కువగా కొట్టినా, పొడిని సరిగ్గా అదమకపోయినా డికాక్షన్ పలచబడిపోతుంది.
పాతకాలపు ఉమ్మడి కుటుంబాల్లో, పెద్ద సంసారాల ఇళ్లలో రెండో డికాక్షనే అందరికీ దిక్కు. మొదటి డికాక్షన్ మాత్రం ఇంటి పెద్దకు రహస్యంగా తయారవుతుంది. ఈ రోజుల్లో ఎన్ని కాఫీ మేకర్లు వచ్చినా, ఆ ఫిల్టర్‌కు సాటిరావు.
పాత సినిమాల్లో ‘బ్రాహ్మణాళ్ కాఫీ క్లబ్’ అన్న బోర్డు తరచూ కనిపించేది.
నలభై ఏళ్ల క్రితం శ్రీరంగంలోని మా రంగభవన్ హోటల్ కాఫీకి మంచి పేరుండేది. వాళ్లకు ప్రత్యేకంగా ‘రంగనాయకి కాఫీ’ పేరుతో ఓ దుకాణం కూడా ఉండేది.
మా సీనూ, రామనాథన్ పెద్దనాన్నలు బయటూళ్ల నుంచి వచ్చేవాళ్లు. టౌన్ బస్సు దిగి, “రంగభవన్‌లో ఫస్ట్ క్లాస్ కాఫీ తాగామయ్యా!” అని మెచ్చుకోవడం నా చెవిన పడేది.
చిన్న డబరాలో కాఫీ పోసి, వేడి తగ్గకుండా పైన ఓ చిన్న టంబ్లర్‌ను బోర్లించి ఇచ్చే పద్ధతి ఇప్పటికీ చాలా ఊళ్లలో ఉంది. దాన్ని జాగ్రత్తగా తీసి, కాఫీని డబరాలోకి వంపుకోవాలి. కాస్త ఏమరుపాటుగా ఉన్నా చొక్కా మీద కాఫీ పడటం ఖాయం.
ఇప్పుడైతే శ్రీరంగంలో గాంధీ విగ్రహం దగ్గరున్న మురళి దుకాణంలోనే చెప్పుకోదగ్గ కాఫీ దొరుకుతోంది.
కాఫీ పెట్టడం ఓ కళ!
పాలు మరీ ఎక్కువ కాగకూడదు. కాఫీ మరీ నల్లగా ఉండకూడదు. ఒకట్రెండు సార్లు ఎత్తు నుంచి పోసి ఆడించాలి. వేడిగా ఉండాలి. పైన నురుగు కట్టాలి. ఆ నురుగును చూస్తుంటేనే మనసుకు హాయిగా ఉంటుంది.
చక్కెర సరిపడా వేయాలి. ఈ షుగర్ ఫ్రీ మాత్రలు కాఫీ అసలు రుచినే చెడగొడతాయి. కాస్త చేదు ఉండాలి. అదే కాఫీకి ప్రత్యేకత. తాగిన గంట తర్వాత కూడా నాలుక మీద దాని రుచి మిగిలి ఉండాలి.
కొందరు కాఫీ తాగుతూ మందు మాత్రలు మింగుతుంటారు. అలాంటివాళ్లను చూస్తే, రసికత తెలియని జన్మలని అనాలనిపిస్తుంది.
కాఫీని పొద్దున్నైనా, మధ్యాహ్నమైనా, కాస్త తీరికగా తాగాలి.
“వీడు పై చదువులకు వెళ్తాడా? ఉద్యోగంలో చేరతాడా?”
“ఏమైనా సరే, వాళ్లు సుబ్బిణిని పెళ్లికి పిలవకపోవడం మాత్రం తప్పే!”
ఇలాంటి గుసగుసలు, ఇంటి విషయాల మీద చర్చలు కూడా తోడైతే కాఫీకి ఇంకాస్త రుచి వస్తుంది.
ఇదంతా మధ్యతరగతి కుటుంబాల వ్యవహారం. కాస్త డబ్బున్నవాళ్లయితే బోర్న్‌విటా, ఓవల్టీన్ అంటూ వేరే దారిలోకి వెళ్లిపోతారు. కాఫీ తాగాల్సి వచ్చినా, కొడుకు నల్లగా అయిపోతాడేమోనని అమ్మలు అందులో పాలు ఎక్కువ పోసి తెల్లటి కాఫీగా మార్చేస్తారు.
ఆ కొడుకే చదువుకుని ఇంజినీర్ అయి, రామగుండం నుంచి నల్లగా మసిబారిన ముఖంతో తిరిగొస్తాడన్నది వేరే సంగతి!
కాఫీని టంబ్లర్‌-డబరాలోనే తాగాలి. అప్పుడే అసలు రుచి తెలుస్తుంది. కప్పూ సాసరూ టీకి సరిపోవచ్చు. కాఫీకి మాత్రం కాదు.
తిరుచ్చిలో ఆర్.ఆర్. సభ దగ్గర పద్మా కేఫ్ అనే హోటల్ ఉంది. అక్కడ తినడానికి ఇంకెన్నో ఉన్నా, జనం మాత్రం కాఫీ కోసమే ఎగబడతారు.
తర్వాతి రోజుల్లో తిరుచ్చిలో అభిరామి, కాంచన లాంటి హోటళ్లలోనూ ఫర్వాలేదనిపించే కాఫీ దొరికేది.
ఈ బ్రూ, నెస్కేఫే లాంటివి హనీమూన్ జంటల అలసట తీర్చడానికి, ప్రకటనల్లో అందంగా కనిపించడానికి పనికొస్తాయి. అంతకుమించి వాటి గురించి చెప్పుకోవాల్సిందేముంది?
ఓసారి మా మారీస్ థియేటర్‌లో ఇంటర్వెల్ సమయంలో ‘ఫుస్ ఫుస్’ అని శబ్దం చేస్తూ, ఓ ఇనుప గొట్టంలోంచి కాఫీ కప్పులోకి దించారు. నురుగు నిండిన పాలలాంటి కాఫీ వచ్చింది. దాని పేరు ఎస్ప్రెస్సో అట!
ఆసక్తి ఆపుకోలేక వెంటనే తాగబోయాను. వేడికి నాలుక కాలిపోయింది.
చెన్నైలో త్యాగరాయ నగర్ బస్ స్టాండ్ దగ్గర ఇండియా కాఫీ హౌస్ అనే దుకాణం ఇప్పటికీ ఉంది. ఒకప్పుడు దానికి చాలా పేరుండేది. అక్కడ తెల్లటి పింగాణీ కప్పుల్లో కాఫీ ఇస్తారు. రైల్వే క్యాంటీన్‌లో ఇచ్చే కప్పుల్లా ఉంటాయి. ధర మాత్రం అందుబాటులోనే ఉంటుంది.
మధుమేహం ఉన్నవాళ్లను అడిగి చూడండి. ఉదయం ఖాళీ కడుపుతో రక్త పరీక్ష కోసం క్యూలో నిలబడి, గంట తర్వాత ఓ కప్పు కాఫీ తాగితే కలిగే ఉపశమనం మాటల్లో చెప్పలేం.
కాఫీ ఎక్కువగా పండే కర్ణాటకలో కూడా నా దృష్టిలో కాఫీ రుచి అంత గొప్పగా ఉండదు. ఉడిపి, కామత్ హోటళ్లలో ఫర్వాలేదనిపించే కాఫీ దొరికినా, కుంభకోణం డిగ్రీ కాఫీకి నాలుకను అలవాటు చేసుకున్నవాళ్లు వాటిని కాస్త అనుమానంగానే చూస్తారు.
పెళ్లిళ్లలో కాఫీ నాణ్యతకు పెళ్లి సంబంధాన్నే చెడగొట్టగల శక్తి ఉంది!
రైల్లో కాఫీ తాగుతూ, “ఇదేం కాఫీ? వేడి నీళ్లే!” అని తిట్టుకుంటాం. అయినా తాగక తప్పదు. ఒకప్పుడు మాయవరం రైల్వే స్టేషన్‌లో మంచి కాఫీ దొరికేదని పెద్దవాళ్లు చెప్పగా విన్నాను.
తప్పనిసరిగా తాగాల్సిన కాఫీలు రెండున్నాయి. ఒకటి విమానంలో ఇచ్చేది. రెండోది ఐదు నక్షత్రాల హోటల్ గదిలో మనమే కెటిల్‌తో తయారుచేసుకునేది.
విమానంలో ఓ పెద్ద కప్పు నిండా డికాక్షన్ ఇచ్చినా, చిన్న రంధ్రం నుంచి ఒక్కో పాల చుక్క కలిపేలోపే కాఫీ చల్లారిపోతుంది. హోటల్ గదిలోనైతే పాలపొడితో సరిపెట్టుకోవాలి.
ఈ ఆధునిక ప్రపంచంలో వై-ఫై కోసం వెతుక్కుంటూ, అమ్మాయిలతో సరసాలాడేందుకు అనువైన చోటు కోసం తిరిగే యువతకు కేఫ్ కాఫీ డే లాంటివి ఉన్నాయి. లాటే, కాపుచినో అంటూ తొంభై రూపాయలు వసూలు చేస్తారు. అక్కడ కాఫీ రుచి ఎలా ఉంటుందన్నది మాత్రం ఎవరితో వెళ్లామన్నదానిపై ఆధారపడి ఉంటుంది!
“హౌ ఆర్ యు డూయింగ్ టుడే?” అంటూ పరిచయం లేనివాళ్లను చూసినా నవ్వుతూ పలకరిస్తే, అది అమెరికా!
“ఎ కాపుచినో… టాల్!”
“మిల్క్?”
“నో, థాంక్యూ!”
ఓ భారీ శరీరమున్న అమ్మాయి మీ ఆర్డర్, పేరు ఓ కాగితం మీద రాసుకుని, పెద్ద పేపర్ కప్పులో కాఫీ తయారుచేసి ఇస్తే, అది స్టార్‌బక్స్!
చేతులు కాలకుండా ఉండటానికి కప్పుకు కాగితపు తొడుగు తొడుక్కోవాలి. పైన ఓ మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత దాన్ని పట్టుకుని తిరుగుతూ కాఫీ తాగాలి.
కాఫీ గురించి ఇంత పురాణం చెప్పుకున్నా, ఇంట్లో భార్య ఇచ్చే కాఫీకి మాత్రం ఓ ప్రత్యేకత ఉంది.
ఆమె టంబ్లర్‌ను ‘డొంగ్’ అని కింద పెట్టే వేగాన్ని బట్టి, ఆ రోజు తన రాశిఫలం ఎలా ఉండబోతోందో భర్త ముందుగానే తెలుసుకోవచ్చు!
కామెంట్‌లు