సామెత -394: ఈత కట్టెల నిప్పు యింటికి రాదు - ఈడిగ వాని సొమ్ము పెండ్లాం చేతికి రాదు
**
"ఏమో అవ్వా! ఏం సంసారమో ఏమో కొంపల ఏది లేకున్నా కట్టమే.గ్యాసు బండ అయిపోయి శాన దినాలైంది. ఎంత పొతుపుగ కూరొక్కటి వొండుకుని,పాలు కాగబెట్టుకుని జాగర్తగ ఆడుకున్నా మూన్నేళ్ళు సుత రాకనే పాయె. పుల్లా పుడక శితుకులు ఏరుకొచ్చి పొయ్యి ఎలిగిచ్చుకుంటున్నా గయ్యేం సాల్తయి శెప్పు. ఒగప్పుడు అడ్విలకి బొయినమంటె ఎండిన శెట్ల కొమ్మల్ని, కంది శేల మిలిగిన కంది కట్టెల్ని మోపుగట్టుకొనొత్తె వొంట మొత్తం మా సక్కంగ అయ్యేది. గిప్పుడా కంది శేలూ లెవ్వు. ఎండిపోయిన శెట్టు కొమ్మలూ లెవ్వు. అడ్వి అడివొతికెనే లేదాయె. ఏడా సూశినా శెట్లు నరుకుడు పిలాటులు శేసుడు. ఏందో అవ్వా! ఇంగ రేప్రేపు బత్కుడు కట్టమే అన్పిత్తుంది."
"ఏంది శెల్లే! నువ్వు శెప్తుంటే కరువు కట్టాల సొద యిన్పిత్తున్నట్టు అనిపిత్తోంది.సంసారం ముచ్చెటి మొదల్వెట్టి లోకంల బత్కు బాదల్ని సుత శెప్పుకుంటొచ్చినవు.నువ్వు శెప్పిన మాటలిన్నంక కడ్పుల బయం సొచ్చింది శెల్లే!"
" అవునవ్వా! ఎవలి నోట యిన్నా గియ్యే ముచ్చెట్లు ఎట్ల బత్కాలె? ఎట్ల సంసారం ఈడ్సక రావాలె?ఊల్లల్ల రచ్చబండ తాన గిదే ముచ్చెటి. మంచినీళ్ళ బాయికాడ సుత గిదే కత.మనస్మంటి మడుసులు బయంతో అల్లడం తల్లడం అయితుర్రు."
అవును శెల్లే? పెపంచకం మొత్తంగ గిట్లనే వుంటదని టీవీలల్ల, రేడియాల శెప్తుర్రు. పతొక్కటి పొతుపు ఆడాలంట.తిండి గింజలు సుత దొర్కని దినాలు వొత్తయంటుర్రు. పొయ్యి మీద్కి వొండుకోడాన్కి వుండవు. పొయ్యి కింద ఎలిగిచ్చేతందుకూ ఏవీ దొర్కవు అంటుర్రు."
"అవునవ్వా ! ఎప్పుడో ఒగప్పుడు గాదు. గిప్పుడే అగుపిత్తున్నయ్.మొన్న శేను తానకి కట్టెలు తేడానికి బోతే ఏవీఁ దొర్కవాయె. శివరాకర్కి ఎండిన ఈత కొమ్మల కట్టెలు ఏర్కొచ్చి వొంట జేద్దును గద. బుస్సున మండుడు.తుస్సున అంతెల్లమే ఆరిపోవుడు. గయ్యీటితో అన్నం వొండితే సరింగ వుడక్క నానవాలబడింది. వో సోట మెత్తగ. ఇంకో సోట పలుకు... తినొశం గాలెదవ్వా."
"అయ్యో అవునా శెల్లే! అయిన గని గా ఈత కట్టెల నిప్పు ఎంచేపుంటది శెప్పు? నువ్వే అన్నవు గద బుస్సున మండి తుస్సున ఆరిపోద్దని.గిది తెల్శే మన పెద్దోళ్ళు ఓ శాత్రం గట్టి శెప్పిర్రు."
" ఒష్నీ! గీ ఈతకట్టె ముచ్చెటికి సుత శాత్రమా? గదేందో జెల్ది శెప్పవ్వా. ఆత్రమాగట్లే. "
" గదే శెల్లే! "ఈత కట్టెల నిప్పు యింటికి రాదు- ఈడిగవాని సొమ్ము పెండ్లాం శేతికి రాదు" అన్నరు. "
" గదేందవ్వా! ఈత కట్టెల నిప్పు యింటికి రాదంటే మాగనే సమజైంది.ఇంట్లెగ్ట వొంటకి సరింగ పన్కి రాదని తెల్శింది. దినాం గా కట్టెల్తో యాట్ట బడ్తనే ఉన్నం గని గా ఈడిగ వాని సొమ్ము ముచ్చెటేందవ్వ? అస్సల్కి సమజవ్వలే."
" ఓ గదా శెల్లే?శెప్తుండు. ఈడిగెవాడు అంటే తెల్సు గద. తాటి కల్లు,ఈతకల్లు తీసే మడిషిని ఈడిగెవాడు అంటరు. గాయిన అడ్విల నించి వొచ్చే తొవ్వ పక్కన తాటాకులు శిన్న పందిరొత్కె ఏశి గాన్నే వొచ్చే పొయ్యే టోళ్ళల్ల కల్లు గావాలన్నోళ్ళకి పోత్తడు. గా తానికి వసూళ్ళకి అప్పులోల్లొచ్చి,శిల్లర మల్లర తేడాలొచ్చి గాడ్నే వొచ్చిన పైసలు వొచ్చినట్టు ముద్ద పైస సుత మిలగకుండ అయితది. ఇంటికొచ్చి పెండ్లానికి వొట్టి శేతులు సూపెట్టుడే.గందుకే గీ శాత్రం పుట్టింది శెల్లే!"
బలేగ శెప్పినవ్ అవ్వా! అచ్చెరం పొల్లు వోకుండ సత్తెం జెప్పినవ్."
"గదండీ సంగతి!" ఈత కట్టెల నిప్పు యింటికి రాదు - ఈడిగె వాని సొమ్ము పెండ్లాం శేతికి రాదు" అంటే గిదే మరి. సమజైంది గదురుల్లా..

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి