ఓ చలికాలపు రాత్రి ఓ కోటీశ్వరుడు బయటకు వెళ్లాడు. దారిలో చలికి వణుకుతూ ఉన్న ఓ పేద వృద్ధుడు ఆయనకు కనిపించాడు.
ఆ వృద్ధుడి ఒంటిపై వెచ్చని దుస్తులు లేవు. అది చూసిన కోటీశ్వరుడు ఆశ్చర్యంగా, “ఓ పెద్దాయనా! బయట ఇంత చలిగా ఉంది. కనీసం ఓ చొక్కా కూడా వేసుకోలేదేం?” అని అడిగాడు.
అందుకు ఆ వృద్ధుడు ప్రశాంతంగా, “అయ్యా! నా దగ్గర ఏమీ లేదు. ఇలాంటి చలిలో ఉండటం నాకు అలవాటైపోయింది” అని చెప్పాడు.
ఆ మాటలు విన్న కోటీశ్వరుడికి జాలి కలిగింది.
“సరే బాబా! మీరు ఇక్కడే ఉండండి. నేను ఇంటికి వెళ్లి మీకు ఓ వెచ్చని కోటు తీసుకొస్తాను” అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఆ మాటలు విన్న వృద్ధుడి ముఖంలో ఆనందం కనిపించింది. ఇంతకాలానికి తనను ఆదుకునే ఓ మనిషి దొరికాడని సంతోషించాడు.
“అలాగే అయ్యా! మీ కోసం ఇక్కడే ఎదురుచూస్తుంటాను” అని ఆశగా చెప్పాడు.
కానీ ఇంటికి చేరుకున్న కోటీశ్వరుడు తీరా పనుల్లో పడి ఆ వృద్ధుడికి ఇచ్చిన మాటను పూర్తిగా మరిచిపోయాడు.
రాత్రంతా ఆ వృద్ధుడు కోటీశ్వరుడి కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. తనకు వెచ్చని కోటు వస్తుందన్న ఆశతో ఆ చలిని భరించడానికి ప్రయత్నించాడు. కానీ ఆ రాత్రి గడిచేకొద్దీ చలి మరింత పెరిగింది. చివరికి ఆ వృద్ధుడు చలిని తట్టుకోలేక ప్రాణాలు విడిచాడు.
మరుసటి రోజు ఉదయం కోటీశ్వ రుడికి ఆ వృద్ధుడు గుర్తుకొచ్చాడు. వెంటనే ఆయన బయటకు వెళ్లి వెతకసాగాడు. కొంతదూరంలో ఆ వృద్ధుడు విగతజీవిగా కనిపించాడు.
ఆ దృశ్యం చూసి కోటీశ్వరుడు తీవ్రంగా బాధపడ్డాడు. తన వల్లే ఇలా జరిగిందన్న పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.
అక్కడే ఆ వృద్ధుడు రాసిన ఓ ఉత్తరం కనిపించింది.
ఆ ఉత్తరంలో ఇలా ఉంది:
“అయ్యా! ఇన్నాళ్లూ నా దగ్గర వెచ్చని దుస్తులు లేకపోయినా, చలిని తట్టుకునే మనోధైర్యం నాలో ఉండేది. ఎలాగోలా ఆ చలిని భరిస్తూ జీవించే వాడిని.
కానీ మీరు నాకు కోటు తెచ్చిస్తానని మాట ఇచ్చినప్పుడు, మీ మాటను నమ్మాను. ఆ కోటు వస్తుందన్న ఆశతో నా మనసుకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ఇక నాకు వెచ్చని దుస్తులు దొరుకుతాయని నమ్మాను.
కానీ మీరు రాలేదు. ఆ ఎదురుచూపుల్లో నా మనోధైర్యం సన్నగిల్లిపోయింది. చివరికి ఈ చలిని తట్టుకోలేకపోయాను.
అయ్యా! మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతే, అసలు ఆ మాట ఇవ్వకండి. మీకు అది చిన్న విషయమే కావచ్చు. కానీ మరొకరి జీవితంలో అది ఎంతో విలువైన ఆశ కావచ్చు.
ఒక్కసారి మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీ మాట మీద మరొకరు తమ ఆశలను, నమ్మకాన్ని పెంచుకోవచ్చు.”
ఆ ఉత్తరాన్ని చదివిన కోటీశ్వరుడు తలదించుకున్నాడు. మాట ఇవ్వడం ఎంత సులభమో, ఆ మాట మీద ఎదుటివారు ఎంతటి ఆశ పెట్టుకుంటారో ఆయనకు అప్పుడు అర్థమైంది.
ఆ రోజు నుంచి ఎవరికైనా సాయం చేస్తానని చెప్పే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మొదలుపెట్టాడు.
మాట ఇవ్వడం చాలా సులభం. కానీ ఆ మాట మీద ఎదుటివారు పెట్టుకునే నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఎంతో ముఖ్యం. మనం ఇచ్చే హామీ మరొక రికి ఆశ కావచ్చు, ధైర్యం కావచ్చు, కొన్నిసార్లు జీవితమే కావచ్చు.
అలాగే, ఇతరుల సాయం మీదే ఆశ పెట్టుకుని మనలోని ధైర్యాన్ని కోల్పోకూడదు. పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా, మన మీద మనకు నమ్మకం ఉన్నంతవరకు ముందుకు సాగాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి