సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 

 సామెత -396\: ఈడ్పుగాళ్ళు ఈడ్పు చేతులు ఇతడేనమ్మ ఇల్లిటపుటల్లుడు
 *** 
"అవ్వా! నా వొల్లగాదు గీ సంసారం ఈదుడు. వొద్దయ్యా అంటే మీ అన్న యిన్నడా! మొగ పొల్లగాండ్లు లేని ఇల్లు.ఇల్లిటం తెచ్చుకుందమని ఒక్క తీర్గ నసబెట్టి శిన్నపొల్లకి లగ్గం జేసి తెచ్చుకున్నం గద."
 "ఇంకేంది వొదినా అన్న కోర్కె తీరింది.ఇంట్లె కొడ్కు లేకపాయె అన్న రంది వడకుండ అల్లుడు దెచ్చుకుంటిరి. ఇంగేంది మరి సంసారం ఈదుడు వొల్ల గాదంటవు.నూవొక్క దాన్వే కాకుండా సాయవడేతందుకు అల్లుడు సుత ఉండనే ఉండె.ఇంగెందుకు  వొదినా రంది వడుడు?"
"అస్లు గా అల్లుడే పెద్ద రంది అవ్వా. 'వొల్లొంగనోడు దొంగల్ల కల్శినట్టు' ఏ పని శేత గాదు.'తిందాం బస్వన్న ఉందాం బస్వన్న' అన్న లెక్క పొట్లెంగ పీకల దాకా మాగ మెక్కుడు గుర్రువెట్టి పడుకొనుడు."
 "అయ్యో! అవునా వదినా? వొయిసులో వున్నోడికి గవేం శెకలు? వుడ్కు రత్తపోడు గట్లుండుడేంది? పోట్ల గిత్త లెక్క ఉషార్గుండాలె గని మన్ను తిన్న పాము లెక్క వుండుడేంది.
 "గదే అవ్వా! మీ అన్న యవ్వారం సూత్తె సుక్కేసుకుని పొద్దత్తమానం మన లోకంల ఉండడు. నెరీ ఇగ్గో గీ అల్లున్ని తెచ్చుకున్న సంది ఇంకేంది నా పని ఆయిన పని ఆయినే శేత్తడు. ఇల్టపల్లుడు గా మాత్తరం శెయ్యక పోతెట్ల అని సవాల్ జవాబిచ్చుడు."
 "అల్లుడొచ్చి ఎలగబెడ్తడని ఇంకో ఐదెకరాలు కౌలుకి తీసుకున్న.గాయనట్ల తయారైతడనుకోలే. ఇగ్గో గీ అల్లుడిట్ల శేత్తడని కలగనలే అవ్వా! ఈడ్పు గాళ్ళు,ఈడ్పు శేతులోని లెక్క నాట్కాలాడుకుంట సోమరి శెకలు శేత్తుంటే వొల్లంత కారఃబూసుకున్నట్టుంది."
"మరుండదా  వొదినే. నువ్వొక్కర్తివి రెక్కలు ముక్కలు శేస్కుంటుంటువి."ఈడ్పుగాళ్ళు ఈడ్పు చేతులు ఇతడేనమ్మ ఇల్లిటపుటల్లుడు" అన్న శాత్రం లెక్క అల్లుడు ఈస్రోమని ఉంటే సూశేటోళ్ళకి ఏమనిపిత్తది శెప్పు.
"మొన్న మనింటెన్క రవనవ్వ సూశి దిట్టిబొమ్మ లెక్కుండు. ఈడ్పుగాళ్ళు ఈడ్పు శేతులున్నోడిలా ఏం పని శాతవ్వదంటగా అంది.గదిని నాకే మస్తు యిదన్పిచ్చింది.ఇంగ నీకెట్ల ఉండాలె శెప్పు."
"గందుకే నీ బిడ్డని అల్లున్ని వో పాలి నా తానికి బంపియ్యి.ఈసురు బూసురు లేకుంట ఉషార్గ ఉండేతట్లు మాటల సుర్కు తలిగిత్త. వొదినా నువ్వేం రంది జేయకు."
నువ్విట్లన్నంక మన్సు కుదార్త బడ్డది అవ్వా! గియ్యాల ఎట్లన్న నీ తానికి తోల్కొత్త. ఇంగ నీదే బారం."
"గదండీ సంగతి! "ఈడ్పుగాళ్ళు ఈడ్పు చేతులు ఇతడేనమ్మ ఇల్లిటపుటల్లుడు" అంటే గిదే మరి. ఈడ్పుగాళ్ళు, ఈడ్పు చేతులు అంటే పోలియో వొచ్చి సచ్చబడిన కాళ్ళలెక్క,శేతుల్లెక్క అగుపిచ్చుడు.గసుమంటి పోరంబోకు శెకలే మన్సులని శికాకు శేత్తయి.యిష్యం సమజైంది గదురుల్లా!"
కామెంట్‌లు