ఉద్యోగం రాలేదన్న వార్త, నాన్న “రేయ్, నీతో మాట్లాడాలి” అన్న మాట, కొంచెం ఎక్కువ సంతోషం వచ్చిన వేళ,అనుకోని సమయంలో ఇంటి నుండి ఫోన్ వచ్చినప్పుడో, కాలేజీ నుంచి ప్రిన్సిపాల్ ఫోన్ వచ్చిన క్షణం… ఇవన్నీ భయపెట్టినా పెట్టకపోయినా,
“అమ్మకు వయసు అవుతోంది"
"నాన్నకు ఓపిక తగ్గుతోంది”అన్న ఆలోచన చాలు, గుండెల్లో గుబులు మొదలవడానికి!
చేతిలో ఉద్యోగం లేకపోతే తన భవిష్యత్తు కంటే కుటుంబమే గుర్తొస్తుంది. ఉద్యోగం ఉన్నా జీతం తక్కువైతే తన అవసరాల కంటే ఇంటి అవసరాలే ఎక్కువగా కనిపిస్తాయి.
నెల మొదట్లో జీతం కోసం ఎదురుచూస్తాడు,నెలాఖరులో అప్పుల లెక్కలు చూసి నిట్టూరుస్తాడు!తనకోసం కొత్త బట్టలు కొనాలంటే పదిసార్లు ఆలోచిస్తాడు, అమ్మ మందుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ధర గురించి ఆలోచించడు.
నాన్నకు ఏదైనా కొనిపెట్టాలని ఉంటుంది, కానీ ఆయన "ఏమీ" అడగకపోవడమే మనసును మరింత బాధపెడుతుంది.చెల్లెలి పెళ్లి, తమ్ముడి చదువు, ఇంటి అద్దె, కరెంటు బిల్లు, ఇలా బాధ్యతలన్నీ వరుసలో నిలబడితే, తన కలల వంతు ఎప్పుడొస్తుందో అతనికే తెలియదు.స్నేహితులు భవిష్యత్తు గురించి మాట్లాడుతుంటే, వీడు మాత్రం రేపటి ఖర్చులకు డబ్బులు ఎలా సర్దాలో లెక్కలేస్తుంటాడు.
ఉద్యోగం లేనప్పుడు కుటుంబానికి సమాధానం చెప్పలేక బాధపడతాడు, తక్కువ జీతం వచ్చినప్పుడు కుటుంబాన్ని సంతోషంగా ఉంచలేక కుమిలిపోతాడు.ఎంత అలసిపోయినా ఇంట్లోకి అడుగుపెట్టేటప్పుడు నవ్వుతాడు. ఎందుకంటే అతని కన్నీళ్లను తుడవాల్సిన వాళ్లే అతని ధైర్యం మీద ఆధారపడి ఉంటారు కాబట్టి.
అతనికీ ఆశలుంటాయి, కోరికలుంటాయి, తనకంటూ ఓ జీవితం ఉండాలనే ఆశ ఉంటుంది, కానీ వాటన్నింటికంటే ముందు కుటుంబం గుర్తొస్తుంది.అదే అతని "నలిగే నవ్వు" తన బాధలను దాచిపెట్టి, తన వాళ్ల ముఖాల్లో సంతోషాన్ని వెతుక్కునే నవ్వు!
అతనికి పెద్ద ఇల్లు, పెద్ద కారు అక్కర్లేదు… అమ్మానాన్నలు ఆరోగ్యంగా ఉండాలి, నెలాఖరుకు అప్పులు మిగలకూడదు, తన వాళ్ల అవసరానికి డబ్బుల్లేవని చెప్పాల్సిన పరిస్థితి రాకూడదు.
మధ్యతరగతి అబ్బాయికి భయం ఓడిపోవడం కాదు, తన వాళ్లకు అవసరమైనప్పుడు, వాళ్ల పక్కన నిలబడలేకపోవడం!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి