కొమ్మకొమ్మకూ అందమైన విరులు...
హరివిల్లు వర్ణాలద్దుకొని
అందాల సోయగాలతో
విరబూసిన మధుర కుసుమాలు...
ఆటపాటల బడిలో
నేస్తాలతో చేసిన అల్లరి
తుంటరి చిరునవ్వుల
తుషార బిందువులతో
తడిసి విరిసిన మల్లెల పరిమళాలై
మనసంతా మధురిమలు నింపినవి...
ప్రేమతో అందించిన
గురువుల దీవెనలు
జీవితానికి వెలుగులు నింపి
జాజుల సౌరభాలై
జ్ఞాపకాల గూటిలో ఒదిగి
ఆత్మీయ అనుభూతులైనవి...
నాన్న గారాలపట్టినై
అడిగినవన్నీ అందుకున్న
ఆ గత వైభవపు రోజులన్నీ
ముద్దబంతులై వికసించి
మురిపాల మాలికలై
మదిలో కొలువుదీరి
మరపురాని మధుర స్మృతులైనవి..
యువరాణినంటూ మురిపించిన
ఇరుగుపొరుగుల ప్రశంసలు
గులాబీల గుత్తులై పూసి
చిన్ననాటి లోకమంతా
సౌకుమార్యపు శోభలు నింపి
చిరకాలపు తీపి గురుతులై నిలిచినవి...
కాలం కదిలిపోతున్నా
కరిగిపోలేదు నా బాల్యం...
వెనుతిరిగి రాలేకున్నా
వాడిపోలేదు ఆ జ్ఞాపకం...
ఎన్ని వసంతాలు వెళ్లిపోయినా
ఎన్ని మజిలీలు దాటిపోయినా
నా హృదయపు వనంలో
ఆ జ్ఞాపకాలు వాడిపోని పుష్పాలై...
ఎప్పటికీ నాతోనే నిలిచే
అనుభూతుల అక్షరాలై...
నా జ్ఞాపకాల తరువుగా
నాలోనే నిలిచిపోయి...
కాలం చెరపలేని మధురిమగా
మనసున విరబూస్తూ...
నేను బ్రతికున్నంతకాలం
నా నిన్నటి బాల్యం
నాలోనే జీవిస్తూ ఉంటుంది...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి