ఎన్నో కోరికల అలజడులు...
ఆటుపోటుల జీవన గమనంలో
అనునిత్యం గెలుపోటములై ఎగసిపడే అలలు...
కష్టాల సుడిగుండాలు ఎదురైనా
చిక్కుకోక చాకచక్యంగా బయటపడాలి...
బాధల సునామీలు విరుచుకుపడినా
ఆత్మస్థైర్యంతో మునగకుండా తేలాలి...
భవసాగరాన్ని ఈదాలంటే
ఎదురీతను నేర్చుకోవాలి...
విధి విసిరే సవాళ్లను
విజయ సోపానాలుగా మలచుకోవాలి...
అంతరంగాన అగ్నిపర్వతాలు
బద్దలై లావా ఉప్పొంగినా
కన్నీటి జాడలు కనిపించనీయక
మోమున నవ్వును నిలపాలి...
నడిచే దారిలో నిరాశ తిమిరం
ఆశల వెలుగును కప్పివేసినా
మబ్బుల మాటున దాగిన భానునిలా
చీకటిని చీల్చుకుని వెలగాలి...
ఎగసిపడే కెరటాలెన్నున్నా
తీరాన్ని చేరే నావలా
అవరోధాలెన్ని ఎదురైనా
గమ్యం వైపు సాగిపోవాలి...
ఆశలే తెరచాపగా
ఆత్మవిశ్వాసమే దిక్సూచిగా
అనుభవాలనే ఆలంబనగా చేసుకుని
విజయతీరాన్ని చేరాలి...
అలల అలజడికి అగాథాలు చలించనట్టే
కష్టాల తాకిడికి మనిషి కుంగిపోకూడదు
ఎన్ని తుఫానులు ఎదురైనా
ఆశల సముద్రం దాటి
విజయ పతాకం ఎగరేయాలి!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి