బంగారు బతుకమ్మా!: - బి.ఉషారాణి- Govt టీచర్- మంచిర్యాల


విరుల హరివిల్లులు భువిపై వాలెను
పూల గోపురమై బతుకమ్మ కొలువుదీరెను
తరుణీమణులు నేలపై తారలై మెరిసిరి
ఆటపాటలతో అందరినీ మురిపించిరి

ఏడాదికోమారు అతివలందరు కూడి
భక్తిభావముతో బతుకమ్మను పేర్చి
జానుతెనుగు జానపద గీతాలను పాడి
మాతృప్రకృతిని కొలిచేరు మనసారా

తంగేడు పూలలో తెలంగాణ తేజము
గునుగు పూలలో ధవళ సౌందర్యము
గుమ్మడి పూవులతో బంగారు కిరీటము
రంగవల్లుల నడుమ బతుకమ్మ వైభవము

పూలలో పవిత్రత పాటలో ఆర్ద్రత
ఆటలో ఐకమత్యం ఆచారంలో ఔన్నత్యం
తరతరాల సంస్కృతికి తరగని విభవం
బతుకమ్మ పండుగకు ఇదియే వైశిష్ట్యం

బతుకమ్మా! బతుకమ్మా!
బంగారు బతుకమ్మా!
పల్లెపల్లెల్లో ఊరువాడల్లో
మారుమోగాలి నీ మధుర గీతం

పదిలంగా నిలవాలి పల్లె సంస్కృతి
పదికాలాలు వర్ధిల్లాలి నీ కీర్తి
తెలంగాణ నేలపై పూల పరిమళమై
తరతరాల గుండెల్లో నిలిచిపోవమ్మా
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
👌👌👌