పచ్చదనాన్నే చుట్టూ నిలుపుకుని
ప్రకృతి ఒడిలో సేద తీరుతూ
పరిశుభ్రమైన గాలిని ఆస్వాదిస్తూ...
కల్మషమెరుగని హృదయాలతో
కలసిమెలసి మెలగుతూ
కలిసికట్టుగా బ్రతుకుతూ
కలిసి నిర్ణయాలు తీసుకుంటూ...
వేకువఝామున పొద్దుపొడుపును చూస్తూ
నీలి ఆకాశం పందిరి క్రింద
ఉషోదయ కిరణాల
నులివెచ్చని స్పర్శను అనుభవిస్తూ...
నేలతల్లిని ముద్దాడుతున్న పాదాలతో
నలుగురు కలిసి పనులు చేసుకుంటూ
పెద్దచిన్న విభేదాలకు తావులేక
కష్టసుఖాలను ఒకరితో ఒకరు పంచుకుంటూ
కోవెల గంటల మృదునాదాలు వింటూ
పశువుల మెడలోని గంటల మోతతో
పంటపొలాల సాగుకు కాయకష్టం చేస్తూ
పశువులు పక్షులతో చెలిమి చేస్తూ...
పిల్లల ఆటపాటల సందడితో
పెద్దల ఆప్యాయ పలకరింపులతో
అనురాగ ఆత్మీయతలకు ఆలవాలమై
అందరి మనసుల్లో ఆనందం నింపుతూ...
పల్లె జీవనం ప్రకృతి వరం
దానిని కలుషితం కాకుండా కాపాడుకుందాం..
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి