వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
185. నీలచికురా (పంచాక్క్షరీ)
186. నిరపాయా (చతురక్క్షరీ)
నూట ఎనభై ఆరవ నామ మంత్రము:
ఓం నిరపాయాయై నమః
తనకు పుట్టడమూ, పెరగడమూ అనే లక్షణాలు లేవు కనుక, తాను అపాయమునకు లోను కాని దానను, అని ప్రకటితమైన చాముండేశ్వరి దేవిని చూసిన వశిన్యాది వాగ్దేవతలు, జగన్మాతను, "నిరపాయా" అని కీర్తించారు. జగన్మాతగా ఉన్న తనకు ఏ అపాయములు లేకపోయినా, మనలను అన్ని అపాయాలనుండి గట్టెక్కించే సర్వజగద్రక్షకి కి నమస్కారము.
శ్రీమాత, శరీర ధారి కాదు కనుక, అవయవములు లేవు. కనుక, కర్మలు చేయదు. కనుక, ఏ పనీ చేయకపోతే అపాయము ఎలా ప్రాప్తిస్తుంది. జన్మించిన వారికే, శరీర ధర్మములు ఉంటాయి. అమ్మ పరబ్రహ్మ పరమాత్మ స్వరూపిణి అయిన శ్రీమహారాజ్ని, నిరాకారా కనుక ఆకారమే లేకపోతే, అపాయము ఉండదు. అందువలన పరమేశ్వరి, "నిరపాయ" అయ్యింది.
పూర్వ జన్మల కర్మల ఫలితంగా, జననమరణ చక్రబంధం లో, జన్మించిన అందరికీ "బాలారిష్టాలు" అనే అపాయాలను చిన్నతనం నుండి తప్పించుకోలేక పోతారు. ఎదిగే క్రమంలో అనేక కర్మలు / పనులు చేస్తారు. ఫలితంగా గాయాలు కావచ్చు, అంగవైకల్యం సంభవించవచ్చు, అసలు ప్రాణానికే మోసం జరగవచ్చు. పరమేశ్వరి అనుగ్రహంతో అనాయాస మరణం దొరికే వరకూ, ఏ అపాయమైనా సంభవించవచ్చు. ఇవి అన్నీ, ఏదో ఒక రూపంలో జన్మించిన వారికే. శ్రీ లలితా పరాభట్టారికకు జన్మలూ లేవు. కర్మలూ లేవు. అందువలన, అపాయములు లేవు. అందుకనే పరాభట్టారికను "నిరపాయా" అని కీర్తించారు.
జన్మ, మృత్యు, జరా బాధలు లేని జగన్మాతను, తనను త్రికాలములయందు కాపు కాయగల అతీత శక్తి గా గుర్తెరిగి, తనను పూజించే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న శ్రీమాతను పూజించేటప్పుడు ఓం నిరాపాయాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి