శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ : - భాగం - 222
 

వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
200. సర్వమంగళా (పంచాక్షరీ)
201. సద్గతిప్రదా (పంచాక్షరీ)
రెండు వందల ఒకటవ నామ మంత్రము:
ఓం సద్గతిప్రదాయై నమః
సద్గతిప్రదా = స్వర్గము నుండి మోక్షము వరకు గల అన్ని సద్గతులను ఇచ్చునది
మోక్షము పొందడానికి దారి చూపి, స్వర్గము నుండి మోక్షము వరకు గల సద్గతులను ఇవ్వగలదానను తానే, అని తెలుపుతూ ప్రకటితమైన శ్రీచక్రరాజసింహాసనేశ్వరిని చూసిన వశిన్యాది వాగ్దేవతలు శ్రీలలితా పరాభట్టారికను, "సద్గతిప్రదా" అని కీర్తించారు. మనలను, సద్గురువు దగ్గరకు పంపి, వారి అనుగ్రహంతో ఆత్మజ్ఞానంను పొంది, అన్ని సద్గతులను పొందేటట్టు ఆశీర్వచనం పలికే దైవంకు నమస్కారము.
స్వర్గము పొందడం, ఒక సద్గతి. అలా స్వర్గము నుండి మోక్షము వరకు ఎన్నో సద్గతులు ఉన్నాయి, విష్ణు లోకము, రుద్ర లోకము.... ఇలా. చతుర్దశి తిథి నాడు శుచియై, దుర్గను, మనకు ఉన్నదానితో, భక్తి శ్రద్ధలతో పూజిస్తే, "రుద్ర లోకము" పొందుతారు అని పద్మపురాణము చెపుతోంది. ఏ రోజు , ఏ ద్రవ్యం తో పూజిస్తే, ఏ విధమైన ఫలితము వస్తుంది అనే విషయం కూడా ఇక్కడ వివరంగా తల్లి చెప్పింది. ఇది ఒక సద్గతి. ఇలా స్వర్గముతో మొదలై, మోక్షము వరకు తీసుకువచ్చి, చివరికి మోక్షపదములో స్థిరంగా ఉంచగలుగుతుంది, కనుకనే పరాత్పరిని "ససద్గతిప్రదా" అన్నారు వశిన్యాది వాగ్దేవతలు.
సద్గతులు, ఐహికము, ఆముష్మికము అని రెండు రకాలు. ఐహిక సద్గతులు - ప్రాపంచికమైన, పాంచభౌతిమైన కోరికలు. ఈ కోరికలతో తనను పూజించిన భక్తులను, వారికి ధనధాన్యాలు, సుఖసంతోషాలు ఇచ్చి అనుగ్రహిస్తుంది. ఆముష్మిక సద్గతి - ఆత్మ జ్ఞానం పొంది, పరమాత్మకు అతి చేరువగా ఉంటూ నిరంతరం సేవించుకోవాలి అనే కోరిక కలిగి పరమేశ్వరిని పూజించడం. ముక్తిని, మోక్షాన్ని పొందాలి అని తపించడం. పంచ బ్రహ్మలు అయిన, బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశాన, సదాశివులు కూడా అమ్మకు చేరువగా ఉండి సేవించుకునే అనుభూతిని శాశ్వతంగా పొందాలని, బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశానులు అమ్మ సింహాసనానికి కోళ్ళు అయ్యారు. సదాశివుడు అమ్మకు వస్త్రమై నిలిచి కొలుస్తున్నారు. అందువలన, శ్రీమాత "పంచబ్రహ్మాసనస్థితా" అయ్యింది. ప్రతీక్షణమూ సద్గతి ప్రసాదిస్తూ...."సద్గతిప్రదా" అనబడింది.
సద్గతులు స్థూలంగా, సార్షిరూప ముక్తి, సాలోక్య ముక్తి, సామీప్య ముక్తి, సారూప్య ముక్తి, సాయుజ్య ముక్తి అని ఐదు విధాలుగా చెప్పబడుతుంది. శ్రీమాతకు దగ్గరగా ఇంకొక పురములో ఉండి అమ్మను పూజిస్తే "సార్షిరూప ముక్తి". శ్రీమన్నగర నాయకి నగరంలోనే ఉండి సేవించుకుంటే, "సాలోక్య ముక్తి", తల్లికి అతి దగ్గరగా ఉండి సేవలందించిన, "సామీప్య ముక్తి", పరమేశ్వరిని సేవించేవారు వేరే శరీరం ధరించి, దేవితో సమానమైన రూపంలో ఉండి సేవిస్తే, "సారూప్య ముక్తి". ఇక, ‌సహస్రారంలో ఉండి అమ్మను పూజిస్తే, జన్మరాహిత్యాన్ని పొంది, అనవరతంగా అమ్మ సేవచేసుకుంటూ ఉంటారు. ఇది "సాయుజ్య ముక్తి".
ఈ విధంగా, ఎవరెవరి భక్తిప్రపత్తులకు అనుగుణంగా, తన సాధకులకు, భక్తులకు తత్వజ్ఞానం ప్రసాదించి మోక్షమార్గం లో నడిపించేది, పరమేశ్వరి అయిన శ్రీమాతయే అని నమ్మి, తనను పూజించి కొలిచే, తన భక్తులను, సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న  శ్రీమాతను పూజించేటప్పుడు   ఓం సద్గతిప్రదాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
🙏🙏🙏