ఇంతలో ఆ అమ్మవారి ముఖారవిందం వెలుగు రేఖల కమలంలా వికసించింది. ఏదో శక్తి జయసేనునిలో ప్రవేశించింది. అమ్మలగన్నయమ్మ అందరినీ ఒకే విధంగా కరుణించే తల్లి. ఏ విధివిధానంతో, ఏ సంకల్పంతో చేస్తే ఆయా కోరికలను తప్పక ఈడేర్చటం ఆ తల్లి అనుగ్రహానికి తార్కాణం. వక్రమల్లు తన మాయలతో లోకానికి కీడు తలపెట్టినా కూడా, వాడి అకుంఠిత క్షుద్రోపాసనకు అమ్మ తల ఒగ్గక తప్పదు. కానీ ఏదో రూపంలో ఇలాంటి దుష్ట కార్యాలకు ఆనకట్ట కట్టే జయసేనుని లాంటి వారికి దైవం తోడుండి, లోక కళ్యాణానికి మేలు చేయటానికి తమ వంతు సహకారం అందించక మానదు. ఆ కారణంగానే సౌరాష్ట్ర రాజ్యాధిపతి శివదత్తుని వేడుకోలుపై, వారు పూజించే ఆ కాత్యాయనీ మాత, జయసేనుని రూపంలో వారికీ, లోకానికి మేలు చేసే క్రమంలో భాగంగా అదృశ్య రూపం మరియు యక్షుని రూపంలో ఖడ్గం లాంటివి అందించింది. అనూహ్య పరిస్థితులను కల్పించి గండభేరుండుని మరియు రాక్షసుడు అచ్యుతుడిని పరిచయం చేసి, సహాయ సహకారాలను కల్పించింది. చివరికి దుష్టశిక్షణ గావించి, ఆ వీరుని ద్వారా మాయావిని అంతం చేయించి విజయాన్ని చేకూర్చింది. పరోపకార పారాయణలో ప్రాణాలను సైతం లెక్కచేయక, ధైర్యంతో ఎన్నో ఆటంకాలను ఎదుర్కుని, అమ్మను తోడుగా నిలవమన్న ప్రార్థనను ఆలకించి అనుగ్రహించింది. ఇంతటి మాయావి మరణంతో, నిప్పును కమ్మిన నివురులా వాడి మాయ అనే అరాచకం వీడిపోయింది.
యువరాణి అమృతవల్లి నిద్రనుంచి మేల్కన్నట్టు తల ఎత్తి అటూ ఇటూ చూసింది. ఏదో తెలియని భయం ఆవరించింది. కనుల ఎదురుగా ప్రజ్వరిల్లే హోమగుండం, మరోవైపు తలలేని మొండెం, నిలువెత్తు కాళీ అమ్మవారి విగ్రహం, తాను అలంకరించుకుని ఉండటం — అంతా అయోమయంగా ఉంది. "నన్ను వధించటానికి వక్రమల్లు పన్నిన పన్నాగంలో తనకు తెలియకుండానే తీసుకురాబడ్డానా?" అని భయాందోళనలతో పక్కకు చూసింది. చేతిలో కరవాలంతో జయసేనుడు నిలబడి ఉండటం చూసి, "ఈ మాయావి జయసేనుని రూపంలో ఉండి, నన్ను కాపాడటానికి వచ్చిన ఆ వీరునిపై తలపడి వధించినట్టున్నాడు. ఇక నన్ను బలి ఇవ్వటమే మిగిలింది. అమ్మా, ఎంత పని జరిగింది! చివరికి ఈ మాయావి చేతిలో నేను బలి కావాల్సిందేనా?" అని కనుల వెంట నీరు కారగా గజగజా వణికింది అమృతవల్లి.
అది గమనించిన జయసేనుడు, "సౌరాష్ట్ర యువరాణి అమృతవల్లి గారికి జయము, జయము! తమరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ మాయావి వక్రమల్లు నా చేతిలో అంతమయ్యాడు. వాడి తల అగ్నిగుండంలో ఆహుతి అయింది. తక్షణమే మన రాజ్యానికి పయనం కావటమే తరువాయి. ధైర్యంగా ఉండండి. క్షేమంగా మీ తల్లితండ్రుల వద్దకు చేర్చే బాధ్యత నాది" అని పలికాడు.
అంతే, చివాలున లేచింది. "నిజంగా ఇది కలా, నిజమా, లేక మాయనా? అంతుచిక్కటం లేదు, నాకంతా వింతగా ఉంది" అని పలికింది.
"మీరలా ఆలోచించటంలో నిజం లేకపోలేదు; కానీ ఇది ముమ్మాటికీ నిజం" అని జరిగినది అంతా వివరించాడు జయసేనుడు.
ఆమెలోని భయం తాలూకు విషాద ఛాయలు మాయమై, హర్షాతిరేఖలు వికసించాయి. "ఓ జయసేనా! నీవు చేసిన ఈ సాహసం అసామాన్యం. నేను, నా తల్లిదండ్రులు, నా రాజ్యం నీకు రుణపడి ఉంటాము. నీలాంటి సాహసవీరుడు మా రాజ్యంలో ఉండటం మా అదృష్టం" అని వేనోళ్ళ కొనియాడింది. అమ్మవారికి అనేక ధన్యవాదాలు తెలుపుకుని వెనుతిరిగారు ఇద్దరూ.
పరిచారిక తప్ప మిగిలిన పరిసరాలు అంతా మారిపోయాయి. ఆ పరిచారిక, "నేను బలవంతాన ఇక్కడికి రాబడ్డాను. ఇంతకు మునుపు ఎందరో అమాయక ఆడపిల్లలను చెరబట్టాడు. వారికి సేవలు చేయటం నా విధి. వారంతా ఏమయ్యారో తెలియదు. మీ దయవలన వీడు మరణించడంతో నాకు విముక్తి కలిగింది. నేను నా దేశం వెళతాను" అని సెలవు తీసుకుంది.
జయసేనుడు అమృతవల్లిని వెంటబెట్టుకుని తన పంచకళ్యాణి గుర్రం వద్దకు అడుగులు వేశాడు.
సశేషం...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి