అమ్మకీ ఒక ఆకాశం ఉండేది...: - - యామిజాల జగదీశ్


 అమ్మకీ ఒక ఆకాశం ఉండేది 
అయినా ఆ ఆకాశపు వెలుగు వంటింటి గడప దాటి ఎప్పుడూ బయటకు రాలేదు.
పాపం! వంటిల్లే 
అమ్మ ప్రపంచమైపోయింది.
ఆమెకు తెల్లవారేది పొయ్యి మంటల మధ్యనే... సాయంత్రాలు మాత్రం గిన్నెల చప్పుళ్లలో నెమ్మదిగా కరిగిపోయేవి.
ఇంట్లో ప్రతి ఒక్కరికీ వాళ్లకంటూ కొన్ని కలలుండేవి. ఆ కలల వైపు పరుగెత్తేందుకు దారులూ ఉండేవి.
కానీ అమ్మ ఒక్కతే అందరి కలల్నీ తన భుజాల మీద మోస్తూ నడవాల్సి వచ్చేది.
ఆమెకు ఏది ఇష్టమో ఎవరికీ తెలియదు. నిజానికి మేమెప్పుడూ అదేమిటని అడగనూ లేదు.
ఆమె ఎక్కడికి వెళ్లాలనుకుంది? ఏం చేయాలనుకుంది? ఎలాంటి జీవితాన్ని గడపాలని కలలు కనింది?
ఇవేవీ అడిగేంతగా మా ప్రేమ ఎప్పుడూ ఎదగనే లేదు.
పొయ్యి మంట ఆరిపోయాక కూడా ఆమె పనులు మాత్రం ఆగేవి కావు.
అలా ఒకరోజు వంటిల్లు నిశ్శబ్దమైపోయింది.
అమ్మ లేని ఆ వంటింట్లో ఏదో ఒకటి తక్కువైనట్టుగా అనిపించింది.
కానీ ఆమె వండింది కేవలం తిండి మాత్రమే కాదు... మా కోసం ఒక సంపూర్ణమైన ఇంటిని తన చేతులతో తీర్చిదిద్దిందని తెలుసుకోవడానికి ఆమె మాకు దూరం కావాల్సి వచ్చిందన్న నిజాన్ని తలచుకుంటే మనసు తట్టుకోలేకపోతోంది.
అవును... అమ్మకీ ఒక ఆకాశం ఉండేది.
ఆ ఆకాశాన్ని ఆమె తలెత్తి చూసేందుకు మేమెప్పుడూ కాస్తంత సమయాన్ని కూడా ఆమెకు ఇవ్వలేదు.
కామెంట్‌లు