కొత్త భాష నేర్చుకోవాలంటే ముందుగా పలకరింపులు, పరిచయాలు, కొన్ని మంచి పదాలు నేర్చుకోవాలి కదా! కానీ మనుషుల తెలివితేటలు చూడండి… కొత్త భాషలో మొదట నేర్చుకునేది బూతులే!
హలో, హాయ్, ఎలా ఉన్నావ్ అనేవి తర్వాతి అధ్యాయాలు. ముందుగా ఎదుటివాడిని ఎలా తిట్టాలో మాత్రం ప్రాథమిక పాఠం!అసలు ఆ భాషలో వ్యాకరణం తెలియకపోయినా పర్లేదు, బూతుల ఉచ్చారణ మాత్రం పక్కాగా ఉండాలి. అర్థం తెలియకపోయినా ఆ పదం ఎక్కడ వాడాలో మాత్రం అద్భుతమైన అవగాహన!కొత్త భాషలో మాట్లాడటానికి ఆత్మవిశ్వాసం కావాలట, కానీ తిట్టడానికి మాత్రం ప్రత్యేకమైన ధైర్యం అక్కర్లేదు!అవసరమైతే ఒక పదాన్ని పదిసార్లు పలుకుతూ ప్రాక్టీస్ చేస్తారు. అదే ఒక మంచి వాక్యం నేర్చుకోమంటే నాలుక తిరగదు. "సింపుల్‌గా చెప్పొచ్చు కదా!" అంటారు.
ఒకరిని పొగడటానికి పదాలు వెతుకుతారు, తిట్టడానికి మాత్రం నిఘంటువు అవసరం లేదు.ఇంకా విచిత్రమేమిటంటే, ఆ బూతుల అర్థం తెలియకుండానే స్నేహితుల మధ్య ప్రయోగాలు మొదలుపెడతారు. ఎదుటివాడు నవ్వితే విజయం, కోపగించుకుంటే భాషలో ప్రావీణ్యం సాధించినట్టే!
ఇలా భాషా పరిజ్ఞానం కంటే బూతుల పరిజ్ఞానమే వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్త భాష నేర్చుకోవడంలో ఇదొక అంతర్జాతీయ సంప్రదాయమేమో!
కానీ భాష అనేది మన భావాలను పంచుకోవడానికి, మనుషులను కలపడానికి పుట్టింది.మన మాటలతో ఎదుటివాడిని నవ్వించగలగడం గొప్ప విషయం. నవ్విస్తూనే నొప్పించకుండా ఉండగలగడం అంతకంటే "గొప్ప విషయం".
ఎందుకంటే, ఒక భాషలో మనకు ఎన్ని బూతులు వచ్చాయన్నది మన పరిజ్ఞానాన్ని చెప్పదు. ఆ భాషలో ఎన్ని మంచి మాటలు మాట్లాడగలమన్నదే మన సంస్కారాన్ని చెబుతుంది!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి