అసామాన్య సేవ : - వరలక్ష్మి యనమండ్ర


 ఆ రాత్రి కూడా భోజనాలయ్యాక ఐదుగురూ అరుగు మీద అమ్మమ్మ చుట్టూ చేరారు. వెన్నెల పాలు పోసినట్టు పరుచుకుంది.
"అమ్మమ్మా! ఈ రోజు ఎవరి కథ?" అడిగాడు కార్తికేయ.
"ఈ రోజు శ్రావణ కుమారుడి కథ చెబుతాను" అంది అమ్మమ్మ.
"శ్రావణ కుమారుడా? ఆయన ఎవరు అమ్మమ్మా?" అంది మయూఖ.
"ఒక అడవి పక్కన చిన్న కుటీరంలో శ్రావణ కుమారుడు తన అమ్మానాన్నలతో ఉండేవాడు. వాళ్లిద్దరూ వృద్ధులు, కళ్లు కనిపించవు. శ్రావణుడే వాళ్లకు కళ్లు, కాళ్లు, చేతులు అన్నీ."
"వృద్ధులు అంటే ఏంటి అమ్మమ్మా?" అడిగింది మయూఖ.
" అంటే ముసలి వారు అని అర్థం తల్లీ!" 
"అంటే వాళ్ళకు అన్ని పనులూ శ్రావణుడే చేసేవాడా? అమ్మో! చాలా కష్టం" అన్నది మహతి.
"అవును తల్లీ. పొద్దున్నే లేచి నీళ్లు తెచ్చేవాడు, వాళ్ళకి వండి పెట్టేవాడు, వాళ్లను జాగ్రత్తగా చూసుకునేవాడు. ఒక్కరోజు కూడా విసుక్కోలేదు."
"నేను అయితే విసుక్కుంటా. అమ్మ రోజూ 'బొమ్మలు సర్దు' అంటేనే నాకు చిరాకు వస్తుంది," అన్నాడు మిట్టు.
"అవునా? అమ్మ ఏమైనా చెప్పినప్పుడు విసుక్కోవడం బాగుందా నాన్నా?" అంది అమ్మమ్మ నవ్వుతూ.
మిట్టు తల దించుకున్నాడు. "బాగాలేదు అమ్మమ్మా."
"ఒకరోజు ఆ ముసలి తల్లిదండ్రులు 'మేము తీర్థయాత్రలకు వెళ్లాలని ఉంది నాయనా' అన్నారు. శ్రావణుడు 'అలాగే అమ్మా' అన్నాడు. వాళ్లు నడవలేరు కదా! కళ్ళు కూడా కనపడవు. అందుకే రెండు బుట్టల్లో ఇద్దరినీ కూర్చోబెట్టి, కావడిలా భుజాన మోశాడు."
"అమ్మో! అంత బరువా! ఎన్ని రోజులు మోశాడు?" ఆశ్చర్యంగా అడిగాడు మహి.
"ఎన్నో రోజులు, ఎన్నో ఊళ్లు, ఎన్నో కొండలు దాటాడు. అలసిపోయినా 'నా అమ్మానాన్నల సేవే నాకు గొప్ప పుణ్యం' అనేవాడు."
"వావ్! ఎంత మంచివాడు!" అన్నారు పిల్లలు.
"ఒక సాయంత్రం అడవి దారిలో వెళ్తుంటే మంచినీళ్ళు కావాలని అడిగారు వాళ్ళు. నీళ్లు తెస్తా, ఇక్కడే ఉండండి' అని వెళ్లాడు. నది దగ్గర కుండలో నీళ్లు నింపుతుంటే ఆ చప్పుడు విని అక్కడే వేటకు వచ్చిన దశరథ మహారాజు ఏనుగు నీళ్లు తాగుతోందేమో అనుకుని బాణం వేశాడు."
"అయ్యో!" అంది మహతి భయంగా.
"దశరథుడు పరిగెత్తుకెళ్లి చూస్తే శ్రావణుడు! ఎంతో బాధపడ్డాడు. శ్రావణుడు 'నా తల్లిదండ్రులకు ఈ నీళ్లు ఇవ్వండి' అని చెప్పి, కన్నుమూశాడు."
పిల్లలు కాసేపు మౌనంగా ఉండిపోయారు.
"తల్లిదండ్రులకు విషయం తెలిసి వాళ్ళు ఎంతో ఏడ్చారు. ఇంకా ఈ కథలో ఒక పెద్ద పాఠం ఉంది, చెప్పండి చూద్దాం."
"ఏదైనా చేసే ముందు సరిగా చూడాలి కదా!" అన్నాడు మహి. "దశరథుడు చూడకుండా బాణం వేశాడు కదా."
"భలే చెప్పావు నాన్నా!"
"అమ్మానాన్నలను బాగా చూసుకోవాలి!" అంది మయూఖ.
"వాళ్లు ఏం చెప్పినా విసుక్కోకూడదు!" అన్నాడు మిట్టు.
"పెద్దవాళ్లకు సేవ చేస్తే గొప్ప పుణ్యం వస్తుంది!" అన్నాడు కార్తికేయ.
"మంచి మాటలు. ఇప్పుడే మీరందరూ శ్రావణ కుమారుడిలా మాట్లాడారు," అంది అమ్మమ్మ మెచ్చుకుంటూ.
"అమ్మమ్మా, ఇకనుంచి నీకు కూడా కాళ్లు నొక్కుతా!" అంది మహతి.
"అది  గొప్ప సేవే తల్లీ!" అని అమ్మమ్మ నవ్వింది. అందరూ నవ్వారు.
అమ్మమ్మ ఐదుగురినీ దగ్గరకు తీసుకుంది. "మీరందరూ నా బుజ్జి శ్రావణ కుమారులు!"
"తర్వాత ఏమైందో చెప్పమ్మా!" అన్నారు.
" తరువాత చెబుతాను. ఈరోజుకి ఇక చాలర్రా పిల్లలూ!" 
" సరే అమ్మమ్మా! " అందరూ అన్నారు.
చందమామ చిరునవ్వు నవ్వింది. పిల్లలు అమ్మానాన్నలను తలచుకుంటూ హాయిగా నిద్రపోయారు.
కామెంట్‌లు