సామెత -400: ఈస తెలియదు -బాస తెలియదు
**
"ఏందో అవ్వా! కొంతమందిరిని సూత్తే శానా శానా జాలేత్తది. పాపం అన్పిత్తది. గీ లోకంల ఎట్ల బత్కుతరో అని బుగులు సుత ఏత్తదవ్వా!"
"ఎవలి ముచ్చెటి శెల్లే! గంత లోకం పోబడి తెల్వనోళ్ళు గీ కాలంల ఎవలున్నరు. మందిని ముంచెటోల్లు, మశిబూసి మారేడుగాయ శేసేటోళ్ళు ఉన్రుగని. "
"ఏమో అవ్వా! ఇంకా కొంత మందిరి శానా అమాయికమైనోల్లు సుత వుర్రని గీ నడ్మల్నే తెల్శింది. గాల్ల ముచ్చెటి సూత్తుంటే ఓ అయిపు నవ్వు, ఇంకోయేపు బాద అన్పిచ్చింది."
"అవునా శెల్లే! గింతకీ గసుమంటోళ్ళు ఎవలో శెప్పు?"
"మొన్న మా పెద్ద బాపు అత్త గదేనవ్వా మా పెద్ద బాపమ్మ కాలం జేత్తే యిష్యం తెల్శి వొయినం. పెద్ద ముత్తైదువు.సక్కని సావు సచ్చింది,అదృట్టం అన్కుంట ఊరు బట్టనంత సుట్టాలు పక్కాలు ఊల్లె జెనాలు వొచ్చిర్రు. గక్కడికి వో అత్త వొర్సయ్యేటామె వొచ్చింది."
" నేనేమో! తాత తాన కూసోని దైర్నం జెడకు తాతా! మంచి గుండు మేవందరం లేవాఁ ఏంది అని ఊకిత్తున్న.అగ్గో గప్పుడే గా అత్త మా తానికి వొచ్చింది."
" ఊకో అయ్యా ఊకో.. గా అవ్వ లెక్క మంచి సావు వొత్తదో రాదోనని రంది వడ్తున్నవా? నీకు సుత మంచి సావె వొత్తది.ఫికర్ జెయ్యకు " అంది.గా మాటల్కి తాత నేను తెల్లవొయినం. గిదేంది గిట్ల మాట్లాడింది.గా మాటలిన్న పతొక్కలు గామె వొంక గిదేం మడిషి అన్నట్టు సూసుడే.''
'కొంతమందిరి గట్లనే ఉంటరు శెల్లే.మొన్న మా సుట్టాలోల్లింట్ల లగ్గమైతే ఎల్లిన గద. గక్కడ లగ్గం సూస్కుంట ముచ్చెట్లు బెట్కుంట కూసున్నం. పట్టు పట్టు శీరలు గట్టి ఆడివిల్లలు శీతాకోక శిలుకల్లెక్క మా పక్కనే కూసోని ముచ్చెట్లు బెట్కుంటుర్రు.గక్కడికో సుట్టపామె వొచ్చి కూసోని గా ఆడివిల్లల్ని ఏందేందో అడగవట్టింది. ఓ పిల్లని లేపి లగ్గమైందా? అని అడ్గింది. గా పిల్ల సిగ్గు వడుకుంట ఇంక కాలే అంటే ఊకోవాల్నా ఎంత మంది పిల్లలు, మీ ఆయినేం శేత్తుండని అడ్గుతుంటే తెల్లమొకమేసింది" పెండ్లే గాలేదంటే పిల్లలూ, ఆయిన అంటవేంది అని పక్కనున్నోళ్ళు తలో మాట అనవట్టిర్రు."
"ఇద్దరికిద్దరు ఎవలో గని మాగనే ఉర్రు. ఎక్కడేం,ఎవలితో ఏం మాట్లాడాల్నో తెల్వని ఎడ్డె మొకాల్లెక్క ఉన్రుగద."
"అవునవ్వా!కర్మలకి వొయ్యినప్పుడు మల్లొచ్చింది.మల్ల తాత తానికి బొయ్యి " ముసలవ్వ బొయ్యింది గద లగ్గం ఎప్పుడు జేస్కుంటున్నవ్ "అంటే తాత బొక్కినోరేస్కుని కోపంగ సూస్కుంట నువ్వు శేస్కుంటవా శెప్పు గిప్పుడే లగ్గమాడ్త? ఏం మాట్లాడ్తున్నవే ఎడ్డెదానా? అని తిట్టినా తాను మాట్లాడిన దాంట్లె ఏం తప్పుందో తెల్వనట్టే మొకం బెట్టిందవ్వా?''
'గస్మంటోళ్ళు! కొందరుంటరు శెల్లే గాల్లకి" ఈస తెలియదు -బాస తెలియదు"."
"అంటేందవ్వా ! నాకు సమజవ్వలే"
' ఎక్కడ ఎవలితో ఏం మాట్లాడాల్నో తెల్వని ఎడ్డె మొకాలు కొందరుంటరు.ఏదన్న యిష్యం జెప్తే సూత్తే ఎంటనే అర్తం శేస్కోరు.అర్తం పర్తం లేని మాటలు మాట్లాడుతుంటరు.ఇంగితం తెల్వదు.ఎక్కడ ఎలా ఉండాల్నో తెల్వదు.గీల్ల అమాయీకత్తంతో ఎదుటోళ్ళూ బాదవడాల్సొత్తది."
"ఏం ముచ్చెటి సరింగ అర్తం శేస్కోరు.ఎట్ల మాట్లాడాల్నో తెల్వదు.గసుమంటి వోళ్ళని సూశే మన పెద్దోళ్ళు గీ" ఈస దెల్వదు - బాస దెల్వదు" శాత్రం సుష్టించిర్రు శెల్లే!"
"గిప్పుడు అర్తమైందవ్వా!అమాయికత్తం పాలెక్కువ.పాపం గస్మంటోళ్ళు నల్గుట్ల ఉంటే కట్టమే.నవ్వుల పాలవుతరు.తొందరగ మోసం సుత వోతరు."
గదండీ సంగతి! "ఈస తెలియదు -బాస తెలియదు" అంటే గిదే మరి "

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి