'డైట్' అనే విషాద ప్రయాణం: - మూలం : తమిళ కవి మనుష్య పుత్రన్: - అనుసృజన - యామిజాల జగదీశ్


జీవితంలో అత్యంత బాధాకరమైన
రోజుల్లో ఒకటి…
డాక్టర్ మనకంటూ ఓ 'డైట్'
సూచించే రోజు!

ఎందుకంటే…
జీవితంలో మనకు దక్కిన
అత్యంత గొప్ప విలాసం ఏదైనా ఉందంటే,
మనకు నచ్చిన ఆహారాన్ని
మనసారా తినడమే!

అలాంటిదానిపైనే
అకస్మాత్తుగా ఓ దాడి జరుగుతుంది.
మనకు ఎంతో ఇష్టమైన వ్యక్తిని
ఉన్నట్టుండి మన నుంచి
దూరం చేసినట్టుగా ఉంటుంది ఆ బాధ!

ఈ ప్రపంచంలో
వేల వేల రకాల ఆహార పదార్థాలున్నా,
మనకు ఇష్టమైనవి మాత్రమే
ఆ జాబితా నుంచి
ఎందుకు మాయమైపోతాయో మరి?

మనకు అత్యంత ఇష్టమైన వంటకాలన్నీ
నూనెలో బంగారు రంగులో
వేయించినవే అయి ఉంటాయి.
ఒకరోజు వాటినే తినకూడదంటారు!

మనకు కాస్త తక్కువ ఇష్టమైన
ఆనందాలన్నీ చక్కెరతోనో,
ఉప్పుతోనో ముడిపడి ఉంటాయి.
ఆ రెండింటినీ ఒకేసారి
వద్దంటూ నిషేధించేస్తారు!

ఇక మనకు మిగిలిన అతి చిన్న ఆనందం…
కడుపునిండా అన్నం తినడం.
అది మన రక్తంలోనే కాదు,
మన జన్యువుల్లోనే ఉంది!
ఒకరోజు దాన్ని కూడా
తినకూడదని చెప్పేస్తారు!

తినే పరిమాణం తగ్గించమంటారు.
అదెలా సాధ్యం చెప్పండి?
తిన్న తర్వాత కూడా
నాకు ఆకలిగానే ఉంటే?

సగం ముద్ద మాత్రమే మింగినట్టుగా,
ఎంతకీ తీరని అసంతృప్తి!
సరిపోని కొలతలోని దుస్తులు
ధరించినట్టుగా ఉక్కిరిబిక్కిరి!

కళ్లలో నీళ్లు తిరుగుతాయి.
ఇక దేన్ని ఆసరాగా చేసుకుని
ఎలా బతకాలి చెప్పండి అయ్యా!

క్షమించండి డాక్టర్ గారూ…

'ఆహారమే ఔషధం' అంటూ
వందేళ్లు బతకాలనే ఆశతో
మీరు సూచించే ఆహారాలన్నీ
రుచీ పచీ లేనివి,
కమ్మని వాసన కూడా లేనివి!

ఈ ప్రపంచంలో
మంచివని చెప్పబడే
చాలా విషయాలన్నీ
ఇలాగే ఉంటాయేమో!

ఒక మనిషిని శిక్షించడానికి
ఇంతకంటే కఠినమైన మార్గం మరొకటి లేదు.
అతని నాలుకను శిక్షించడం!

'నీ మంచికోసమే ఇదంతా' అని
మీరు చెబుతున్నారని నాకు తెలుసు.
అయితే ఇప్పటికే ఓ మాట ఉంది కదా…

**'నరకానికి వెళ్లే దారి
మంచి ఉద్దేశాలతోనే నిర్మితమవుతుంది'** అని!

నాకు ఎంతో ఇష్టమైన ఓ వంటకాన్ని
వదులుకోవడమంటే
సొంత ఇల్లు లేకుండా
వీధిన పడ్డట్టుగా అనిపిస్తుంది.

అది మనసులోని ఒత్తిడిని,
జీవితంలోని వెలితిని
ఇంకా ఎన్నో రెట్లు పెంచేస్తుంది!

నేనెంతగానో ప్రేమించే
కాఫీని వదిలేసి…
ఎలా వెళ్లగలను
'అరుగు గడ్డి రసం' దగ్గరకు?

ఒక 'డైట్' అనేది
ఒక జీవనశైలి నుంచి
మరో జీవనశైలిలోకి అడుగుపెట్టే
ఓ విషాదభరితమైన ప్రయాణం!

కామెంట్‌లు