జీవన చక్రం ; - యామిజాల జగదీశ్
 

ఇరవై ఏళ్ల వయసులో ఇది కావాలని అనిపిస్తుంది!
ముప్పై ఏళ్ల వయసులో అది కావాలని అనిపిస్తుంది!
నలభై ఏళ్ల వయసులో ఇదే చాలని అనిపిస్తుంది!
యాభై ఏళ్ల వయసులో ఇది లేకపోయినా పర్వాలేదనిపిస్తుంది!
అరవై ఏళ్ల వయసులో ఏది లేకపోయినా పర్వాలేదనిపిస్తుంది!
డెబ్బై ఏళ్ల వయసులో ఏదీ వద్దనిపిస్తుంది!
కాలమార్పు, కాలచక్రం, కాలపరిస్థితులు, పట్టుదల... ఇవన్నీ క్రమంగా మనిషిని కదలలేని స్థితికి చేరుస్తాయి.
అహంకారమంతా అణకువగా మారుతుంది.
అధికారమంతా తలవంచి నిలబడుతుంది.
బెదిరింపులన్నీ మౌనంగా మారిపోతాయి.
ఏది కావాలని ఒకప్పుడు ఆరాటంగా పరుగులు తీశామో, అదే మనకు దూరంగా ఉంటే చాలని అనిపిస్తుంది.
దేనికోసం పరుగులు తీశాం? 
దేనికోసం ఆశపడ్డాం? 
దేనికోసం ఏం చేశాం? అనే కారణాలన్నీ కాలం గడిచేకొద్దీ మరిచిపోతాం. చివరికి వాటిపై ఆసక్తి కూడా చచ్చిపోతుంది!
తీరని పగలను మనసులో పెట్టుకుని, కక్షతో జీవితాన్ని గడుపుతూ మనల్ని ఆడించేది కూడా కాలమే.
ఆ తరువాత ఆ ఆటకు తెరదించి, మరుపును కానుకగా ఇచ్చి, జీవితపు చివరి అంచున నిశ్శబ్దంగా కూర్చోబెట్టేది కూడా అదే కాలమే.
బయటకు మహలులా కనిపించే ఏదీ, లోపల ఉన్న పగుళ్లను బయటపెట్టదు.
జీవితంలో పరిణతి సంపాదించడం అంత సులభం కాదు. అందుకోసం ఎన్నో అవమానాలను, మరెన్నో పరీక్షలను దాటి రావాల్సి ఉంటుంది!
ఎవరి అనుభవం వారిది.
జీవిత సత్యాలు.
కామెంట్‌లు