సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!
 స్త్రీ పర్వము ద్వితీయాశ్వాసము- 462 వ రోజు

 

గాంధారి దుశ్శాసనుడి కొరకు దుఃఖించుట
ఇంతలో గాంధారి దుశ్శాసనుడి శవాన్ని చూసి మహోద్వేగంతో " కృషా ! వీడేనయ్యా నా కుమారుడు దుశ్శాసనుడు. మహాబలసంపన్నుడు. భీముడి గదా ఘాతానికి బలి అయి ఇలా దిక్కు లేకుండా నేల పడి ఉన్నాడు. భీముడు వీడి గుండెలుచీల్చి రక్తంత్రాగిన తరువాత నిర్జీవుడయ్యాడు. వీడు నా కోడలు జుట్టు పట్టి సభకు ఈడ్చినందుకు ఫలితం అనుభవించాడయ్యా ! భీముడి గుండెలు మండేలా ద్రౌపది ఏడుస్తుంటే వీడు నా కుమారుడు సుయోధనుడికి, అంగరాజు కర్ణుడికి ప్రీతి కలిగించడానికి ద్రౌపది వలువలు ఊడదీయ ఉద్యుక్తుడైన వీడి పాపం ఊరికేపోతుందా ! అందుకే దిక్కు లేని చావు చచ్చాడు. వీడి విషయం విని నేను సుయోధనుడితో " కుమారా ! ఈ ద్రౌపది తన అన్న కృష్ణుడి సంరక్షణలో ఉన్న విషయం నీకు తెలుసా ! ఆమెను ఇంత నీచంగా అవమానించడం మీకు మంచిది కాదు. ఇందుకు పర్యవసానం తెలిసే మీరు ఈ పనికి ఒడిగట్టారా ! భీముడి బలపరాక్రమాలు తెలిసే అతడి భార్య ద్రౌపదిని అవమానించారా ! తక్షణమే ఆమెను విడిచి పెట్టండి. కౌరవకులకాంత ద్రౌపదిని గౌరవించండి. నా తమ్ముడైన శకుని అత్యంత నీచుడు, క్రూరుడు, దౌర్భాగ్యుడు వాడి మాట వినకు వాడి స్నేహం వదులు కౌరవవంశాన్ని రక్షించు " అని ఎన్నో విధముల సుయోధనుడికి చెప్పాను. అయినా నా మాటను ఎవరు వినక ఇలా చచ్చారయ్యా కృష్ణా ! విధిరాతను తప్పించ ఎవరి తరం కృష్ణా !
గాంధారి భీముని నిందించుట
కృష్ణా ! ఆ భీముడు నాడు కురుసభలో ఎన్ని మాటలన్నా ! ఎంత అవమానించినా ! సహించాడు భరించాడు. సమయం కొరకు పగబట్టిన త్రాచు పాములా కాచుకుని ఉన్నాడు. యుద్ధంలో అవకాశం రాగానే నా కుమారులందరినీ తన గధతో మోది చంపాడు. పగతీర్చుకోవడం న్యాయమే ఇలా గుండెలు చీల్చడం న్యాయమా ! మహా వీరుడైన భీముడికి ఇది తగునా ! ఇందు వలన భీముడికి కీర్తి కలుగుతుందా ! చూడవయ్యా కృష్ణా ! నా కొడుకు దుశ్శాసనుడు ఎలా ఉన్నాడో చూడు. చెల్లాచెదురైన అవయవములను చూడు. సింహం గోళ్ళతో చీల్చినట్లు ఆ భీముడు నా కుమారుడి గుండెలు ఎలా చీల్చాడో చూడు. కనిపెంచిన కొడుకు శరీరం ఇలాంటి స్థితిలో చూసిన తల్లి మనస్సు కుమిలి పోకుండా ఎలా ఉంటుంది కృష్ణా !
గాంధారి వికర్ణుడి కొరకు దుఃఖించుట
అయ్యో ! వికర్ణుడు ఇక్కడున్నాడు చూడవయ్యా ! ఆ ఏనుగుల కళేబరాల మధ్య వికర్ణుడి భార్య నా కోడలు గుండెలు అవిసేలా ఎలా రోదిస్తుందో చూసావా కృష్ణా ! వికర్ణుడి శరీరం మీద పొడుచుకు తినడానికి వాలు తున్న గద్దలను రాబందులను తోలుతూ భర్త శరీరం మీద పడి రోదిస్తుంది చూడవయ్యా ! కృష్ణా ! ఇలాంటి స్థితిలో కొడుకులను కోడళ్ళను చూసే ధౌర్భాగ్యురాలిని ఎక్కడైనా చూసావా ! ఎలాంటి వీరుడినైనా అవలీలగా ఎదుర్కునే దుర్ముఖుడు అలాంటి వీరుడు భీముడి గధాఘాతానికి ఎలా బలి అయ్యాడో చూసావా ! నా కొడుకు శూరసేనుడిని చూసావా ! అతడి భార్యలను చూడు భర్త శవం చుట్టూ చేరి ఎలా రోదిస్తున్నారో చూడయ్యా ! కాకులూ గద్దలూ పొడుచుకు తిన్న అతడి శరీరం గుర్తించ వీలు కావడం లేదయ్యా ! కృష్ణా ! నా కుమారుడిని వివిశంతిని చూసావా ! వీడికి సంగీతం అంటే ప్రాణం. ఎప్పుడూ సంగీత విద్వాంశులైన స్త్రీలు సంసేవిస్తుండగా గానామృతంలో తేలియాడే వివిశంతి ఇప్పుడు నక్కల ఊళలు వింటున్నాడు. అని పరిపరి విధముల కుమారుల మరణానికి గాంధారి విలపిస్తుంది.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
కామెంట్‌లు