కాకినాడ ఆడబాల ట్రస్ట్ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డా అడ్డాల సత్యనారాయణ చే ఫ్లాసింగ్ యొక్క ఉపయోగం, వాడే పద్ధతిని వివరించారు. ఈ సందర్భంగా డా అడ్డాల మాట్లాడుతూ నేషనల్ ఫ్లాసింగ్ డే ప్రతి సంవత్సరం నవంబర్‌లోని నాలుగవ శుక్రవారం జరుపుకుంటారని, ఈ రోజు దంతాల మరియు చిగుళ్ల ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి, రోజువారీ ఫ్లాసింగ్ అలవాటును ప్రోత్సహించడానికి అంకితం చేశారని, కేవలం బ్రష్ చేయడం వల్ల పళ్ళ మధ్య సందుల్లో ఇరుక్కున్న ఆహార కణాలు, ఫలకం పూర్తిగా తొలగిపోవని, ఫ్లాసింగ్ వల్ల దంతక్షయం, చిగుళ్ల వ్యాధులు, నోటి దుర్వాసన వంటి సమస్యలను నివారించవచ్చని, వ్యాక్స్డ్ ఫ్లాస్ వాడటం వల్ల పళ్ళ మధ్య సందులు ఇరుకుగా ఉన్నప్పుడు లేదా బ్రేసెస్ ఉన్నప్పుడు సులభంగా శుభ్రం అవుతుందని అన్నారు. రోజువారీ దంత సంరక్షణలో బ్రషింగ్‌తో పాటు ఫ్లాసింగ్ చేయడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని, బ్రష్ చేరలేని పళ్ళ మధ్య సందుల్లో పేరుకుపోయే బ్యాక్టీరియా పొరను ఫ్లాసింగ్ తొలగిస్తుందని,
పళ్ళ మధ్య ఇరుక్కున్న ఆహార కణాలను, చక్కెర నిల్వలను శుభ్రం చేయడం ద్వారా దంతాలు పుచ్చిపోయే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని, చిగుళ్ల అంచున పేరుకునే బ్యాక్టీరియాను తొలగించి, చిగుళ్ల వాపు మరియు తీవ్రమైన పెరియోడాంటైటస్
వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుందని,
పళ్ళ మధ్య కుళ్ళిపోయే ఆహార వ్యర్థాల వల్ల కలిగే దుర్వాసనను అరికట్టి, శ్వాసను తాజాగా ఉంచుతుందని, నోటిలోని బ్యాక్టీరియా రక్తప్రవాహంలోకి చేరితే గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉందని, ఫ్లాసింగ్ ద్వారా నోటిని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల శరీర ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని అన్నారు. ఫ్లాసింగ్ సరైన పద్ధతిలో చేయాలంటే, సుమారు 18 అంగుళాల పొడవున్న ఫ్లాస్ దారాన్ని తీసుకుని,రెండు చేతుల మధ్య వేళ్ళకు చుట్టుకుని, మధ్యలో 1–2 అంగుళాల భాగాన్ని శుభ్రం చేయడానికి ఉంచాలని, దారాన్ని పళ్ళ మధ్యకు నెమ్మదిగా, అదుపుగా పంపాలని, చిగుళ్ళపై బలంగా ఒత్తిడి పెట్టవద్దని,
దంతం ఆకృతికి తగినట్లు 'C' ఆకారంలో వంచి, చిగురు అంచు కింద వరకు సున్నితంగా పైకి-కిందికి కదపాలని, ప్రతి కొత్త పంటికి దారం యొక్క శుభ్రమైన భాగాన్ని ఉపయోగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, నిమ్మకాయల వెంకటేశ్వర రావు, ప్రసాద్ నాయుడు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి