కాకినాడ నాగమల్లి తోట వద్ద ఉన్న టీం ఆసుపత్రిలో అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం సందర్భంగా మహిళలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సత్య దంత వైద్యశాల అధినేత డా అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా 'అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం' నిర్వహిస్తారని, మహిళలు మరియు బాలికలపై జరుగుతున్న శారీరక, మానసిక, మరియు గృహ హింసను అరికట్టడం, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం అని, 1960 నవంబర్ 25న డొమినికన్ రిపబ్లిక్ నియంత రఫేల్ ట్రుజిల్లో పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ప్యాట్రియా, మినర్వా, మరియా తెరెసా అనే ముగ్గురు మిరాబల్ సోదరీమణులను అత్యంత దారుణంగా హత్య చేశారని, వీరి త్యాగానికి గుర్తుగా 1981 నుండి మహిళా హక్కుల కార్యకర్తలు నవంబర్ 25న హింసకు వ్యతిరేకంగా దినోత్సవాన్ని జరపడం ప్రారంభించారని, మన సమాజంలో
మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాలను కఠినంగా అమలు చేయాలని, హింసకు గురైన మహిళలకు న్యాయపరమైన, వైద్యపరమైన మరియు మానసిక సహాయం అందించాలని,
నవంబర్ 25న ప్రారంభమయ్యే ఈ ప్రచారం, డిసెంబర్ 10న జరిగే అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం వరకు 16 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. ఇంట్లో మౌనం, బయట భయం ఈ రెండింటి నుంచీ స్త్రీకి విముక్తి కావాలని, మహిళల పై చెయ్యి ఎత్తడం బలం కాదని, అది మగవారి బలహీనతకు నిదర్శనమని, స్త్రీ అంటే సృష్టికి మూలమని, ఆమెను రక్షించుకోవడం మన బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్, వర్మ, డా సబిత, జ్యోతి, జయ లక్ష్మి, స్రవంతి, లక్ష్మి తదితర మహిళలు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి