సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!
 స్త్రీ పర్వము ద్వితీయాశ్వాసము- 460 వ రోజు


ద్వితీయాశ్వాసం

వైశంపాయన మహర్షి జనమేజయునకు చెప్పిన మహా భారతకథను సూతుడు నైమిశారణ్యంలో శౌనకాది మహామునులకు చెప్పసాగాడు. ఆ ప్రకారంగా ద్రౌపదిని ఓదార్చిన తరువాత యుద్ధభూమికి వెళ్ళింది. వ్యాసమహాముని కరుణ వలన ఆమెకు కళ్ళకు గంతలు ఉన్నా యుద్ధ భూమి సవిస్తరంగా కనిపించసాగింది. సుదూరంలో ఉన్న దృశ్యాలు దగ్గరగా క నిపించసాగాయి. గాంధారి యుద్ధభూమి అంతా పరికిస్తూ ముందుకు నడుస్తుంది. ఆమె కళ్ళు సుయోధనుడి శవం కొరకు గాలిస్తున్నాయి. విరిగిన రథాలు, ముక్కలైన ధ్వజాలు, చచ్చిన ఏనుగులు, గుర్రాలకళేబరాలు గుట్టలుగా పడి ఉన్నాయి. చనిపోయిన సారధులు, సైనికుల శవాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. తల ఒక చోట ఉంటే మొండెం మరొక్క చోట ఉంది. అది చూసి గాంధారి మనసు కలత చెందింది. మహా మహా సామ్రాజ్యాలు ఏలిన మహారాజులు నోళ్ళు తెరచుకొని శవాలై పడి ఉన్నారు. వారి శరీరాల నుండి కారిన రక్తం కాలువలై ప్రవహిస్తుంది. వారు ధరించిన విల్లులు, అంబులు, కత్తులు మొదలైన ఆయుధములు గుట్టలుగా పడి ఉన్నాయి. కొంత మంది శరీరాలు గుర్తించ వీలు లేని విధంగా ఉన్నాయి. వాటి కొరకు వచ్చిన రాబందులు, గద్దలు, అక్కడక్కడా ఎగురుతూ దొరికిన శవాన్ని దొరికినట్లు పీక్కు తింటూ తిరుగుతున్నాయి. తోడేళ్ళు స్వైర విహారం చేస్తూ శవాలని చీల్చి కండలు ఊడబెరికి తింటున్నాయి.
గాంధారి బాధ
ఇదంతా చూసిన గాంధారి మనసు బాధతో విలవిల్లాడింది. తన కుమారుడి మూర్ఖత్వం ఇంతటి మారణహోమానికి దారి తీసిందని బాధపడింది. వ్యాసుడు ధృతరాష్ట్రుడితో శవాలన్నింటికీ సామూహిక దహనకాండలు జరిపించమని చెప్పి వెళ్ళి పోయాడు. పాండవులు, శ్రీకృష్ణుడు, ధృతరాష్ట్రుడిని నడిపించుకుంటూ తీసుకు యుద్ధభూమికి తీసుకు వచ్చారు. గాంధారి కోడళ్ళు అందరూ తమ తమ భర్తల శవాల కొరకు యుద్ధ భూమి అంతా కలియ తిరుగుతున్నారు. ఇతర హస్థినాపుర స్త్రీలు కూడా తమ భ్యర్తల కళేబరాల కొరకు తిరుగుతున్నారు. అందరూ బిగ్గరగా ఏడుస్తూ, కుమారులనూ, భర్తలను పిలుస్తూ తూలుతూ నడుస్తున్నారు. కొంత మంది తమ సోదరులు, భర్తలు, కుమారులు, బంధువులు శవాలుగా పడి ఉండటం చూసి సహించ లేక హాహాకారాలు చేస్తూ మూర్ఛ పోయారు. మరి కొంత మంది చని పోయిన వారి గురించి తలచుకుంటూ వారి గురించి చెప్పుకుంటూ తలలు బాదుకుంటున్నారు.
గాంధారి కృష్ణుడితో చెప్పి విలపించుట
ఇది చూసిన గాంధారి మనసు కకావికలు కాగా దూరంగా ఉన్న కృష్ణుడిని దగ్గరకు పిలిచి " కృష్ణా ! చూడవయ్యా ధృతరాష్ట్ర మహారాజు కోడళ్ళు ఎలా ఏడుస్తున్నారో చూడు. వారి భర్తల శవాల కొరకు ఎలా వెదుకుతున్నారో చూడు. ఒకరి భర్తల శరీరాలను ఒకరు వెతుకుతూ ఏడుస్తూ వారి వారి భార్యలను ఏడుస్తూ ఎలా పిలుస్తున్నారో చూడవయ్యా ! నా కుమారుల మీద కసి ద్వేషం పెంచుకున్న వారి కళ్ళు ఈ దృశ్యాలు చూసి చల్లబడ్డాయా ! వీరంతా ఏమి పాపపం చేసారని వీరికి ఈ శిక్షవేసారయ్యా మీరు. అడుగో ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, ద్రుపదుడు వీరంతా చనిపోయినా ముఖంలోని కళ తగ్గకుండా ఎలా వెలిగిపోతున్నారో చూడవయ్యా ! అత్యంత భోగాలను అనుభవించిన ఆ మహానుభావులు ఎలా పడి ఉన్నారో చూడవయ్యా ! వంది మాగధులు కైవారముతోగాని నిద్ర లేవని ఈ మహా మహులు ఈ రోజు నక్కల ఊళల మధ్య అచేతనంగా పడి ఉన్నారయ్యా ! హంస తూలికా తల్పమున గాని శయనించని రాజాధిరాజులు కటిక నేలన పడి ఉన్నారయ్యా ! నానా విధ సుఘంధ లేపనాలతో శరీరాలను అలంకరించుకునే రాజాధిరాజులు ధూళి దూసరిత రక్తమయ భూమిలో దొర్లుతున్నారు చూడవయ్యా ! కృష్ణా ! ఇవన్నీ చూసి ఎలా ఊరుకున్నావయ్యా ! ఇదంతా నీవు సాధించిన ఘనకార్యం కాదా ! అటు చూడవయ్యా ! కొంత మంది కౌరవ కాంతలకు తమ భర్తల తలలు కానక ఎలా విలపిస్తూ వెతుకుతున్నారో చూడవయ్యా ! మరి కొందరు తలలు చేత పట్టి మొండెములు కానక అల్లాడుతున్నారయ్యా ! మరి కొందరు ముక్కలై పోయిన తమ భర్తల శరీరభాగాలను ఒకటిగా చేర్చి కుమిలి కుమిలి ఏడు స్తున్నారయ్యా ! మరి కొందరు నక్కలు తోడేళ్ళు చిందర వందర చేయడంతో శరీరాలను కానక క్షోభిస్తున్నారయ్యా ! ఇటువంటి దురవస్థలను చూడడానికి నేను ఈ జన్మలో ఏపాపపం చేసానో కృష్ణా ! నా కొడుకులను, కోడళ్ళను, తమ్ముళ్ళను, బంధువులను ఇలాంటి దుస్థితిలో చూస్తున్నాను " కాని కృష్ణుడు మాటాడక నిశ్శబధంగా గాంధారి వెంట నడుస్తున్నాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
కామెంట్‌లు