కదిలే బొమ్మల కథలో నేను: - బి.ఉషారాణి- Govt టీచర్- మంచిర్యాల


కదిలే బొమ్మలం మనం
అందమైన తోలుబొమ్మలం
విధి చేతిలో కీలుబొమ్మలం
వింత ఆటలో పావులం!

ఒక్కో బొమ్మకు ఒక్కో ఆట
ఒక్కో బొమ్మకు ఒక్కో కథ
ఒక్కో బొమ్మకు ఒక్కో పాత్ర
ఒక్కో బొమ్మకు ఒక్కో వేషం!

ఆట మొదలైతే ఆనందాల హేల
ఆట ముగిస్తే విషాదాల జ్వాల
నవ్వుల వెనుక కన్నీటి కథ
కన్నీటి వెనుక సంతస గాథ!

ఈ తోలితిత్తి శాశ్వతమనుకుంటూ
ఈ బొమ్మల కథ అవిరామమనుకుంటూ
ఆశల పల్లకిలో ఊరేగుతూ
ఆశయాల వెంట పరుగులు తీస్తూ...

భ్రమల లోకంలో విహరించే బొమ్మను నేను
భవబంధాలలో చిక్కుకున్నాను నేను
తెర వెనుక నడిపించే శక్తిని మరచి
తెరపై నా ఆటే గొప్పనుకుంటున్నాను!

చివరకు మిగిలేది ఏమిటని తెలియక
చివరి మజిలీ ఎక్కడో ఎరుగక
కాలం ఆడించే వింత నాటకంలో
ఓ పాత్రధారిగా మిగిలిపోతూ...
కామెంట్‌లు