విద్యావ్యవస్థ ********************************** శ్లో. విద్యానామనరస్యరూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనమ్ విద్యాభోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురుః విద్యా బంధుజనే విదేశగమనే విద్యపరాదైవతా విద్యా రాజ్య సుపూజ్యతే నహి ధనం విద్యా విహీనః పశుః-భర్తృహరి దీనిని ఏనుగు లక్ష్మణ కవి ఇలా తెనిగించారు. ఉ. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్ విద్యయశస్సు భోగకరి విద్యగురుండు విదేశబంధుడున్ విద్య పరాధిదైవతము విత్తము గాదది చూడగానిలన్ విద్యనృపాల పూజితము విద్యనెరుంగనివాడు మర్యుడే విద్య ప్రాశస్త్యాన్ని గురించి వందల సంవత్సరాల క్రిందనే మన పూర్వీకులు తెలియజెప్పినా మనం ఇంకా విద్య గురించిన అవగాహనలో వెనుకబడే ఉన్నామని చెప్పక తప్పదు. ముందుగా మనకు విద్య అనగానే కేవలం పాఠశాలలో చదువుకునే అక్షరాస్యత లేక అక్షరబద్ధమైన చదువు గురించే దృష్టి పోతుంది. అక్షరాస్యులు కాని వారు ఎందరో అనేక విద్యలలో ఆరితేరిన వారున్నారు. ఎందరో కర్షకులు వ్యవసాయరంగంలో నిష్ణాతులై మంచి పంటలను పండిస్తున్నారు. కుమ్మరి కుండలు చేసినా.కమ్మరి కర్రులు చేసినా,కంసాలి నగలు చేసినా,మంగలి కేశసౌందర్యాన్ని ఇనుమడింపజేసినా, గాయకుడు తీయగా పాడినా,వంటవారు కమ్మని పదార్థాలు వండిపెట్టినా చిత్రకారుడు బొమ్మలుగీసినా ఇవన్నీ విద్యలే.ఇలాంటి విద్యలు ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలు.చేపట్టిన వృత్తి ఏదైనా దానిలో పరిపూర్ణతను సాధించటం గమ్యమైతే,వానిలో అక్షరాస్యులై పండితులై జ్ఞానం సంపాదించే అవకాశం కలిగిన విద్య యొక్క పరమార్థం మాత్రం పరిపూర్ణ మానవుడుగా రూపొందించటమే. తుమ్మూరి రామ్మోహన్ రావు


కామెంట్‌లు