టెన్షన్ తో నిరీక్షణ ---- 1 ------- 15 ఏప్రిల్ 1972 తేదీ ఉదయం శ్రీకాకుళం వెళ్ళడానికి తెల్లవారుజామున బయలు దేరాలి. ఉదయం 6గంటలకు రాయపూర్ నుండి పార్వతీపు‌రం వెళ్ళే ట్రైన్ గుమడ రైల్వే స్టేషన్ కు వస్తుంది. అయితే కొమరాడ ఇంటి నుండిఉదయం 5 గంటల లోపే బయలుదేరాలి. ఎందుకంటే కొమరాడ నుండి గుమడ రైల్వే స్టేషన్ కు రమారమీ రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. అందులోనూ చీకటిలో వెళ్ళాలి. ఆ రోజుల్లో కొమరాడ చుట్టూ అడవి, కొండలు,తుప్పలు, డొంకలు. పెద్ద పెద్ద దట్టమైన వృక్షాలు, మామిడి తోటలతో మహా భయంకరంగా ఉండేది. అందులోనూ ఎలుగుబంట్లు, నక్కలు, తోడేళ్ళు వంటివి సాయంత్రం అయ్యేసరికే కొండలమీద నుండి ఊరి పొలిమేరల్లోకి వచ్చేవి . దానికి కారణం - దట్టమైన ఇప్పతోటలు, నిద్ర గన్నేరు పళ్లు, చెరకు తోటలు, పనస తోటలు, కందమూలం, సీమపెండలం, వేరుశనగ పంటలు ఉండేవి. చల్లగాలి పీల్చటందుకు, మంచి నీరు త్రాగేటందుకు విశాలమైన, లోతైన నాగావళి ఏరు ఉండేవి. ఈ పరిస్థితులలో ఏ ఒక్కరూ స్టేషన్ కు ఒంటరిగా వెళ్ళడానికి సాహసించేవారుకాదు. అందుకే రాత్రి సిరికి అప్పలస్వామి తన ఇంటికి వెళ్ళే ముందు రైల్వే స్టేషన్ కు నాకు తోడుగా రమ్మనమని కోరాను. శనివారం ఉదయం నేను కోరినట్టే అప్పలస్వామి వచ్చాడు. అతనేకాదు. మరో ఇద్దరు కూడా తనతోపాటు తెచ్చాడు. నలుగురం కలసి గుమడ రైల్వే స్టేషన్ కు బయలు దేరాం. గాడాంధకారమైన చీకటి. స్టేషన్ కు వెళ్ళాలి అంటేచాలా లోతైన ఎత్తు పల్లాలతో కూడిన ప్రదేశాలను దాటాలి. దాని తరువాత అతి దట్టమైన మామిడి తోట. గుల్లప్పన్న తోట అనేవారు. దాని గుండా వెళ్తే మైదాన ప్రాంతం వస్తుంది. ఆ తరువాత రైల్వే స్టేషన్ చేరుకుంటాం. అలా నడుచుకుంటూ మా నలుగురం మామిడి తోట దగ్గరకు వచ్చాము.నాకు అక్కడకు వచ్చేసరికి జంకు వచ్చి ఆగిపోయాను. "ఏం బాబూ ఆగిపోయారు. పదండి" అన్నాడు అప్పల స్వామి. ఏం లేదులే అంటూ గతంలో జరిగిన సంఘటన చెబుతూ నడక సాగించాను. " అప్పలస్వామీ ,నేను తొమ్మిదవ తరగతి చదువు తుండేవాడిని. నాన్నగారితో ఒకనాడు రైల్వే స్టేషన్ కు వస్తున్నాను. ఆ మలుపులోనే ఒక పుట్ట ఉంది. అక్కడ ఒక ఎలుగుబంటి పుట్టలోని చీమలను పీల్చుతుంది. ఏదో వింతైన శబ్ధం నాన్నగారు విని "బాబూ ఎలుగుబంటిరా ! అక్కడ ఆ మూలనున్న పుట్ట కొడుతోందిరా "అన్నారో లేదో మానాన్నగారిని విడిచిపెట్టి వెనుదిరిగి పరుగెత్తడం మొదలు పెట్టాను. నాన్నగారు నా వెనుకనే శబ్దం చేయకుండా నెమ్మదిగా నడుచుకుంటూ వస్తూ"బాబు! ఆగు. పరుగెత్తకు" అంటూ నన్ను ఆగమంటున్నారు. కానీ ఆగకుండా ఒకటే పరుగు తీసి ఒక దగ్గర ఆగాను. నా ప్రాణభయం నాదేగానీ నాన్నగారి గురించి ఏమాత్రం ఆలోచించలేదని అన్నాను. అది విని అందరూ నవ్వుకున్నారు. ఇంతలో రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసాం అలా కబుర్లు చెప్పుకుంటూ. మరి కాసేపట్లో ట్రైన్ వచ్చేసింది. నన్ను ట్రైన్ ఎక్కించి " బాబూ ! జాగ్రత్తగా ప్రయాణం చేసి రండి " అని అభిమానంగా సాగనంపారు. ఒక అరగంటలో పార్వతీపురంలో ట్రైన్ దిగి శ్రీకాకుళం బస్సుకోసం ఎదురు చూస్తున్నాను. (సశేషం ) శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.


కామెంట్‌లు