పుత్రశోకం భరించలేనిది -------////////-------------------- తమిళనాడులోని కుంభకోణంలో 2004 జూలై 16న జరిగిన విషాదగాథ అది. కొబ్బరి ఆకుల పైకప్పులతో నిర్మించిన తరగతి గదులున్న శ్రీకృష్ణా పాఠశాలలో సంభవించిన అగ్నిప్రమాదం లో 94 మంది చిన్నారులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన విషయం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ప్రమాదంలో మరో 18 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఇటీవల తమిళ రచయిత భారతీ కృష్ణకుమార్ ఓ సంఘటనపై ప్రసంగిస్తూ ఈ స్కూలు ప్రమాదంలో మరణించిన ఓ అబ్బాయి వాళ్ళ ఇంటిని సందర్శించి ఆ బాధిత కుటుంబంలో నెలకొన్న స్థితిని చెప్పిన తీరు హృదయవిదారకం. దుర్ఘటన జరిగిన రెండేళ్ళ తర్వాత కృష్ణకుమార్ ఆ ఇంటికి వెళ్ళేసమయానికి తన చిన్నారి కొడుకు ఫోటోకి పువ్వులు చల్లి పూజిస్తున్నారు. రచయిత మౌనంగా నిల్చున్నారు. అనంతరం కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఆరోజు అక్కడే వారితో కలిసి భోజనం చేశారు. చేతులు కడుక్కోవడానికి పెరట్లోకి వెళ్ళిన రచయితను ఆ అబ్బాయి తల్లి "అన్నా! మీతో ఒక్క మాటా మాట్లాడవచ్చా?" అని పక్కవాళ్ళకెవరికీ వినిపించనంత నెమ్మదిగా జాలిగా అడిగారు. "చెప్పమ్మా" అన్నారు రచయిత కృష్ణకుమార్. "ఏమీ లేదు...మా ఆయనను పనికి వెళ్ళమని చెప్పండి. ఈ మాట సాయం చేయండి చాలు. నేను ఓ నాలుగిళ్ళల్లో అంట్లు కడిగీ అవీ ఇవీ పనులు చేసి ఎంతో కొంత డబ్బులు సంపాదించగలను. కానీ ఆయన అబ్బాయి పోయినప్పటి నుంచీ పనికి వెళ్ళడమే మానేశారు. అసలింట్లోంచి బయటకు వెళ్ళడమే లేదు...." అని ఆమె చెప్పి కంట తడిపెట్టారు. "తప్పక చెబుతా చెల్లాయ్" అంటూ రచయిత కాళ్ళు చేతులూ కడుక్కుని ముందర గదికొచ్చి ఆయనతో మాటలు కలిపారు. బాధలో ఉన్న వారితో మాట్లాడటం అంత సులభం కాదు. చాలా చాలా కష్టం. మాట్లాడే ప్రతి మాట జాగర్తగా ఉండాలి. ఒక్క మాట అటూ ఇటూ అయిన బాధను మరింత ఎక్కువ చేస్తుందే తప్ప ఓదార్చదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మాట మొదలుపెట్టారు. "అయ్యా! మీరు ఏం పని చేసేవారు" అని రచయిత ప్రశ్న. "వంట పని" అన్నారా బాధిత తండ్రి అంటూ ఆయన చెప్పసాగారు. "మాది పేద కుటుంబం కావచ్చు. కానీ వంట చేయడంలో నాది పెద్ద చెయ్యి. చుట్టుపక్కల ఎవరింట్లో ఏ కార్యక్రమమైనా నన్నే పిలుస్తారు వంటకు. నాకు అయిదుగురు సహాయకులు ఉన్నారు. అందరం కలిసే వెళ్తాం వంటపనికి. అయిదుగురూ కాయగూరలు తరిగి, పొయ్యి అంటించి అన్నం వండటం, కూరలు చేయడం, సాంబారూ పప్పూ ఇలా అన్నీ సిద్ధం చేస్తారు. కానీ చివరగా కూరలోనో పులుసులోనో పప్పులోనో పచ్చడిలోనో ఉప్పు పోసి కలిపే పని నాదేనండి. ఉప్పు ఎక్కువైతే వంటంతా చెడుతుంది. తక్కువైతే రుచీపచీ లేదని మాట పడాలి. కానీ నేనెప్పుడూ ఉప్పు తక్కువో ఎక్కువో వేసింది లేదు. క్వాంటిటీని బట్టి ఉప్పు కలపడంలో నేనెప్పుడూ తప్పు చేయలేదు. దాంతో నా వంటను వేలెత్తి చూపిన వాళ్ళు లేరు. కానీ మా అబ్బాయిని కోల్పోయిన తర్వాత ఒకటి రెండు చోట్ల వంట చెయ్యడానికి వెళ్ళానుగానీ ఉప్పు కలపడం ఎక్కువై మాటలు పడాల్సి వచ్చింది. అసలు వంట గదిలోకి వెళ్ళి అక్కడ పోయ్యి నుంచి వచ్చే మంట చూస్తున్నప్పుడల్లా మా అబ్బాయితోపాటు మిగిలిన పసిమొగ్గలూ మంటల్లో చిక్కుకుని బూడిదవడమే కళ్ళ ముందు కనిపిస్తోందండి. దాంతో వంట సరిగ్గా చెయ్యలేకపోతున్నానండి. నా వల్ల విందు చెడిపోకూడదనే కారణంగా ఎక్కడికీ వెళ్ళడం లేదండి. నాకు మరెలాంటి పనులూ తెలియవు. ఏం చెయ్యమంటారు చెప్పండి. మా ఆవిడకు ఈ విషయం చెప్పినా అర్థం చేసుకోవడం లేదండి" అని రోదించారా బాధితుడు. రచయితకు ఏం చెప్పాలో ఎలా నచ్చచెప్పాలో తెలీక మౌనం వహించారు. ఆయన మాటలు వింటుంటే రచయిత మనసు బరువెక్కింది. పుత్రశోకం కలిగించే బాధను తట్టుకోవడం చాలా కష్టం. రాముడు అడవికి వెళ్ళిపోతున్నానే బాధను దిగమింగలేక దశరథుడు ప్రాణాలు కోల్పోయాడు కదా అనుకుని బరువెక్కిన హృదయంతో కన్నీళ్ళతో ఇవతలకు వచ్చారు ఏమీ చేయలేక రచయిత కృష్ణకుమార్. నేనిక్కడ ఆయన చెప్పిన విషయాన్ని కొద్దిమేరకే రాయగలిగాను.ఆయన ప్రసంగం వింటుంటే అప్రమేయంగా నా కళ్ళు చెమ్మగిల్లాయి. - యామిజాల


కామెంట్‌లు