మా అమెరికా అనుభవాలు...: - పోణంగి బాల భాస్కర్
 కాలం ఎంత వేంగంగా గడిచిపోతోందోనని తరచుగా మనం అనుకుంటూ ఉంటాము. ఈ అనుకోవడం అనేది సమయం, సందర్భాన్ని బట్టి, ఒక్కోవ్యక్తికీ, ఒక్కోలా ఉంటుంది. 
10-03-2018 తేదీ రాత్రి అమెరికాలో ఒంటిగంటా 59 నిముషాల తర్వాత ఇంటర్నెట్ తో అనుసంధానమైన గడియారాలన్నీ ఒక్కసారిగా 2 బదులు 3 గంటలుగా మారిపోయాయి. మిగిలిన గడియారాలను మేము మార్చుకున్నాము. 
అంటే ఒక గంట సమయం ఎవరికీ తెలియకుండా గడిచిపోయింది. ఇలా ప్రతి ఏడాదీ మార్చి నెలలో రెండో ఆదివారం తెల్లవారు జామున 2 గంటలకు ఒక గంట ముందుకీ, నవంబర్ నెలలో మొదటి ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు ఒక గంట వెనక్కీ గడియారంలోని సమయాన్ని సవరిస్తూ ఉంటారు. 
దీన్నే "DAY LIGHT SAVING" అంటారు. 
 107 సంవత్సరాల క్రితం 1918 మార్చి 19వ తేదీన ఈ పద్దతిని పాటించడం మొదలు పెట్టారు. దీని మంచి చెడులపై అనేక చర్చలు జరిపిన అనంతరం 1966 లో ఆమోదించిన "UNIFORM TIME ACT" అనే చట్టం కింద దీన్ని క్రమం తప్పకుండా పాటిస్తున్నారు. దీనివల్ల విద్యుత్తు ఆదా అవుతుందనీ, రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఉద్దేశ్యంతో అమెరికాలో రవాణా శాఖ (DOT) దీన్ని అమలు చేస్తోంది. 
అసలు అమెరికాలో నాలుగు "Time Zone" లు ఉంటాయి. దీనితో సంబంధం లేకుండా ఈ సవరణ జరుగుతుందని తెలిసింది. (Arizona, Hawaii రాష్ట్రాలు మాత్రం దీన్ని పాటించడం లేదు). 
కన్యాకుమారి నుండి కాశ్మీరు దాకా ఒకే సమయాన్ని పాటించే భారతీయులకు ఇది కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 
అంతెందుకు 2017 డిసెంబరు 6వ తేదీ ఉదయం 4 గంటలకు హైద్రాబాదులో బయలు దేరి, రెండు చోట్ల దిగి, మూడు విమానాల్లో దాదాపు 25 గంటలు ప్రయాణం చేసి అదే రోజు సాయంత్రం 6.30 గంటలకు అమెరికా చేరుకున్నాము. అంటే అది మా జీవితంలో Long Day. ఆరోజు మాకు దాదాపు 10.30 గంటలు మాకు ఆదా అయ్యింది. 
చాలా మందికి ఇది మామూలు విషయంలా కనిపించవచ్చు.  కానీ, నాకు ఇది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అందుకే మీతో పంచుకుంటున్నాను.
🌸🌷🌸


కామెంట్‌లు