బాలభారతి నా మూడో సోపానం ----బాలభారతి....పిల్లల మాసపత్రిక. యజమాని వి.వి. నరసింహారావుగారు. నెంబర్ 6 పద్మనాభ పిళ్ళై వీధిలో ఉండేది ఆఫీసు. వారి ఇల్లు కూడా అదే. ఇక్కడ నేను రెండు సార్లు ఉద్యోగం చేశాను. మొదటి సారి ఫుల్ టైమ్ జాబ్. నూటపాతిక జీతం. రెండోసారి పార్ట్ టైమ్. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు గంటలవరకు. నూటయాభై జీతం. దసరా వేళ అర మాసం బోనస్ కూడా ఇచ్చేవారు. నా ఉద్యోగం పర్వంలో "బాలభారతి" మూడో సోపానం. అంతకుముందు మిలియన్ జోక్స్, బాలానందం మాస పత్రికల్లో పని చేశాను. బాలానందంలో వంద రూపాయలు ఇచ్చేవారు.బాలభారతి ఆఫీసుకి రెండిళ్ళవతలే బాలానందం ఆఫీస్ ఉండేది. బాలభారతి మాసపత్రికతోపాటు డిటెక్టివ్ నవలలు, జానపద నవలలు, పాకెట్ బుక్స్ వేసేవారు. నేను బాలభారతికి సర్క్యులేషన్ మేనేజరుని. డిటెక్టివ్, జానపద నవలల సర్క్యులేషన్ విభాగాన్ని శ్రీదేవి (హాస్యనటుడు పద్మనాభం కూతురు), కృష్ణకుమారి (తర్వాతి కాలంలో ఘంటసాల రత్నకుమారుని పెళ్ళి చేసుకున్నారు) చూసేవారు. బాలభారతికి నేను పని చేస్తున్న రోజుల్లో ముగ్గురు ఎడిటర్లు మారారు. మొదటి ఎడిటర్ శశిభూషణ్. ఈయనది స్వస్థలం కాళహస్తి దగ్గర పల్లెటూరు. బాలభారతి కథల ఎంపిక, ఎడిట్ చేయడంతో పాటు డిటెక్టివ్ నవలలుకూడా రాసేవారు. కొన్ని కారణాలతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అనంతరం జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ( విజయవాడ, సినీగేయ రచయిత ) బాలభారతికి ఎడిటర్. ఆ తర్వాత ముంగర కోటేశ్వరరావు (తెనాలి) సంపాదకుడయ్యారు. ఈ ముగ్గురితోనూ మంచి సాన్నిహిత్యమే ఉండేది. డిటెక్టివ్, జానపద నవలల రచనలు ఇవ్వడానికి కృష్ణమోహన్, శ్రీసాయిశ్రీ, ఎంఆర్ఎన్ ప్రసాదరావు, నారాయణ రెడ్డి (ఈయన కలం పేరు కిరణ్ కుమారి) తరచూ బాలభారతి ఆఫీసుకి రావడంతో వీరితోనూ చనువుండేది. నారాయణ రెడ్డి బాలభారతిలో జానపద కథల సీరియల్స్ రాసేవారు కిరణ్ కుమారి పేరుతో. నారాయణ రెడ్డిగారు తలచుకుంటే ఓ నవల పుట్టేసేది. చాలా ఫాస్టుగా రాసిచ్చేవారు ఎలాంటినవలైనా. అలాగే బాలభారతిలో ఒకప్పుడు హస్తసాముద్రిక రచన వేస్తుండేవారు. దీనిని వీరభద్రరావు గారు రాసేవారు. ఇక బొమ్మల విషయానికొస్తే జయ ( చందమామ ఆర్టిస్ట్), బాషా, దేవీ ప్రసాద్ (ఇప్పుడు గుంటూరులో ఉంటున్నారు), మురళీ, వీరా తదితరులు వేసేవారు. వీరిలో నేనున్న రోజుల్లో ఎక్కువ బొమ్మలు వేసినతను మురళి. ఇతని స్ట్రోక్స్ బాగా నచ్చేవి. ఇతనితో నేనొకమారు బొమ్మ గీయించుకున్నాను. నేను గోద్రేజ్ వారి సోప్స్ డివిజన్లో పని చేస్తున్న రోజుల్లో నా సహ ఉద్యోగులు కొందరు ఓ టూర్ కి వెళ్ళొచ్చారు. ఆ పర్యటనలో అనూరాధ అనే అమ్మాయి మదురైలో ఓ తల భాగం లేని ఓ స్త్రీ విగ్రహంపై తన తల ఉంచుకుని నిల్చుండగా పామర్తి హేమంత్ కుమార్ ఫోటో తీశారు. అనూరాధ ఈ ఫోటో చూపించడంతోనే అది తీసుకెళ్ళి ఈ విధంగా ఓ బొమ్మ గీసివ్వమని మురళిని కోరితే వేసిచ్చారు. ఆ బొమ్మ చుట్టూ ఓ పెద్ద కవిత రాసి ఫ్రేమ్ కట్టించి అనూరాధకు చూపించాను. ఆ అమ్మాయి మాతృభాష తమిళం. కనుక నేను రాసిన తెలుగు కవితను చదివి తమిళంలో అర్థం చెప్తే తన మాతృభాషలో రాసివ్వమంది. సరేనని ఆ కవితను తమిళంలో కార్తిక్ అనే మిత్రుడితో రాయించాను. చిత్రకారులు గీసిచ్చిన బొమ్మలను యజమాని నరసింహారావుగారు క్షుణ్ణంగా పరిశీలించే వారు. ఏమాత్రం నచ్చకున్నా మార్చి ఇవ్వమని సూచనలు చేసేవారు.మ్యాగజైన్ తోపాటు ఇతర పుస్తకాల డెస్పాచ్ పనులన్నీ నరసింహారావుగారి తమ్ముడు వి. పూర్ణచంద్రరావు చూసుకునే వారు. ఆయనకు సహాయకుడిగా నేను పోస్టాఫీసుకీ రైల్వే స్టేషన్ లకీ వెళ్ళొచ్చేవాడిని.ఆ రోజుల్లో బాలభారతి సంచిక దాదాపు ఇరవై అయిదు వేల కాపీల దాకా సర్క్యులేషన్ ఉండేది. ఈ సంస్థ విడుదల చేసిన డిటెక్టివ్, జానపద నవలలను కొద్దో గొప్పో పరిచయమున్న వారికి ఇచ్చిపుచ్చుకుంటూ సాన్నిహిత్యం పెంచుకునే వాడిని. నరసింహారావుగారు "కాలం" చేసిన తర్వాత ఆయన కుమారులిద్దరూ (శ్రీహరి, ప్రేమ్ కుమార్) పట్టుగా బాలభారతిని ఇప్పటికీ నడిపించడం విశేషం.బాలభారతిలో చేసిన పని రోజులు ఎప్పటికీ మరచిపోలేను.- యామిజాల జగదీశ్


కామెంట్‌లు