మానేరు ముచ్చట్లు--ప్రస్తుతం మనం వేములవాడ చాళుక్యుల ముచ్చట్లలో ఉన్నాం. భద్రగుడు భదరంగుడవునో కాదో వదిలేసి, సుమతీ శతకకారుడు మాత్రం ఈ బద్దెన నే అనే మాటను బలపరచాలిసిన అవసరం ఉన్నది. పోతన ఇక్కడి వాడు కాదంటరు. కవి జనాశ్రయం రాసింది రేచనకాదు వేములవాడ భీమన అంటరు. ఆ భీమన కూడా ఇక్కడి వాడు కాదు ద్రాక్షారామం వాడంటరు. ఇవన్నీ సాహిత్యంలో కుస్తీ పోటీలవంటివి. కానీ సత్యమేవ జయతే అన్నట్టు అవన్నీ చక్కగా నిరూపించ బడ్డా యి. అలాగే సుమతీ శతక కర్త బద్దెన లేదా బద్దెభూపాలుడు అని అంటూనే అతనిది పదమూడవ శతాబ్దమని అనటంలో ఔచిత్యము లోపిస్తున్నది. ఈ పద్యము చూడండి దగ్గఱ కొండెము సెప్పెడు ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుడై నెగ్గు ప్రజ కాచరించుట బొగ్గులకై కల్పతరువు పొడుచుట సుమతీ నీతిపారగుడైన రాజుమాత్రమే ఇలాంటి పద్యం రాయగలుగుతాడు. దానికితోడు అప్పటి కాలపు పదమే ప్రెగ్గడ. దానికి తోడు నీతిశాస్త్ర ముక్తా వళి రాసియున్నాడు కావున దానిలో చెప్పని విషయాలు దీని ద్వారా పూరించాడని చెప్పవచ్చు. ప్రముఖ చారిత్రక పరిశోధకులు, సాహితీవేత్త డా.సంగన భట్ల నర్సయ్యగారు కందానికి పుట్టినిల్లు కరీంనగరం అని వ్యాసం రాస్తూ ఈ విషయాన్ని ఉట్టంకించారు.కరీంనగర్ కు చెందిన గండ్ర లక్ష్మణరావు వంటి సాహితీవేత్తలు ఈ విషయాన్ని నొక్కి చెబుతున్నారు. కనుక సుమతీ శతకకారుడు ఈ బద్దెనయేనని అందరూ ఆమోదిస్తే సంతోషం. ఇక వీరికి (చాళుక్యులకు) సంబంధించిన విషయం మరొకటి ఉన్నది.అది రెండవ అరికేసరి వేయించిన శాసనం. ప్రస్తుతం అది కరీంనగర్ ప్రయాణ ప్రాం గణం ఎదురుగా ఉన్న పురావస్తు ప్రదర్శన శాలలో ఉంది.అది కన్నడ శాసనం. దాని గురించి బి.ఎన్.శాస్త్రి గారు తమ వేములవాడ శాసనాలు అనే పుస్తకంలోతెలుగులోకి అనువదించి రాశారు.అలాగే రమణయ్యగారు కూడా ఆ శాసన విషయాన్ని రాసారు. కాని అందులో ఉన్న “అరిపనపల్లి” గురించి విశ్లేషించ లేదు. విషయమేమిటంటే,”వేములవాడ పాలకుడగు రెండవ అరికేసరి శకసంవత్సరము 869 పరాభవ నామ సంవత్సర కార్తీక బహుళ సోమవారమ నాడు నూతలపాడు గ్రామానికి చెందిన వాడు,కౌశిక గోత్రానికి చెందిన విష్ణుభట్టు మనుమడు,అప్పనయ్య కుమారుడు, ధారపయ్యకు అరిపనపళ్లియ గ్రామములో యాభైమర్తుర్ల నీరు నేలను దానము చేసెను “అని శాసనములలోని ముఖ్య విషయము. మిగతాదంతా అరికేసరి బిరుదులు మొదలైనవి ఉన్నాయి. అవన్నీ అతని గురించిన వివరాలు తెలుసుకోవడానికి తోడ్పడతాయి. కాని ఈ “అరిపనపల్లి” ఎక్కడ ఉంది? అది ఒకప్పటి పాత కరీంనగరం అరిపిరాలనే అయ్యుండవచ్చు అని ఎవరూ నిర్ధారించక పోవటం.అది కరీంనగర్ మ్యూజియంలో ఉంది అని మాత్రమే పరబ్రహ్మశాస్రి గారు రాసారు.అది ఎక్కడనుండి ఇక్కడికి తరలించ బడింది,ఎప్పుడు తరలించబడింది అనే విషయం వివరించలేదు. అవును,అసలు విషయం మీకు చెప్పలేదుకదా!ఇప్పుడున్న కరీంన గరం.వంద పదిహేను సంవత్సరాల క్రితం ఒక కుగ్రామం.మానేరుకు సమీపంలో పాత మానకొండూరు త్రోవకు ఇప్పుడు పాతబజారులో శివాలయం ముందువైపు కాపువాడ ప్రాంతంలో ఉండేది.దాని పేరు “అరిపిరాల”. ఈ విషయాన్ని విశ్వనాథగారు తమ మ్రోయు తుమ్మెద నవల రాయటమే గాక అప్పటి స్థితి గతులను కూడా చక్కగా వర్ణించారు. మనకు ముందు చరిత్రలో ఈ విషయం మళ్లీ చెప్పుకోవలసిఉన్నా ఇప్పుడు కొంత చెప్పక తప్పదు.1904 వరకు ఎలగందుల జిల్లా కేంద్రంగా ఉండి చివరి ఖిలేదారు కరీమొద్దీన్ తనపేరు మీద కరీంనగర్ గా మార్చిన అరిపిరాల జిల్లా కేంద్రమయింది.సరే అలా చాలా ఊర్ల పేర్లు మారాయి. అప్పట్లో అది వేరేసంగతి.కానీ అరికే సరి కాలం నాటి అరిపనపల్లెనే అరి పిరాల అయ్యుంటుంది గదా! ఆ విషయం ఎందుకు ప్రస్తావనకు రాలేదు. సంగనభట్ల నర్సయ్యగారు ఈ విషయం ప్రతిపాదించానని అన్నారు.నాకు కూడా అరిపనపల్లెనే అరిపిరాల అయిఉంటుందని దాన్ని కూడా నిర్ధారిస్తే బాగుంటుందని అనిపించిందిమనం వేములవాళక్యుల నుండి కొంచెం దూరం వెళ్లవలసి వచ్చింది. కాని తప్పదు. మన చరిత్రను వాస్తవమైన పునాదుల మీద పునర్నిర్మించుకోవల సిన అవసరం చాలా ఉన్నది.నాకు అన్నిటి కంటే సంతోషం మిత్రులందరూ ప్రోత్సహించటమే కాదు వివరాలకు సహకరిస్తున్నారు.ప్రొద్దున ఈ విషయాల్లో అనుభవజ్ఞులైన ప్రముఖ కవి,విమర్శ కులు యం.నారాయణ శర్మ గారు వేములవాడ శాసనాలకు సంబంధిం చిన పిడిఎఫ్ పంపిం చారు.అలాగే సంగనభట్ల నర్సయ్య గారి ప్రోత్సాహమే కాదు ప్రోద్బలము కూడా ఉంది.అలాగే డా.గండ్ర లక్ష్మన్ రావు సారు ప్రతిస్పందన లు,సలహా లు సూచనలు నాకు కొత్త శక్తిని ప్రసాదిస్తున్నాయి వారికి నా కృతజ్ఞతలు.బద్దెగుని తరువాత కొన్నాళ్లు మూడవ అరికేసరి పరిపాలించినా కొన్ని రాజకీయపరిణామాలతో వేములవాడ చాళుక్యుల శకం క్రీస్తు శకం 973 తో అంతమయింది.అది వివరించాలంటే మనం కాకతీయుల గురించి రాష్ట్ర కూటుల గురించి ముచ్చటించుకోవాలి. అలాగే కరీంనగర్ ప్రక్కనే ఉన్న నగరూరు (నగునూరు) గురించి,పొలవాస రాజుల గురించి ముచ్చటించుకోవాలి.-రామ్మోహన్ రావు తుమ్మూరి


కామెంట్‌లు