చలం ఓ చిరు జ్ఞాపకం -- చలంగారు భౌతికంగా మన మధ్య కనిపించకుండా పోయి ఇది నలబై ఒకటో సంవత్సరం (చలంగారు పోయిన తేదీ 1979 మే 4). అయితేనేం, తిరువణ్ణామలైలోని శ్రీ రమణస్థాన్ లో ఆయన ఇంట ఉన్న రోజులు, అందరం కలిసి షికార్లు చేయడం, ఆయన ఇంట అన్న హీరాతో పాటు మరో నెమలిని చూసి ఆశ్చర్యపోయిన నా చిన్నతనం, నాకు పుట్టు వెంట్రుకలు వారింటే వారి మూడో కూతురు పకపక సహకారంతో తీయించినట్లు అమ్మా నాన్నలు చెప్పడం, వారింటి భోజనాలు, బోస్ కాంపౌండ్ నుండి పూల పరిమళం, ఈ కాంపౌండ్ పక్కనే ఉన్న గెస్ట్ హౌస్ లో రాత్రుళ్ళు పడుకోవడం, ఉదయమే స్నానాదికాలు కానిచ్చుకుని మళ్ళీ చలంగారి నివాసంలోకి వచ్చేయడం, షౌగారు, నర్తకి, చిత్రగారు, కృష్ణారావుగారు, కాకా, కిట్టూ, బొజ్జీ, కనకమ్మగారు, ఉమ ఇలా ఎందరెందరితోనో ఉల్లాసంగా గడపడం, మట్ట మందు, నీలంసీసాలోని నీరు ఔషధంగా సేవించడం, చలంగారింటికి దగ్గర్లోనే రోడ్డుకు అవతల ఉన్న రమణాశ్రమం, రమణస్థాన్ ఇంటికి ఎదురుగా ఉన్న కొండ ఎక్కడం, ఆ కొండమీది స్కంధాశ్రమం చూడటం ఇవన్నీ మరచిపోయేవేనా.... చలంగారి కథలకన్నా నవలలకన్నా నాకు ఆయన రచనల్లో ఇష్టమైనవి ప్రేమలేఖలు, రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలకు అనువాదాలు, భగవద్గీతకు వ్యాఖ్యానం, మ్యూజింగ్స్, ఆయన లేఖా సాహిత్యం, సుధ, కవిగా చలం, యశోదాగీతాలు. ఇవన్నీ ఒకటి కన్నా ఎక్కువసార్లే చదివాను. పురారవ నాటికలో అయితే ప్రతీ మాటా నాకు ప్రియమే.శివంగారికి రాసిన ఓ ఉత్తరంలో చలంగారిలా అంటారు... రేరాణి వాళ్ళు నన్ను ఆశ్రమవాసం అని వ్యాసం రాయమన్నారు. ఇదంతా రాద్దామా అన్నంత టెంప్టేషన్ గా వుంది. కాని పాపం, నా భగవాన్... ఆయన కూడా ఇరుకుతారు అన్యాయంగా. పోనీ రాస్తానని ఆశ్రమం వాళ్ళని బ్లాక్ మెయిల్ చెయ్యనా...వాళ్ళకే భయం లేదు. బాహాటంగా ద్రోహం, అబద్ధం, మోసం, చూపుకుంటో తిరుగుతారు. భగవాన్ రక్షిస్తారు వాళ్ళని. జాలిగావును. వాళ్ళకి కావలసింది దమ్మిడీలు. ఎట్లాగో వోలాగు. అవే కటాక్షిస్తారు వాళ్ళకి. పైగా ఎవరిని పలకరించినా నువ్వు లేవు, మేము లేము లోకం లేదు అన్నట్లు మొహం పెడతారు. దమ్మిడీని చప్పుడు చేశామా చప్పున తలెత్తి చూస్తారు. థియోసాఫికల్ సొసైటీలో మల్లెనే ఇక్కడ మనుషులకి ఒక పోజు వుంది. అది కావలసి తెచ్చుకున్నది. ఈ అట్ మాస్ ఫేర్ లోనే వున్నట్టుంది.చలంగారికి వందనం. అభివందనం.- యామిజాల జగదీశ్


కామెంట్‌లు