మానేరు ముచ్చట్లు-రామ్మోహన్ రావు తుమ్మూరి -తొలిసారిగా హైదరాబాదు రాష్ట్రం ప్రజాస్వామ్య పరిపాలనకు నోచుకోవడమే గాక సమర్థుడైన ముఖ్యమంత్రిగా డా.బూర్గుల రామకృష్ణారావు ఎంపిక కావడం ముదావహం.ఈయన మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రులుగా దిగంబర్ రావు బిందూ,కొండా వెంకట రంగారెడ్డి,డా.జి.ఎన్.మెల్కోటే,డా.మఱ్ఱి చెన్నారెడ్డి,వినాయకరావు విద్యాలంకార్,నవాబు మెహదీ నవాజ్ జంగ్ గోపాలరావు ఎగ్బోటి ఉన్నారు.ఉప మంత్రులుగా శ్రీనివాసరావు అఖిలేకర్,పల్లెర్ల హనుమంతరావు,ఎం.ఎస్.రాజలింగం,అరిగే రామస్వామి,విరూపాక్షప్ప,భగవంతరావు గాథె,శ్రీమతి సంగమం లక్ష్మీ బాయి ఉన్నారు.ఎన్నో సమస్యలకు ఆలవాలమైన ఆనాటి హైదరాబాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మాటలు కాదు.కాని బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహితీ వేత్త ,బహు భాషాకోవిదుడు,న్యాయశాస్త్ర పారంగతుడు,పరిపాలనా దక్షుడ ఐన బూర్గుల రామకృష్ణారావు పరిపాలనా విధానం శత్రువర్గం వారు కూడా అభినందించేదిగా సాగింది. మహబూబ్ నగర్ జిల్లా,కల్వకుర్తి తాలూకా,వడకల్లు గ్రామంలో మాతామహుల గృహంలో తేదీ 13-3-1899 న నరసింగరావు, రంగనాయకమ్మలకు జన్మించారు రామకృష్ణారావు.నియోగి బ్రాహ్మణ వంశీయులైన నరసింగరావు బూర్గుల మరికొన్ని గ్రామాలకు మక్తేదారు,దేశ్ పాండ్యా.రామకృష్ణారావు పూర్వీకులంతా గొప్ప పండితులు.సంస్కృతాంధ్ర పార్సీ భాషల్లో నిష్ణాతులు.బూర్గుల వారు హైదరాబాద్,బొంబాయి,పూనా నగరాలలో చదువుకున ఎల్.ఎల్.బి.పట్టాపొందారు.హైదరాబాదు బేగంబజారు అబ్దుల్లా రిసాలాలో ఆఫీసు పెట్టుకుని హైకోర్టులో ప్రాక్టీసు చేసి సమర్థుడైన న్యాయవాదిగా పేరు పొందారు.ఆ తరువాత తెలంగాణా జాతీయోద్యమంలో పాల్గొని అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి ఐన రామకృష్ణారావు గారు సాహితీ వేత్తగా కూడా మంచి పేరు సంపాదించారు.ఈయన జీవన యాత్రలో గ్రంథ పఠనం, సాహిత్యాధ్యయనం, రచనా వ్యాసంగం నిత్యకృత్యాలలో భాగాలుగ ఉండేవి.తెలుగు,ఉర్దూ,హిందీ,సంస్కృత భాషలలో రచనలు చేశారు.వీరి కంద పద్య కృష్ణశతకము1956 లో ప్రచురితమైంది.సంస్కృతంలో రచించిన వేంకటేశ్వర సుప్రభాతం 1958లో ప్రచురితమైంది.అలాగే శృంగగిరి శారదాస్తుతి,గౌరీస్తుతి,వాణీస్తుతి,లక్ష్మీ స్తుతి,కృష్ణాష్టకం వీరి ఇతర స్వీయ రచనలు. ఇక అనువాదాల విషయానికి వస్తే ఉమర్ ఖాయం రుబాయీలను పార్శీ నుండి తెలుగులోనికి అనువదించారు.వీరి అనువాదం మూలానికి బాగా దగ్గరగా ఉండి ఎంతో వైశిష్ట్యం కలిగి ఉందని విమర్శకుల అభిప్రాయం.అలాగే వీరు తెలుగు పద్యాలలోఅనువదించిన సూఫీ సర్మద్ రుబాయీలు చాలా కాలం క్రితం కృష్ణా పత్రికలో ప్రచురించబడ్డాయి. జగన్నాథ పండితరాయల సంస్కృత లారీ పంచకాన్ని తెలుగులోనికిలక్ష్మీలహరి,కరుణలహరి,సుధాలహరి,అమృతలహరి,పీయూషలహరి పేర్లతో పద్యానువాదం చేసినవార వీరొక్కరే నట.శంకరాచార్యుల సౌందర్య లహరిని కూడా తెలుగు పద్యాలలోనికి అనువదించిన బూర్గుల రామకృష్ణారావు గేయాలు,చాటు పద్యాలు,కథానికలు,ప్రహసనాలు, నాటికలు రచించినారంటే వారి సాహిత్య పిపాస ఎంతటిదో చూడండి. వీరు రచించిన పరిశోధనాత్మక వ్యాసాలలో కొన్నిటిని ‘సారస్వత ముక్తావళి’పేరుతో వెలువరించారు.అందులో ఔరంగజేబు కుమార్తె జేబున్నిసా జీవిత కథ ఆధారంగా రాసిన వ్యాసం ఎంతో ఆసక్తికరంగా ఉంటుందట.వీరి వ్యాసాలు అప్పట్లో పలుపత్రికల్లో ప్రచురితమయ్యేవి.ముఖ్యమంత్రి పదవి అనంతరం వీరు కేరళ ,ఉత్తర ప్రదేశ్ ల గవర్నర్ గా కూడా పనిచేశారు.కేరళలో పనిచేసేటప్పుడు వీరి ప్రసంగాలను‘Random Reflections ‘పేరిట ప్రచురించటం జరిగింది.మహాకవి దాశరథి గాలిబ్ గీతాలకు వీరు రాసిన పీఠిక ఉర్దూ కవిత్వంలో గజల్ ప్రక్రియ గురించి తెలుసుకోదలచిన వారికి ఎంతో ఉపయోగపడుతుందని డా.యం.యల్ నరసింహారావుగారు వారు రాసిన బూర్గుల రామకృష్ణారావు సంక్షిప్త జీవిత చరిత్రలో పేర్కొన్నారు.ఆంధ్ర విశ్వ విద్యాలయం ‘డాక్టర్ ఆఫ్ లిటరేచర్ ‘,ఉస్మానియా విశ్వ విద్యాలయం ‘డాక్టర్ ఆఫ్ లాస్’గౌరవ పట్టాలిచ్చి వీరిని సత్కరించటం జరిగింది. “రెండు వందల యేడుల నుండి చిమ్మ చీకటుల మ్రగ్గి,వెలుతురు రేక గనని మాకు ప్రథమ ప్రజా ముఖ్య మంత్రి వీవు కీర్తనీయ,బూర్గుల రామ కృష్ణ రాయ “అని దాశరథి వీరిని ప్రస్తుతించారు. దేశభక్తుడు,మహా మేధావి,తెలంగాణా జాతీయోద్యమ నాయకుడు,నవ్యాంధ్ర నిర్మాత,సౌజన్య సాహితీమూర్తి యైన రామకృష్ణారావు గారు 1967లో బర్కత్ పురాలోని వారి స్వగృహంలోస్వర్గస్తులైనారు.చిరస్మరణీయులైన వారిని ఈ సందర్భంగా మీకు పరిచయం చేయాలనిపించింది.(సశేషం)
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి