మన తెలుగు సాహిత్యంలో పూర్వ కవులు: - పదమూడవ శతాబ్దమునకు చెందిన కొందరు తెలుగు కవుల గురించి తెలుసు కొందాము .ఈ కాలములో ప్రసిద్ధి చెందిన కవి ఎర్రన్న.ఈకాలంలో నే మరి కొందరుమహా కవులు ఉన్నారు. వారిలో చిమ్మ పూడి అమరేశ్వరుడు ఒకరు. ఈయన అనేక తెలుగు కావ్యాలు రచించి ఆనాటి పండితుల మెప్పు పొందాడు ఈయన గ్రంథాలు నేడు లభించుట లేదు ఇప్పుడు మరో కవి గురించి తెలుసుకుందాం. ఈతడే విన్నకోట పెద్దన. ఈయన కావ్యాలంకార చూడామణి అను లక్షణ గ్రంథం రచించెనందురు. ఈ గ్రంథాన్ని చాళుక్య రాజయిన విశ్వేశ్వర రాజునకు అంకితమిచ్చాడు.ఇందు సాహిత్య విషయాలతో పాటు వ్యాకరణ విషయాలు కూడా ఉన్నాయి.ఈతడు క్రృతిపతికి అంకితం ఇచ్చే సందర్భమున రచించిన పద్యములు చాలా రసవత్తరంగా ఉన్నవని పండితులు చెబుతారు.."గొప్ప రచనా దురంధరుడు" అని ప్రసిద్ధికెక్కిన మరో తెలుగు కవి గూర్చి తెలుసుకుందాం. అతడే వేములవాడ భీమకవి. ఈతడు 13 వ శతాబ్దమునకు చెందిన వాడే, ఈయన కవి జనాశ్రయమను గ్రంధము రచించెనినని చెప్పుకుంటారు.ఈ భీమకవి రాఘవ పాండవీయం, నరసింహ పురాణం, రామాయణం వంటి అనేక గ్రంథాలు వ్రాసెనని చెప్పుకుంటారు.కానీ ఈ గ్రంథములేవీ లభించుట లేదు.కొన్ని మాత్రమే లభించుచున్నవి.వానిలోముఖ్యంగా ఈతని చాటువులు ప్రస్తుతం లభించుచున్నవి. వీటివలన ఈయన గొప్ప కవి అని చెప్పగలుగుతున్నాం.కొందరు ఈయన గోదావరి మండలమునందలి దాక్షారామ మనకు చెందినవాడని, మరికొందరు తెలంగాణా లోని కరీంనగర్ మండలమునందలి వేములవాడకు చెందిన వాడని చెప్పుకుంటారు. ఎర్రన యుగములో ఈయన సరితూగగల మరో కవి,నాచన సోమనాథుడు.ఈయన హరివంశం నందలి ఉత్తర భాగమును రచించాడు. దీనినే ఉత్తర హరివంశము అని అంటారు. ఈ గ్రంథాన్ని హరిహరనాధునికి అంకితం ఇచ్చాడు.ఈ కవి పూర్వ భాగ హరివంశమును రాసెనో లేదో తెలియదు. హరవిలాసము కూడా రచించిని చెప్పుదురు కానీ ప్రస్తుతం అదే లభించుట లేదు. ఉత్తర హరివంశము నందు 6 ఆశ్వాసము లు గలవుఈ ప్రబంధము నందలి రసవత్తరమైన భాగములను మాత్రమే గ్రహించి కొన్ని మార్పులు చేర్పులతో స్వతంత్రంగా రచించిన మహా కవి. ఈయన ఎర్రన రచించిన హంసడిభకోపాఖ్యానము వ్రాసి విపులముగా వర్ణించిన ఘనుడు. రసపోషణమునందు మిక్కిలి నేర్పరి. ఈతనికి సర్వజ్ఞ, సకల భాషా భూషణ, సాహిత్య రసపోషణ, సంవిధాన చక్రవర్తి, నవీన గుణ సనాథ అను బిరుదుములు ఉన్నవి.ఈయన శైలి శబ్దాలంకార భూయిష్టమైన దీర్ఘ సమాస బంధురమై ఓజో గుణమునకు ఆదర్శముగా ఉండును. ఈయన వాడు లోకోక్తులు సామెతలు మిక్కిలి మనోహరముగా నుండును. ఇతని ధారాశుద్ధి గొప్పది. ఈ మహాకవి గురించి ఎంత చెప్పినను తక్కువే యగును.ఎర్రన కాలములో చెప్పుకోదగిన మరో మహాకవి,రావిపాటి త్రిపురాంతకుడు. ఈయన "ప్రేమాభిరామం"- అను సంస్కృత వీధి నాటకం రచించినట్లు తెలియజేయుచున్నది.తెలుగున అంబిక శతకము చంద్ర తారావళి, మదన విజయము, త్రిపురాంతకోదాహరణము అను గ్రంథములను రచించాడు. శ్రీనాధుని క్రీడాభిరామము నకు మూలము ఇతని ప్రేమాభిరామమే, ఈయన శివ భక్తి పరాయణుడు. - బెహరా ఉమా మహేశ్వర రావు
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి