శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములో దిగ్గజముల వంటి ఎనమండుగురు కవులున్నారని మనకు తెలుసు. వారే అష్టదిగ్గజములు. వారిలో అల్లసాని పెద్దన అతి ముఖ్యుడు.ఈ మహాకవి బళ్లారి ప్రాంతము నందు గల దూపాడు పరిగణాల్లోని దొరాల గ్రామం ఇతని జన్మస్థలం. ఈ దోరాల గ్రామమే నేడు దోర్నాల అని పిలువ బడుతుంది. ఈయన చొక్కనామాత్యుని పుత్రుడుశ్రీకృష్ణదేవరాయల ఆస్థానములోనున్న ఈ కవి, అప్పటి కవులలో వయస్సు చేతను పాండిత్యము చేతను మొదటి వాడిగా పేర్కొనదగిన వాడు. ఈయన కృష్ణరాయలు పరమపదించిన తరువాత కూడా బ్రతికి యుండే వాడని తెలియు చున్నది. అందుకు నిదర్శనంగా గా ఈ పద్య భాగం భావం వలన మనకు తెలుస్తుంది. ఆంధ్రకవితా పితామహ అల్లసాని/ పెద్దన కవీంద్ర యని నన్ను బిలుచునట్టి/ కృష్ణ రాయలతో దివి కేగ లేక/బ్రతికియుండితి జీవచ్ఛవంబ నగుచు//ఇతడు స్వారోచిష మనుసంభవము, మను చరిత్ర మరియు హరికథా సారము అను మరియొక గ్రంథమును రచించాడు కానీ ప్రస్తుతము ఈ హరికథా సారము లభించుట లేదు. పెద్దన్న తను రాసిన "మను చరిత్ర" రాయలవారికి అంకితమిచ్చాడు. రాయలవారు అల్లసాని పెద్దనను,సన్మానించిన విధము అనన్యసామాన్యమైనది. ఆ మహాకవి కాలికి గండపెండేరము స్వయంగా తొడిగెనని చెప్పెదరు.తనకు ఎదురైనచో తన మదపుటేనుగును దిగి చేయూత నొసగి ఆ ఏనుగుపై స్వయముగా నెక్కించు కొనుటయే గాక పెద్దన కవిని అనేక విధాలుగా ఆయన ఆదరించాడు. ఈ మహాకవికి "ఆంధ్ర కవితా పితామహుడు"అనే బిరుదునిచ్చి రాయలు సత్కరించాడు. తెలుగునాట భారత భాగవతముల తరువాత మనుచరిత్రకే ప్రజాదరణ హెచ్చు.ఈ కావ్యము నందు పెద్దన ప్రదర్శించిన రచనా కౌశలమును పాత్రపోషణ విధానము ముఖ్య కారణములు. అతడు "మను చరిత్ర" కథను మార్కండేయ పురాణము నుండి గ్రహించాడు. వర్ణనలు అధికంగా వ్రాసి ప్రబంధ రూప మిచ్చాడు. ఇందు మొదటి రెండు ఆశ్వాసము లందు రసమయ మైన వరూధిని ప్రవరాఖ్యుల కథ తరువాత వరూధిని గంధర్వుల శృంగారమును ఆ పిమ్మట స్వరోచి వృత్తాంతమును వర్ణించాడు. ద్వితీయాశ్వాసములో జితేంద్రియుడయిన ప్రవరుని శాంత ప్రవృత్తిని, స్వేచ్ఛ చరిత అయిన వరూధిని కామ ప్రవృత్తిని సంఘర్షణము చక్కగా వర్ణించబడింది. వరూధిని ప్రవరుడు పాత్రలను సజీవంగా వర్ణించుటలో అల్లసాని పెద్దన నేర్పు ప్రదర్శించాడు. ఈయన శైలి ప్రౌఢమై ఒప్పారు చుండును.అంతేకాదు అక్కడక్కడ జాతీయముల తోను సామెతలతోను కూడి అల్లసాని వారి అల్లిక జిగిబిగి అని ప్రసిద్ధి గాంచినది.హిమవత్పర్వతమును స్వరోచి వేటను, స్వరోచికిని రాక్షసునికి జరిగిన యుద్ధమును వర్ణించుటలో పెద్దన ప్రకృతి పరిశీలన సహజ వర్ణన పాటవమును భావనా శక్తియు వెల్లడి అవుతుంది.యుద్ధ వర్ణన సందర్భంగా పెద్దన రసానుగుణముగా శబ్దాలంకార ప్రీతిని, చంధోవైవిధ్యమును ప్రకటించాడు.మానవ హ్రుదయాలలో జరుగు భావ సంఘర్షణలను వర్ణించుటలో ఈ మహాకవి కడు దిట్ట.ఈయన కవిత్వ ప్రతిభతో "ఆంధ్ర కవితా పితామహుడు" అను బిరుదుమునకు అన్ని విధాలసరి తూగ గలడు.అల్లసాని పెద్దన పద్యాలు నేటికినీ మన తరగతి వాచకాలలో కనిపించుచున్నవి, ఈ పద్యములు తెలుగు సాహిత్యంలో ఆణిముత్యములు వంటివి:మనుచరిత్రము అల్లసాని పెద్దన హిమాలయ పర్వత వర్ణన:-అట జని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝ రీ/ పటల ముహుర్ముహు ర్లుఠధభంగ తరంగ మృదంగ నిస్వన/ స్ఫుట నటనానుకూల పురిపుల్ల కలాప కలాపి జాలమున్ / కటక చరత్కరేణుకరకంపిత సాలము శీతశైలమున్//భావం:-ప్రవరుడు మంచుకొండను చూశాడు. అది ఎలా ఉన్నదంటే మద్దెల మోతల వంటి సెలయేటి చప్పుళ్ళు విని నెమళ్లు పురివిప్పి ఆడుతున్నాయి. అంటే ఆ చప్పుళ్ళు మేఘ నిస్వనాలని అవి భ్రమ పడి నృత్యం చేయసాగాయన్నమాట.ప్రవరుడు వరూధినిని పలుకరించుట ఈ పద్యం:- ఎవ్వతె నీవు భీతహరిణేక్షణ! యొంటి జరించె దోటలే / కివ్వనభూమి భూసురుడ నే బ్రవరాఖ్యుడ ద్రోవ తప్పితిన్/ గ్రొవ్వున నిన్నగాగ్ర మమునకుం జనుదెంచి పురంబు జేర నిం/ కెవ్విధి గాంతు దెల్పగదవే తెరువెద్ది, శుభంబు నీ కగున్// భావం:- ప్రవరుడు వరూధినిని ఇలా పలుకరించాడు. భయపడిన కళ్ళు గలదానా! నువ్వు ఎవరవు?ఒంటరిగా ఎందుకున్నావ్ ? ఇక్కడ నేను ప్రవరుడను బ్రాహ్మణుడ్ని. దారి తప్పి కొండమీదికి వచ్చాను. మా ఊరు ఎలా చేరాలో తెలియదు.త్రోవ చూపి పుణ్యం కట్టుకో , నీకు శుభం కలుగుతుంది. బాలలూ! గతంలో తెలుగు వాచకం పుస్తకాల్లో ఇటువంటి పద్యాలు ఉండేవి. వాటికి పరీక్షలో మార్కులు కూడా ఉండేవి. విద్యార్థులు కంఠస్థం చేసి పరీక్షలలో చక్కగా రాసే వారు మంచి మార్కులు, తెచ్చుకునే వారు.కవి కాలాదులతో పాటు రసవత్తరమైన పద్యాలు నాడు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, అందుచేత మీరు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుగు భాష గొప్పతనం గురించి తెలుసుకోవడానికి ఆణిముత్యాల వంటి మన పద్యాలు చదవండి భవిష్యత్తుకు ఉపయోగపడే అనేక విశేషాలు ధర్మాలు మన పద్యాల్లో ఉన్నాయి అందుకే నేర్వండి! ఇదీ 28 వ భాగము) బెహరా ఉమామహేశ్వరరావు (సెల్ నెంబర్: 9290061336)
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి