అష్టదిగ్గజములలో ఒకరిగా చెప్పుకుంటున్న మహాకవి తెనాలి రామకృష్ణుడు. ఇతని మొదటి పేరు తెనాలి రామలింగడని అంటారు. ఈయన కృష్ణాజిల్లాలోని తెనాలిలో జన్మించాడని చెబుతారు. ఇతని ఇంటి పేరు ఈశ్వర ప్రగడ వారని సాహిత్యచరిత్రకారులు విశ్లేషించారు. శ్రీ కృష్ణ దేవరాయల కాలం నాటికి ఈయన బాలుడని కొందరు అంటారు. మరికొందరు రాయల గతించే నాటికి 50 సంవత్సరముల వయస్సుగల వాడిని చెబుతారు. అసలు ఈ కవి రాయల ఆస్థానంలో ఉండెనా?లేదా? అనే సందేహం నేటికినీ సాహితీ విమర్శకులలో ఉంది.ఏది ఏమైనా రాయల కాలం నాటి అష్టదిగ్గజాలలో తెనాలి రామకృష్ణుడు ఒకరని ప్రతీతి. ఈయన వ్రాసిన పాండురంగ మహత్యం అనే గ్రంథంలో చాటువులు, హాస్యోక్తులు మన తెలుగులో చాలా ప్రచారం పొందాయి. ఇతడు రచించిన గ్రంథాలు రెండు- "ఉద్భటారాధ్య చరిత్రం", "పాండురంగ మహత్యం" ముఖ్యమైనవి.ఇందులో ఉద్భటారాధ్య చరిత్ర శైవ ప్రబంధం. దీనిని రచించే నాటికి ఇతనికి తెనాలి రామలింగ కవి అని పేరు ఉండేదని అంటారు. ఈ కవి మొదట్లో శైవ మతస్తుడని అంటారు. తరువాత వైష్ణవ మతం మార్చుకుని తెనాలి రామకృష్ణుడు అయ్యాడని తెలుస్తోంది. అయినప్పటికీ ఈయనకు శైవ మతమంటే వైముఖ్యం లేదు. పాండురంగ మహత్యం భైమీ నదీతీర మందలి పుండరీక క్షేత్రము మహత్మ్యం వర్ణించు క్షేత్ర మహత్మ్యము. ఇందలి కథ స్కాంద పురాణము నుండి గ్రహింపబడినది. క్షేత్రము, తీర్థము, దైవము, అను మూడును ఉదాత్తములై ఉండు ప్రదేశం ఏది? ఈ ప్రశ్నలకు జవాబులు ఈ కథ యందు చెప్పబడినవి. ఇందలి ద్వితీయాశ్వాసము నందు పుండరీకుడను పరమ భక్తాగ్రేసరుని వృత్తాంతము అతి రమణీయంగా వర్ణించబడింది. పాండురంగ క్షేత్ర మహత్యమును సూచించు అనేక కథలు ఇందులో ఉన్నాయి. వానిలో నిగమశర్మ కథ, సుశీల కథ ముఖ్యమైనవి. వీనియందు రామకృష్ణుడు చూపిన కథా కౌశలము మిక్కిలి రమణీయంగా ఉంటుంది. పాండురంగ మహత్యము ప్రౌఢ గ్రంధము వలె దీర్ఘ సంస్కృత సమాసములతో పరిచయము లేని పదములు వాడడం చేత అక్కడక్కడ పాఠకులకు ఇబ్బంది కలిగిస్తుంది. అలాగనే రామకృష్ణుని ఈ రచన తెలుగు ప్రబంధమును పోలి ఉంటుంది. ఈ కావ్యములో చాలా సామెతలు, జాతీయములు, సందర్భానుసారంగా వాడడం జరిగింది. ఈయన రాయల కొలువులో భువన విజయం సభలందు, హాస్య కవిత్వంతో తన ప్రతిభను ప్రదర్శించే వాడని చెప్పుకుంటారు. రాయల కొలువులో రామకృష్ణ కవిని అవమానపరిచేందుకు కొందరు ప్రయత్నించగా వారికి యుక్తిగ తగిన బుద్ధి చెబుతూ తప్పించుకునే వాడని కథలు కోకొల్లలుగా వినిపిస్తాయి. తెనాలి రామకృష్ణుడు ఒక భట్టుకవి ఇచ్చిన "కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్"అను సమస్యను పూరించిన విధము. భట్టు కవి చివరి పాదం ఇవ్వగా తెనాలి రామకృష్ణుడు మొదటి మూడు పాదములను ఈ విధంగా పూరించాడు గంజాయి త్రాగి తురకల/సంజాతుల గూడి కల్లు చవి గొన్నావా?/లంజల కొడకా ఎక్కడ /కుంజర యూధంబు దోమకుత్తుక జొచ్చెన్// భావము:-గంజాయి తాగి తక్కువ జాతి వాళ్లతో కలసి కల్లు తాగి ఉన్నావా? లంజలకొడకా ఎక్కడయినా ఏనుగు దోమ గొంతులో దూరుతుందా అంటూ పూరించాడు. ఈ చివరి పాదాన్ని నేనే ఇచ్చానను కొని పూరించమని శ్రీ కృష్ణ దేవరాయలు అడిగారట, అప్పుడు పద్యం ఎత్తుగడ ఇతివృత్తం అన్నీ మారిపోయి అందమైన కంద పద్యం ఆవిష్కృతమైంది.రంజన చెడి పాండవు లరి/భంజనులై విరటు గొల్వు బాల్పడి రకటా/సంజయ! యేమని చెప్పుదు/ కుంజర యూధంబు దోమకుత్తుక జొచ్చెన్//భావం:-పాండవులంతటి వారు విరాట కొలువులో పని చేయడం, దోమ గొంతులో ఏనుగు చొరబడడం లాంటిదని రామకృష్ణుడు చక్కగా వివరించాడు... -తెనాలి రామకృష్ణ కవిని ఆధారంగా చేసుకొని అనేక హాస్య కథలు అల్లుకొని నేటికి ఉన్నాయి. అవి జానపద కథలు మాదిరిగా ఉంటాయి. ఈ కథలు వాస్తవమని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇవి కేవలం కాలక్షేపం కోసం జనం చెప్పుకునే కథలు. ఈ కథలు బాలలకు వినోదం కలిగిస్తాయి. ఇటువంటి కథలు చదవడం వల్ల బాలల్లో పఠనా శక్తి ,ఆలోచనా శక్తి కూడా పెంపొందుతుంది.ఏది ఏమైనా తెనాలి రామకృష్ణ కవి అష్టదిగ్గజములలో ఒకడిగా ప్రసిద్ధి గాంచాడు. శ్రీకృష్ణ దేవరాయలవారి ఆస్థాన కవిగా శాశ్వత కీర్తిసంపాదించిన తెలుగు కవి ఇతడు. (ఇది 34వ భాగము) - బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబర్: 9290061336


కామెంట్‌లు