శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములో ప్రసిద్ధి చెందిన కవులలో నంది తిమ్మన ఒకడు. ఇతను అష్టదిగ్గజములలోని వాడే.ఈయన నంది సింగన్న, తిమ్మాంబల ముద్దుల పుత్రుడు. ఈయన వరాహ పురాణాది గ్రంధాలను రచించి ప్రఖ్యాతి కెక్కిన మలయమారుత కవికి మేనల్లుడు. ఈతడు శివ భక్తుడు .అఘోర శివగురువు శిష్యుడు. ఈ కవిని సాధారణముగా ముక్కు తిమ్మన అని పిలుస్తారు. అందుకు కారణం తిమ్మకవి ముక్కును, ముక్కెరను వర్ణించి పద్యంగా చెప్పుటవలన ముక్కు తిమ్మన అంటారని లోకోక్తి. కవి యొక్క జన్మస్థలము గణపవరం అంటారు, కానీ విమర్శకులు అందుకు అంగీకరించరు.ఈ కవి కృష్ణదేవరాయని భార్య తన పుట్టింటి అరణపు కవిగా తెచ్చెనని చెప్తారు. కానీ అదీ పుక్కిటి పురాణమేనని పండితుల విశ్వాసం.తిమ్మన పూర్వీకులు నంది మల్లన, మేనమామ అయిన మలయమారుత కవి కృష్ణదేవరాయల తండ్రి అయిన నరసరాయల ఆస్థానమునందుండి ఇద్దరు కలిసి వరాహ పురాణమును రచించి, నరసరాజును కృతిపతిని చేశారని అంటారు. తిమ్మన కవి రాసిన "పారిజాతాపహరణము" అను గ్రంథమున ప్రథమాశ్వాసము లో కృష్ణుడు పారిజాత పుష్పం రుక్మిణికిచ్చుట వలన వచ్చిన కోపమును తీర్చుటకై సత్యభామను మ్రొక్కెననియు, మ్రొక్కగా ఆమె ఎడమకాలితో అతని తలను తన్నెననియు, అందుకాతడు అలుకమాని ముళ్ళ వంటి తన గగుర్పొడిచే తల వెంట్రుకలు సోకి కాలు నొచ్చెనని, ఆ ప్రియ భార్య అంతటితో ప్రసన్నురాలై భర్తను నిష్టురమైన మాటలు ఆడెననియు , ముద్దుల కులుకు పలుకులతో ఈ క్రింది పద్యములందు చెప్పబడినవి:- పాటలగంధి చిత్తమున బాటిలు కోపభరంబు దీర్పనె/ ప్పాటును బాటుగామి, మృదు పల్లవ కోమల తత్పదద్వయీ/ పాటల కాంతి మౌళి మణి పంక్తికివన్నియ పెట్ట నా జగ/న్నాటక సూత్రధారి యదు నందనుడర్మిలి మ్రొక్కె మ్రొక్కినన్ //భావము: సత్యభామ మహా క్రోధంగా ఉంది. ఆమె కోపాన్ని తగ్గించే మార్గము తెలియక శ్రీకృష్ణుడు ఆమె కాళ్ళకు మ్రొక్కాడట.మరో పద్యం:-జలజాతాసన వాసనాది సుర పూజా భాజనంబై తన/ రొచ్చు లతాంతయుధు కన్నతండ్రి శిర మచ్చో వామ పాదంబునన్/ దొలగం ద్రోచె లతాంగి యట్లయగు నాధుల్ నేరముల్సేయ బే/రలుకం జెందినయట్టీ కాంత లు చిత వ్యాపారముల్ నేర్తురే//. భావం:-మహా మహా ఘనులే పూజించిన ఆ శ్రీకృష్ణుని శిరస్సును సత్యభామ కోపంతో తన ఎడమ కాలితో తోసేసిందట. తన్నలేదు కానీ తోసింది. అవును కోపంతో వున్న కోమలులకు ఏది ఉచితము ఏది అనుచితమో? ఎలా తెలుస్తుంది?తిమ్మకవి దాతృత్వమును గురించి కథ ఉంది. ఈ మహాకవి "పారిజాతాపహరణము" అను గ్రంథము రాయలకు అంకితం ఇచ్చునప్పుడు, రాజు చతురంతయాన మహా అగ్రహారములను, మణి కుండలములను బహుమానంగా ఇచ్చాడు.ఆ మణి కుండలములు ధరించి తిమ్మన కవి తన వాకిట కూర్చున్నాడట. ఆ సమయమున ఒక భట్టుకవి వచ్చి అతని కవనాన్ని స్తుతించాడట‌. అప్పుడు కవి దగ్గర విలువైన వస్తువులు లేకపోవడం చేత వెంటనే తన చెవినున్న అమూల్య రత్న కుండలాలు ఆ భట్టుకవికి కానుకగా ఇచ్చాడట!ఈ విషయాన్ని రాయల సభలో అందరి ముందు తిమ్మన తనకిచ్చిన కానుకల వివరం భట్టు చెప్పాడు. అది విన్న రాయలు కవికుండలాలు తెప్పించి తిమ్మనకు ఇచ్చాడు. అలాగే భట్టు కవిని తగిన కానుకలతో సత్కరించాడు. ఒకప్పుడు 8, 9, 10 తరగతుల వాచక పుస్తకాలలో"పారిజాతాపహరణము" పద్యాలు ఉండేవి. ఆ రోజుల్లో తెలుగు పండితులు కూడా ఆ పద్యాలను రాగ భావ యుక్తంగా చదువుతూ బోధ పరిచేవారు.నంది తిమ్మన వ్రాసిన ఈ పారిజాతా పహరణమను కావ్యం తెలుగు సాహిత్యములో పేర్కొనదగినది. ఇది తెలుగు వారందరు చదవదగిన గ్రంథం.బాలలూ! మీరు కూడా పెద్ద అయిన తరువాత ఈ గ్రంథాన్ని చదివి ఆనందిస్తారు కదా!( ఇది 29 వ భాగము)-- బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబర్: 9290062336


కామెంట్‌లు