ఆధునిక సాహిత్యంలో చెప్పుకోదగిన కవి, సాంఘిక సంస్కర్త కందుకూరి వీరేశలింగం గారు. అతని బాల్యం మరియు చదువుల గురించి కొంత వింత అనిపించక తప్పదు. తండ్రిగారు పోయిన తర్వాత వీరేశలింగం తన పెదనాన్న గారి ప్రాపకంలో పెరిగాడు. పసితనం నుండి కూడా ఈయనకు బాధలు తప్పలేదు. రెండు నెలల వయసులో ఉబ్బసం వ్యాధి పట్టుకుంది. ఎన్ని మందులు వాడినా నయం కాలేదు. ఐదు నెలల పసితనంలో మసూచి వ్యాధి సోకింది, బ్రతకడమే కష్టం అనుకున్నారు. కానీ విధి బలీయం, బ్రతికి పెద్దవాడయ్యాడు. నాలుగేళ్ల చిన్నతనంలో తండ్రి మరణించాడు. అదీ పెద్ద ఆపద కదా! పెద తండ్రి వెంకటరత్నం గారి ఇంటికి మకాం మార్చవలసి వచ్చింది. అప్పటికి మన వీరేశలింగానికి ఐదేళ్ళు మాత్రమే. తల్లి, పెద తల్లితో పాటుగా ఈ పసివాడు పల్లకిలో వెళుతుండగా, కాలువ దాట వలసి వచ్చింది. కాలువలో నీరు రొమ్ము లోతు ఉంది. బోయీలు పల్లకిలోనికి నీరు రాకుండా పైకెత్తారు. వీరేశలింగం తల్లి చేతి నుండి జారి నీటిలో పడిపోయాడు. నీటిలో కొట్టుకుపోతున్న ఆ బాలుని బోయీ ఒకడు రక్షించాడు. ఈ విధంగా వీరేశలింగానికి మూడు గండాలు దాటాయి. ఇతడు అక్షరాభ్యాసం అయిన తరువాత దగ్గరలో గల వేణుగోపాల స్వామి ఆలయం బడిలో వేశారు. ఆ బడిలో తొర్రి నోరు గల శ్రీ పులిపాక అమ్మి రాజుగారు ఇతనికి ఉపాధ్యాయులు. అతని దగ్గర చదువుల వల్ల ముక్కుతో మాటలు అలవర్చు కున్నాడు. తర్వాత సోమరాజు ఉపాధ్యాయుని బడికి పంపారు. అతనికి గూని, అందుచేత పిల్లలు గూని సోమరాజు మాస్టారు అనేవారు. ఆ ఉపాధ్యాయుని వద్ద వీరేశలింగం రామాయణం, అమర కోశం, గాక రుక్మిణీ కళ్యాణం, సుమతీ శతకం, ఆంధ్ర నామ సంగ్రహం చక్కగా వల్లె వేయించారు. వీటితో తెలుగు చదువులకు స్వస్తి చెప్పాడు. ఇతనికి ఏడవ ఏటనే ఉపనయనం జరిగింది. ఆ తరువాత ప్రభుత్వ ఉద్యోగానికి కావలసిన ఇంగ్లీష్ చదువులు కూడా నేర్చు కున్నాడు. ఒకసారి చదివితే మరిచి పోయే వాడు కాదు. ఏకసంథాగ్రాహి అయినందువలన బడిలోని చదువులు బడిలోనే నేర్చుకునేవాడు. ఒకసారి ఇంటికి వచ్చాక అటక వెదికాడు. ఆ అటక పై నున్న తాళపత్ర గ్రంధాలు తీశాడు. దానితో తెలుగు భాషపై మక్కువ ఏర్పడింది. తెలుగు కావ్యాలను చదవాలనే కోరిక పెరిగింది.ఆ ప్రకారం చదవడం ప్రారంభించాడు.ఒకసారి ఎవరో 'వసుచరిత్ర' అద్భుతమైన కావ్యంఅన్న మాటలు వీరేశలింగం విన్నాడు. ఎలాగైనా ఆ గ్రంథం చదవాలని నిర్ణయించుకున్నాడు. తల్లి దగ్గరకు పోయి ఆ పుస్తకం కోసం డబ్బులు అడిగాడు.బాబూ! మనకు ఇంటి అద్దె మూడున్నర రూపాయలు వస్తుంది. అందులో నీకు తొమ్మిది నెలల బడి జీతంనాలుగున్నర రూపాయలు కట్టాలంటేనే చాలా కష్టమవుతుంది. నాలుగు రూపాయల ధర గల ఆ పుస్తకం నీవు ఇప్పుడు చదవకపోతే నష్టమేమీ లేదనితల్లి చెప్పే సరికి మారు మాటాడలేపోయాడు.తాను దాచుకొన్నదొక అర్థ రూపాయి. జీతంలో మిగిలిందొక అర్థ రూపాయి వెలసి ఒక రూపాయి. ఈ రూపాయితో పుస్తకం ఎలా వస్తుంది. కానీ ఆ గ్రంథం చదవాలనే గాఢమైన కోరిక మనసులో నిలిచిపోయింది. అతను అలా ముందుకుసాగుతూ ఉండగా పందిరి మహదేవుగారి పుస్తక దుకాణం కనిపించింది. యజమానిని చేరి, వసుచరిత్ర పుస్తకం ఒక్కసారి ఇవ్వమని అడిగాడు. అతడు ఇచ్చిన పుస్తకంలో రెండు పేజీలు చదివాడు.యజమాని కడకు పోయి, "నా దగ్గర అ ఒక్క రూపాయి ఉంది, తీసుకోండి .ప్రతి నెల అర్ధరూపాయి కడతాను నాకు ఈ పుస్తకం ఇవ్వండి" అని వినయంగా అడిగాడు. ఆ పిల్లవాడికి పుస్తకం పై గల మక్కువకు చాలా సంతోషించి, "మీ వద్ద గల రూపాయి నాకు ఇవ్వుబాబూ! ప్రతిరోజు ఇక్కడే కూర్చుని చదువుకో, ప్రతినెల అర్ధ రూపాయి చెల్లించి అప్పు తీరిన వెంటనే పుస్తకం తీసుకొని వెళ్ళు, ఈ విధంగా నీకు సహాయం చేయగలను" అని యజమాని చెప్పాడు. ఆ విధంగానే వీరేశలింగం చేయసాగాడు. బడికి వెళ్లడం లేదని మిత్రుల ద్వారా తల్లికి తెలిసీ నిలదీసింది, కానీ పుస్తకం కోసం బడికి వెళ్లడం లేదని తెలిసి, కాస్తా సంతోషపడింది, పుస్తకం కొనుక్కోమని మిగిలిన డబ్బులు ఇచ్చింది. పాఠశాలకు కూడా మిగిలిన రుసుము సొమ్ము చెల్లించి తల్లి బడికి కూడా పంపించి, చదివించింది. కానీ వీరేశలింగం తాను చేసిన తప్పునకు మనసులో ఎంతో కలత చెందాడు. ఒకసారి వీరేశలింగం తెలియనటువంటి వ్యాధికి గురయ్యాడు. చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడాడు. చాలామంది వైద్యులకు చూపించినా, ప్రయోజనం లేకపోయింది. చివరకు గండ్రాపు వెంకన్న అనే వైద్య శిఖామణి కూరగాయలతో వ్యాధి నయం చేశాడు. ఒకరోజు మండల న్యాయాధిపతి అయిన హెన్రీ మారిస్ దొర పాఠశాలలోని తరగతులను పర్యవేక్షించడానికి వచ్చాడు. తరగతులన్నీ పర్యవేక్షణ చేసి, పాఠశాలలో సత్ప్రవర్తన గల విద్యార్థి పేరు కాగితం మీద రాసి ఇవ్వవలసినదిగా విద్యార్థులందరికీ తెలియజేశాడు. ఆ పిల్లలు అందరూ రాసిన కాగితాలను ప్రోగు చేశాడు. పెక్కుమంది వీరేశలింగం పేరునే సూచించడంతో, పది రూపాయల విలువ గల పుస్తకాలు బహుమతియని తెలియజేశారు. వీరేశలింగం ఆ విలువకు తగిన తరగతి పుస్తకాలను మరియు నిఘంటువును కోరుకున్నాడు.వీరేశలింగం గారు తన చదువులనంతరం ఉద్యోగ ప్రయత్నం చేశారు. 20 రూపాయల కంటే మించిన జీతానికి 19 సంవత్సరాలు వయసు ఉండవలెనని నిబంధన. కానీ ఈయనకు 18 సంవత్సరాల వయస్సు ఉంది. ఇతడు 19 సంవత్సరాల వయస్సు అని అసత్యం చెబుతూ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. అధికారులు కూడా ఈయన దరఖాస్తు పరిశీలన చేయకనే ఉద్యోగమిచ్చేశారు. తర్వాత కాలంలో వీరేశలింగం గారు అసత్యమాడి నందులకు ఎంతో బాధ పడ్డారు. ( ఇంకా ఉంది ) - ఇది 88వ భాగం- బెహరా ఉమామహేశ్వరరావు- 9290061336


కామెంట్‌లు