కృషి ఉంటే ..: డా. కె . ఎల్ . వి , ప్రసాద్ ,--హనంకొండ ,వరంగల్ .

నా విద్యాభ్యాసానికి సంబంధించి మా వూళ్ళో (దిండి )ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత ,తాలూకా ప్రధానకేంద్రమైన రాజోలు -హై స్కూల్ లో చేరిన తర్వాత,మా గ్రామం నుండి రాజోలు ప్రతి దినం నడిచి వెళ్లడం కష్టం కావడం మూలాన అందరి మాదిరిగానే నేనూ వసతి గృహంలో ఉండక తప్పలేదు . అప్పుడు సాంఘీక సంక్షేమ వసతి గృహాలు ప్రైవేట్ వ్యక్తుల చేత నడపబడేవి. పిల్లలకు స్కూలర్ షిప్ విధానం అప్పుడుకూడా ఉండేది. నేను చేరిన వసతి గృహం (అప్పట్లో రాజోలులో ఒక్కటే మగపిల్లలకు ఉండేది )గొల్ల చంద్రయ్య అనే పెద్దాయన నడిపేవారు. ఆయన స్వాతంత్ర్య సమర యోధుడు. సేవాభావం కలవాడు. దళితుల అభివృధ్ధి--కోసం ఆయన అహర్నిశలూ పాటుపడేవారు. మహా కవి స్వర్గీయ బోయి-భీమన్న గారికి చంద్రయ్య గారు స్వయానా తన కూతురిని ఇచ్చిన మామ గారు. 
హాస్టల్లో మంచి క్రమశిక్షణకు ప్రాధాన్యత నిచ్చేవారు. మంచి అలవాట్లు నేర్పించేవారు. సమయ పాలన విషయంలో చాలా బాధ్యతగా వ్యవహరించే వారు. ఒక పద్ధతిప్రకారం చదివించడం ,నిద్రపోయేటట్టు చేయడం,ఉద-యామె లేచి చదువుకునేటట్టు ,సమయంప్రకారం బడికి వెళ్ళేటట్టు చూసేవారు. ఉదయం సాయంత్రం మాత్రమే మేనేజర్ చంద్రయ్య గారు హాస్టల్ కి వచ్చి హాజరు తీసుకునేవారు. మిగతా కార్యక్రమాలన్నీ వార్డెన్ చూసుకునేవారు. ఇప్పట్లా ,భోజనానికి సంబంధించి ప్రత్యేకమైన ‘మెనూ’అంటూ ఉండేది కాదు. పిల్లలు కూడా తిండి విషయంలో పెద్దగా పట్టించు--కొనేవారు కాదు,చదువే ధ్యేయంగా ఉండేవారు. అందుచేతనే ఆ .. హాస్టల్ లో వుండి చదువుకున్నవాళ్ళు చాలామంది పెద్ద .. పెద్ద .. హోదాలకు చేరుకోగలిగారు. అలాంటి వాళ్ళల్లో నేనూ ఒకడిని !ఇంతకీ ఈ నేపధ్యం అంతా ఎందుకు చెబుతున్నానంటే ,హాస్టల్ లో ప్రతి శనివారం సాయంత్రం ‘డిబేట్ ‘(ఉపన్యాస కార్యక్రమం )ఉండేది. ఏదో 
ఒక అంశం ఇచ్చేవారు. దానిని సమర్ధిస్తూ కొందరూ ,వ్యతిరేకిస్తూ కొందరూ మాట్లాడాలి . ఉదాహరణకు ‘’కత్తి గొప్పదా ?కలం గొప్పదా ?’’
వంటివి అన్నమాట . అసలు అలంటి కార్యక్రమం అక్కడ ఏర్పాటు చేయడం చాలా మంచి ఆలోచన. పిల్లలు భవిష్యత్తులో ఇంటర్వ్యూ లలో సభలు -సమావేశాల్లో తమ సత్తా చూపించే అవకాశం ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా అలవాటు అవుతుంది . జంకు గొంకు లేకుండా వేదికను సద్వినియోగం చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. అయితే ఆ .. డిబేట్ లో పాల్గొనడం అంటే భయం వేసేది. వణుకు పుట్టి వళ్లంతా చెమటలు పట్టేవి. శనివారం తలుచుకుంటేనే ఎక్కడికైనా పారిపోవాలనిపించేది ,పెద్దవాళ్ళు (సీనియర్స్ )ప్రోత్సాహించక పోగా భయపెట్టేవారు. అందుచేత తొంబై శాతం నేను తప్పించుకున్నాను. తర్వాత కొన్నిఅనా--రోగ్య కారణాలవల్ల రాజోలులో ఎనిమిదవ తరగతితోనే నా చదువు ముగిసినట్లు అయింది. తర్వాతి కాలంలో చదువుపట్ల ,సాహిత్య-సాంస్కృతిక అంశాల పట్ల కసి --పెరిగింది (బహుశః కసి పెంచుకున్నానేమో )ఫలితంగా వైద్యుడినయినానుఉపన్యాసకుడినయినాను ,రచయితనయినాను ,కవిని అయినాను,వ్యాసకర్త అయినాను. రేడియో /దూరదర్శన్ లను పుష్కలంగా ఉపయోగించు కున్నాను. ‘’కృషి ఉంటే .. మనుష్యులు ,ఋషు లవుతారు .. ‘’అన్న మాట సత్యదూరం కాదనుకుంటాను .