అదృశ్య శక్తులు అతీంద్రియ శక్తులు
పొరలు పొరలుగా కమ్ముకొస్తుంటే
తెరలు తెరలుగా ముసురుకొస్తుంటే
తలకిందులైన ఆకాశం భస్మంగా మారితే
నక్షత్రాలన్నీ నగ్నంగా నడిచొస్తున్నాయి.
ఓంకారం గాయత్రీ మంత్రం ఓం నమశ్శివాయ
స్వరం నిప్పంటుకొని యజ్ఞంలో ప్రతిధ్వనిస్తున్నాయి
సముద్రం కప్పేసిన తీరం ఉగ్రరూపం
మమ్మీల శవపేటికల రహస్యాల్ని ప్రతిష్టిస్తూ ప్రకటిస్తున్నాయి.
భీకర గాలిపటాలు ముక్కలు ముక్కలుగా మారి
సుడిగుండాల్లో కొట్టుకుపోతున్నాయి
కత్తుల్తో పొడిచినట్లు నిశ్శబ్దం మౌనంగా నేలకూలింది
పారిపోతున్న నీరు కాళ్లు చేతుల్ని తీసుకెళ్లింది
కిరీటం ధరించిన ధరణి పచ్చని రక్తంతో అభ్యంగన స్నానమాడింది.
చిందిన ఎరుపు -సూర్యుని గొంతులోంచి కారుతుంది
తెల్లని శాంతి వెన్నెల కళ్ళను పొడిచి చీకటితో జతకట్టింది.
అద్వైతం ధ్వజమెత్తి దీపాలన్నీ ఆర్పిందీ
గోపురాలు రాలిపోతూ పొగడపూలు గా మారిపోతున్నైవీ
నైవేద్యం యుద్ధ నినాదంగా మారినట్లు ఆకలి కేకలు దేవుళ్లను మేల్కొల్పుతున్నాయి.
రంగస్థలంపై కంఠాలన్నీ తెగిపడుతున్నాయి
తెరపడకముందే త్వర త్వరగా నాటకం ముగిసింది
రాలిపడ్డ సూర్యుని చూసి తిరిగే బొంగరం ఆగిపోయింది.
సిల్వర్ జూబ్లీ కళాశాల తమ్ముడు బొగ్గుల శ్రీనివాస్ గారి స్మృతిలో.
డా ప్రతాప్ కౌటిళ్యా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి