శిథిలమైన శిలగా మారిన నేను మీరు కానరాని ఈ బ్రతుకును వీడి గతించిపోవాలనుకున్నాను నాన్నా...
కనులప్రమిదల్లో మీ జ్ఞాపకాల చమురుతో జ్ఞానజ్యోతిలా వెలుగుతున్న మీరూపం కొండెక్కించటమెలానో నాకు తెలియడంలేదు నాన్న.
సత్తువలేని శరీరానికి సంజీవనిలా నాజీవితానికి అమృతకలశాన్నందించి తిరిగిరాని లోకానికి తరలిపోయారు నాన్నా...
మీ ఆలోచనలతో పటిష్టంగా రూపుదిద్దుకొన్న నేను ఎప్పటిలా ఇష్టంగా మీ ఆశయాలపల్లకిని మోస్తూనే జీవించేస్తున్నా నాన్న.
ఆకాశమంత మీ ఔన్నత్యం మదిలో మెదిలినప్పుడల్లా కరిగి నీరైపోయి నా కనులు చిప్పిల్లుతున్నాయి నాన్నా...
మీరు లేరన్న కఠిన నిజాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేక బాధాతప్త హృదయంతో బ్రతుకునీడ్చలేకపోతున్నా నాన్న.
మలిబడికి తొలిగురువై మార్గం చూపే స్నేహమై గమ్యం చేర్చే ప్రేమతో నన్ను ఉన్నతంగా తీర్చిదిద్దారు నాన్నా...
తీరే ఋణానుబంధం కాదని తెంచుకునిపోయే రక్తసంబంధమసలే కాదని నా ఉచ్ఛ్వాసనిశ్వాసల్లో మీరే నిండిపోయారు నాన్న.
చావు బ్రతుకుల చదరంగంలో అనుక్షణం కొట్టుమిట్టాడుతూ నా ఉన్నతికై పరిపరివిధాలుగా మీరు పరితపించారు నాన్నా...
అజరామరమైన సాటిలేని మీ త్యాగనిరతికి నా మది ద్రవీభూతమై పొంగిపొర్లుతున్న కన్నీటితో మీకు అభిషేకం చేయాలనుంది నాన్న.
నాకు మరో జన్మంటూ ఉంటే మీ బిడ్డగానే పుట్టాలని ఆశగా ఉన్నా మిమ్మల్ని నా బిడ్డగా పొందాలనే కోరిక నాలో బలపడుతున్నది నాన్నా...
నాన్నకే నాన్నగా మారి అచ్చంగా నాన్న ఆలనాపాలనా
చూసుకుంటూ చేయి పట్టి నడిపిన నాన్న చేతినే పట్టుకొని నడిపించాలని ఉంది నాన్న.